Google Maps Features: గూగుల్‌ మ్యాప్స్‌లో అద్భుతమైన అప్‌డేట్స్‌, చూసి మురిసిపోవాల్సిందే!

Google Maps launches Immersive View in five cities glanceable directions coming soon - Sakshi

న్యూఢిల్లీ: సెర్చ్‌ ఇంజీన్‌ దిగ్గజం గూగుల్‌ తన మాప్స్‌లో కొత్త ఫీచర్‌ను లాంచ్‌ చేసింది. తన నావిగేషన్‌ యాప్‌ వినియోగదారులను మరింత ఆకట్టుకునేలా  కొత్త అప్‌డేట్స్‌ను పారిస్‌లో జరిగిన కార్యక్రమంలో కంపెనీ ప్రకటించింది. ఇమ్మర్సివ్ వ్యూ అనే కొత్త ఫీచర్‌తో గూగుల్ మ్యాప్స్‌లో జత చేసింది. ప్రస్తుతం యూరప్‌లోని ఐదు కీలక నగరాల్లో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ను త్వరలోనే  మిగిలిన నగరాల్లో  కూడా అందుబాటులోకి తీసుకురానుంది.

ఈ ఫీచర్‌ ద్వారా  గూగుల్‌మ్యాప్‌లో మరింత  స్పష్టంగా ఆయా ప్రదేశాలను మనకు చూపించనుంది.  గూగుల్‌ మ్యాప్స్‌లో సాధారణ స్ట్రీట్ వ్యూ ఫీచర్ లాగానే ఉంటుంది.మరిన్ని స్ట్రీట్ వ్యూ, ఏరియల్‌ ఇమేజెస్‌తో వర్చువల్ వరల్డ్ మోడల్‌ను అందిస్తుంది.వాతావరణం, ట్రాఫిక్, లొకేషన్ ఎంత బిజీగా ఉంది అనే వివరాలుంటాయి. రాబోయే నెలల్లో ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ లో ప్రపంచవ్యాప్తంగా “గ్లాన్సబుల్ డైరెక్షన్స్” అనే కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది.

లండన్, లాస్ ఏంజిల్స్, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో ,టోక్యో అనే ఐదు నగరాల్లో ఇమ్మెర్సివ్ వ్యూ ని   తీసుకొచ్చింది. అలాగే ఆమ్‌స్టర్‌డామ్, డబ్లిన్, ఫ్లోరెన్స్, వెనిస్‌లతో సహా మరిన్ని నగరాలకు ఈ ఫీచర్‌ను విడుదల చేయాలని భావిస్తోంది. తద్వారా ఆయా నగరాలను సందర్శించే ముందు ప్లాన్ చేసుకోవడంతోపాటు, దానిగురించి అవగాహన పొందడంలో యూజర్లకు సహాయపడుతుందని ఒక బ్లాగ్ పోస్ట్‌లో గూగుల్‌ తెలిపింది. ఈ ఫీచర్‌లోని ఎడ్వాన్స్‌డ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌  ద్వారా కంప్యూటర్‌ వ్యూలో డిజిటల్‌ వరల్డ్‌ని వీక్షించవచ్చనిపేర్కొంది. 

ఈ వాస్తవిక దృశ్యాలను రూపొందించడానికి సాధారణ చిత్రాలను 3డీ ఇమేజెస్‌గా మార్చే అధునాతన ఏఐ సాంకేతికత అయిన న్యూరల్ రేడియన్స్ ఫీల్డ్‌లను (NeRF) ఉపయోగిస్తుందని గూగుల్ తెలిపింది. ఆమ్‌స్టర్‌డామ్‌లోని రిజ్‌క్స్‌ మ్యూజియం వీడియోను  షేర్‌ చేసింది. వర్చువల్‌గా బిల్డింగ్‌ పైన వున్న ఫీలింగ్‌ కలుగుతుందని వెల్లడించింది.

అలాగే ఏటీఎంలు, రెస్టారెంట్‌లు, పార్కులు, రెస్ట్‌రూమ్‌లు, లాంజ్‌లు, టాక్సీస్టాండ్‌లు, రెంటల్‌ కార్స్‌, ట్రాన్సిట్ స్టేషన్‌లు వంటి అనేక విషయాలను గుర్తించడంలో సహాయపడటానికి  మరో ఫీచర్‌ యాడ్‌ చేసింది.  ఏఐ, ఆగ్మెంటెడ్ రియాలిటీ సాయంతో రూపొందించిన “సెర్చ్‌ విత్‌ లైవ్ వ్యూ” గురించి కూడా పోస్ట్  వెల్లడించింది. ఈ లైవ్ వ్యూ ని లండన్, లాస్ ఏంజెల్స్, న్యూయార్క్, పారిస్, శాన్ ఫ్రాన్సిస్కో  టోక్యోలలో ప్రారంచింది. బార్సిలోనా, బెర్లిన్, ఫ్రాంక్‌ఫర్ట్, లండన్, మాడ్రిడ్, మెల్‌బోర్న్, పారిస్, ప్రేగ్, సావో పాలో, సింగపూర్, సిడ్నీ తైపీ వంటి అనేక నగరాల్లోని 1,000 కొత్త విమానాశ్రయాలు, రైలు స్టేషన్‌లు , మాల్స్‌ లాంటి  వివరాలు  రానున్న నెలల్లో అందిస్తామని గూగుల్‌ వెల్లడించింది.

కాగా కంపెనీ తన I/O డెవలపర్ కాన్ఫరెన్స్‌లో గత సంవత్సరం ఇమ్మర్సివ్ వ్యూని  తొలిసారి ప్రకటించింది. ఈ ఫీచర్ 2022 చివరిలో అందుబాటులోకి వస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.అప్పటినుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ఫీచర్‌ను ఎట్టకేలకు లాంచ్‌ చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top