
లగ్జరీ వాహనాల అక్రమ దిగుమతిపై కొచ్చి కమిషనరేట్ ఆఫ్ కస్టమ్స్ (ప్రివెంటివ్) కేరళ వ్యాప్తంగా భారీ దాడులను ప్రారంభించింది. ఇందులో భాగంగానే సినీ తారలు, పారిశ్రామికవేత్తలు, సీనియర్ అధికారులతో సహా వారి నివాసాలలో.. తిరువనంతపురం, ఎర్నాకుళం, కొట్టాయం, కోజికోడ్, మలప్పురం జిల్లాల్లోని 30 ప్రదేశాలలో రవాణ కస్టమ్స్ అధికారులు దాడులు చేశారు. ఇందులో నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) పేరు కూడా వినిపిస్తోంది. అయన నివాసంలో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు.
నిజానికి నటుడు దుల్కర్ ఆటోమొబైల్ ఔత్సాహికుడు. ఈ కారణంగానే ఈయన ఒక ప్రత్యేకమైన గ్యారేజ్ ఏర్పాటు చేసుకుని, ఇందులో అత్యంత ఖరీదైన వాహనాలను నిలుపుకున్నారు. ఈ కథనంలో దుల్కర్ సల్మాన్ గ్యారేజిలోని కార్ల గురించి తెలుసుకుందాం.
ఫెరారీ 296 జీబీటీ: రోసో రుబినో ఫెరారీ 296 GTB అనేది దుల్కర్ గ్యారేజీలో మొదటి హైబ్రిడ్ ఫెరారీ. దీని ప్రారంభ ధర భారతదేశంలో దాదాపు రూ. 5.88 కోట్లు. ఈ కారును దుల్కర్ సల్మాన్ స్వయంగా డ్రైవ్ చేస్తూ.. చెన్నై వీధుల్లో చాలాసార్లు కనిపించారు.
పోర్స్చే 911 జీటీ3: ఈ కారు ధర రూ. 2.3 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు ఉంటుంది. ఇది మంచి డ్రైవింగ్ అనుభూతిని అందించిస్తుందని దుల్కర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్వయంగా వెల్లడించారు. ఇది ఆయనకు ఇష్టమైన కార్లలో ఒకటని కూడా సమాచారం.
మెర్సిడెస్-బెంజ్ ఎస్ఎల్ఎస్ ఏఎంజీ: ఈ కారు సుమారు ఎనిమిది సంవత్సరాలుగా దుల్కర్ గ్యారేజిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని దుల్కర్ ఫ్యూచర్ క్లాసిక్ అని పిలుస్తారు. ఈ కారు ప్రారంభ ధర రూ. 2.54 కోట్లు.
బీఎండబ్ల్యు ఎం3 ఈ46: ఆటోమొబైల్ ఔత్సాహికులు ఈ కారును అత్యుత్తమ బీఎండబ్ల్యుగా పరిగణిస్తారు. దీని ప్రారంభ ధర సుమారు రూ. 50 లక్షలు అని సమాచారం. ప్రస్తుతం ఈ కారు ఉత్పత్తిలో లేదు. కానీ ఇప్పటికే కొనుగోలు చేసినవారు మాత్రం వినియోగిస్తున్నారు.
దుల్కర్ సల్మాన్ ఇతర కార్లు
నటుడు దుల్కర్ సల్మాన్ గ్యారేజిలో పైన చెప్పిన కార్లు మాత్రమే కాకుండా.. పోర్స్చే పనామెరా, మెర్సిడెస్ మేబాచ్ జీఎల్ఎస్ 600, మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్, మెర్సిడెస్ ఏఎంజీ జీ63, మెర్సిడెస్ ఏఎంజీ ఏ45, బీఎండబ్ల్యూ 7 సిరీస్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్, ల్యాండ్ రోవర్ డిఫెండర్, ఫోక్స్‌వ్యాగన్ పోలో జీటీఐ, మినీ కూపర్ ఎస్, మాజ్డా ఎంఎక్స్5, టయోటా ఇన్నోవా క్రిస్టా కూడా ఉన్నాయి.
ఇదీ చదవండి: ఆగస్టులో ఎక్కువమంది కొన్న కార్లు.. ఇవే!