మెటాలో వేల మందికి ఉద్వాసన: హెచ్‌1బీ వీసా హోల్డర్లలో కలవరం

Job cuts Meta offers immigration support to H1B visa holders - Sakshi

మొత్తం సిబ్బందిలో  13 శాతం మందికి ఉద్వాసన 

పడిపోతున్న ఆదాయాలే కారణం

న్యూఢిల్లీ: టెక్నాలజీ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. టెక్‌ పరిశ్రమకు సవాళ్లు పెరుగుతుండటం, ఆదాయాలు పడిపోతుండటం వంటి పరిణామాల నేపథ్యంలో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా 11,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. మెటా మొత్తం సిబ్బంది సంఖ్యలో ఇది 13 శాతం. ఉద్యోగులకు రాసిన లేఖలో సంస్థ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఈ విషయాలు వెల్లడించారు. ‘కోవిడ్‌ మహమ్మారి తర్వాత కూడా భారీ వృద్ధి ఉంటుందనే అంచనాతో పెద్ద యెత్తున ఉద్యోగులను తీసుకున్నాం. దురదృష్టవశాత్తు నేను ఊహించిన విధంగా జరగలేదు. (రూ.2 వేల నోట్లు: షాకింగ్‌ ఆర్టీఐ రిప్లై)

ఆన్‌లైన్‌ కామర్స్‌ మళ్లీ పాత స్థాయికి వచ్చేసింది. స్థూల ఆర్థిక మందగమనం, పెరిగిన పోటీ, ప్రకటనలు తగ్గడం వంటి కారణాలతో ఆదాయాలు నేను ఊహించిన దానికన్నా తగ్గాయి. నేను పరిస్థితిని తప్పుగా అంచనా వేశాను. దీనికి బాధ్యుణ్ని నేనే‘ అని ఆయన పేర్కొన్నారు. మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌లో కూడా కోతల పర్వం నడుస్తున్న నేపథ్యంలో మెటాలోనూ ఉద్వాసనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్‌ మొదలైనవి మెటాలో భాగంగా ఉన్నాయి. తీసివేస్తున్న ఉద్యోగులకు ఈమెయిల్స్‌ వస్తాయని, వారికి కంపెనీ సిస్టమ్స్‌ ఇక అందుబాటులో ఉండవని జుకర్‌బర్గ్‌ తెలిపారు. మాజీ ఉద్యోగులకు 16 వారాల బేసిక్‌ పేతో పాటు కంపెనీలో పని చేసిన ప్రతి ఏడాదికిగాను 2 వారాల జీతం లభిస్తుంది. 6 నెలల పాటు వారితో పాటు వారి కుటుంబ సభ్యులకూ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పని చేస్తుంది.  

ఇదీ చదవండి: క్యూ కడుతున్న టాప్‌ కంపెనీలు: అయ్యయ్యో ఎలాన్‌ మస్క్‌!

టెక్‌ సంస్థలకు సవాళ్లు.. 
కోవిడ్‌ సమయంలో లాక్‌డౌన్‌ల వల్ల ఇళ్లకే పరిమితం కావడంతో ప్రజలు సోషల్‌ మీడియాను గణనీయంగా ఉపయోగించారు. దీంతో ఆయా కంపెనీలకూ భారీగా ఆదాయాలు వచ్చాయి. అయితే, లాక్‌డౌన్‌లు ముగిసి, ప్రజలు తిరిగి దైనందిన జీవితాల్లో పడిపోయిన తర్వాత వాటి ఆదాయాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రత్యేకంగా మెటా విషయానికొస్తే.. డిజిటల్‌ యూనివర్స్‌ ’మెటావర్స్‌’ పై భారీగా పెట్టుబడులు పెడుతుండటం ఇన్వెస్టర్లను కలవరపరుస్తోంది. అటు టెక్‌ దిగ్గజం యాపిల్‌ ప్రైవసీ టూల్స్‌ సైతం సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు సమస్యగా మారుతున్నాయి. వీటి వల్ల యూజర్ల అనుమతి లేకుండా వారిని ట్రాక్‌ చేయడం, ప్రత్యేకంగా టార్గెట్‌ చేసే ప్రకటనలు చూపడం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌ లాంటి సంస్థలకు కష్టతరమవుతోంది. అలాగే యువత ఎక్కువగా టిక్‌టాక్‌ వైపు మళ్లుతుండటం ఇన్‌స్టాగ్రామ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోంది.

భారత్‌లోని ఉద్యోగుల్లో కలవరం.. 
ఏయే దేశాల్లో ఏ మేరకు కోతలు ఉంటాయనేది తెలియకపోవడంతో భారత్‌లోని మెటా ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్‌లకు సంబంధించి మెటాకు భారత్‌లో 300–400 మంది ఉద్యోగులు ఉన్నారు. వీటిలో 60 మంది సిబ్బంది గల వాట్సాప్‌ బృందమే చిన్నది. మెటా ఇండియా హెడ్‌ అజిత్‌ మోహన్‌ ఇటీవలే రాజీనామా చేసి పోటీ సంస్థ స్నాప్‌లో చేరారు.

హెచ్‌1బీ వీసా హోల్డర్లకు సహకారం
ఉద్వాసనకు గురైన వారిలో హెచ్‌1బీ వీసాహోల్డర్లు ఉంటే ఇమ్మిగ్రేషన్‌ పరంగా వారికి అవసరమైన పూర్తి సహాయ, సహకారాలను కంపెనీ అందిస్తుందని జుకర్‌బర్గ్‌ తెలిపారు. తమ దేశంలో పని చేసేందుకు విదేశీయులకు అమెరికా ఈ వీసాలు జారీ చేస్తుంది. అకస్మాత్తుగా ఉద్యోగం పోతే, తమ వీసాను స్పాన్సర్‌ చేసే మరో కంపెనీలో ఉద్యోగాన్ని 60 రోజుల్లోగా చూసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే వీసా గడువు ముగిసిపోతుంది. పలు అమెరికన్‌ కంపెనీల్లో భారత్, చైనా నుంచి చాలా మటుకు ఉద్యోగులు ఉన్నారు. ప్రధానంగా ఫేస్‌బుక్‌లో వీరి సంఖ్య 15శాతం పైనే. ఉద్యోగాల్లో కోతల వల్ల ఇలాంటి హెచ్‌1బీ వీసాహోల్డర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top