
తదుపరి టార్గెట్ 4,900 డాలర్లు!
2026 చివరికి చేరుకోవచ్చు
గోల్డ్‌మన్ శాక్స్ అంచనాలు
న్యూఢిల్లీ: కనకం రోజుకో కొత్త రికార్డులతో ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో తొలిసారి 4,000 డాలర్ల (ఔన్స్‌కు) కీలక మైలురాయిని దాటింది. కామెక్స్ ఫ్యూచర్స్‌లో 4,014 డాలర్ల స్థాయిని నమోదు నమోదు చేసింది. దీంతో అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ శాక్స్ 2026 చివరికి 4,900 డాలర్లకు చేరుకోవచ్చని ప్రకటించింది. 4,300 డాలర్ల గత అంచనాలను భారీగా పెంచింది. పసిడి ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు)లోకి అదే పనిగా వస్తున్న పెట్టుబడులు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్ల నేపథ్యంలో ఈ అంచనాకు వచ్చింది.
ప్రైవేటు రంగం వైవిధ్యం కోసం గోల్డ్ ఈటీఎఫ్‌లను ఆశ్రయిస్తుండడాన్ని సైతం పరిగణనలోకి తీసుకుంది. సెంట్రల్ బ్యాంక్‌లు 2025లో నెలకు 80 టన్నులు, 2026లో నెలకు 70 టన్నుల మేర బంగారం కొనుగోలు చేయొచ్చని అంచనా వేసింది. ముఖ్యంగా వర్ధమాన దేశాల సెంట్రల్ బ్యాంకులు ఈ దిశగా కీలక పాత్ర పోషిస్తున్నట్టు పేర్కొంది. ఇక యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై అంచనాలు సైతం బంగారంలో బుల్లిష్ సెంటిమెంట్‌కు కారణంగా తెలిపింది. 2026 మధ్య నాటికి ఫెడ్ 100 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గించొచ్చని.. ఇది బంగారం తదితర ఆస్తులకు డిమాండ్‌ను పెంచుతుందని పేర్కొంది. ఈ ఏడాది గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు 17 శాతం పెరగడాన్ని మెహతా ఈక్విటీస్ కమోడిటీ విభాగం వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కళంత్రి సైతం గుర్తు చేశారు.
అమెరికాలో ఆర్థిక అనిశ్చితులు, ఫ్రాన్స్ తదితర దేశాల్లో రాజకీయ అలజడులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సైతం సురక్షిత సాధనంగా బంగారానికి డిమాండ్‌ను పెంచుతున్నట్టు చెప్పారు.
దేశీయంగా రూ.1.24 లక్షలు
ఢిల్లీ మార్కెట్లో పుత్తడి ధర (99.9 శాతం స్వచ్ఛత) మంగళవారం సరికొత్త ఆల్‌టైమ్ గరిష్టం రూ.1,24,000ను నమోదు చేసింది. 10 గ్రాములకు రూ.700 లాభపడింది. వెండి కిలోకి రూ.3,400 లాభపడి రూ.1,54,000కు చేరుకుంది.