
భారత్ అమలు చేస్తున్న సరళతర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం (ఎఫ్‌డీఐ) విదేశీ ఇన్వెస్టర్లకు అపారమైన పెట్టుబడి అవకాశాలను ఆఫర్ చేస్తోందని డెలాయిట్ ఇండియా తెలిపింది. ఫార్మాస్యూటికల్స్, ఆటో, పర్యాటక రంగాలకు ఎఫ్‌డీఐలను ఆకర్షించే శక్తితోపాటు ఉపాధి కల్పనకు చోదకాలుగా నిలవగలవని పేర్కొంది. వీటికితోడుగా ఎగుమతులు, ఆవిష్కరణలు భారత్ తదుపరి దశ వృద్ధిని నడిపించగలవని తెలిపింది.
చాలా రంగాల్లో ఆటోమేటిక్ మార్గంలో(అనుమతుల్లేని) 100 శాతం ఎఫ్‌డీఐల రాకకు అనుమతించడం ద్వారా భారత్ ఎంతో ప్రగతి సాధించినట్టు డెలాయిట్ ఇండియా గుర్తు చేసింది. పర్యాటకం, నిర్మాణం, హాస్పిటల్స్, మెడికల్ డివైజ్‌లను ప్రస్తావించింది. ఈ విధాన నిర్ణయాలు స్థిరత్వాన్ని, స్పష్టతను అందిస్తున్నట్టు డెలాయిడ్ ఇండియా ఆర్థికవేత్త రుమ్కి మజుందార్ పేర్కొన్నారు. 70 బిలియన్ డాలర్ల జాతీయ మోనిటైజేషన్ పైపులైన్, 100 పట్టణాల్లో పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి కార్యక్రమాలు అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు వెంటనే కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు వీలైన పెట్టుబడి జోన్‌లను అందిస్తున్నట్టు చెప్పారు.
ఇదీ చదవండి: మార్కెట్లపై రెండింటి ఎఫెక్ట్
పర్యాటకం, ఆతిథ్య రంగంలో హోటళ్లు, రిక్రియేషన్ కేంద్రాల నిర్మాణానికి 100 శాతం ఎఫ్‌డీఐని అనుమతిస్తున్నట్టు మజుందార్ గుర్తు చేశారు. పారదర్శక, స్థిరమైన పెట్టుబడుల కేంద్రంగా భారత్ ప్రతిష్ట దీంతో మరింత ఇనుమడిస్తుందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం, సరళతర ఎఫ్‌డీఐ విధానం.. లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, పట్టణాభివృద్ధి రంగాల్లో అపార అవకాశాలను తీసుకొస్తున్నట్టు మజుందార్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం (2024–2025) తొలి తొమ్మిది నెలల్లో (ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు) 27 శాతం అధికంగా 40.67 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐ భారత్‌లోకి రావడం గమనార్హం.