
జూలైలో రూ.1.93 లక్షల కోట్లు
చెలామణిలో 11.16 కోట్ల కార్డులు
ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడి
ముంబై: దేశీయంగా క్రెడిట్ కార్డు ద్వారా చేస్తున్న వ్యయాలు 2025 జూలైలో జీవితకాల గరిష్టానికి చేరాయి. ఒకే నెలలో ఏకంగా రూ.1.93 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు జూన్‌లో నమోదైన రూ.1.83 లక్షల కోట్లతో పోలిస్తే 6% పెరిగాయి. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం ... పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్) ద్వారా క్రెడిట్ కార్డ్ లావాదేవీలు జూలైలో 4.3 శాతం పెరిగి రూ.70,380 కోట్లకు చేరాయి.
అంతర్జాతీయ లావాదేవీలు పరిశీలిస్తే.. మొత్తం వ్యయాలు రూ.7,467 కోట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు నెల జూన్‌లో నమోదైన రూ.8,251 కోట్లతో పోలిస్తే 9.5% మేర తగ్గాయి. పలు దేశీయ రుణ సంస్థలు లక్షల సంఖ్యలో కొత్త కార్డులు జారీ చేయడంతో ఈ ఏడాది జూలై ఆఖరు నాటికి చెలామణీలో ఉన్న క్రెడిట్ కార్డుల సంఖ్య 11.16 కోట్లకు చేరింది. డెబిట్ కార్డుల సంఖ్య 101 కోట్లుగా ఉంది. పండుగ సీజన్ ప్రారంభం నేపథ్యంలో కార్డుల వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని విశేషాలు..
→ డెబిట్ కార్డుల వ్యయాలు జూలైలో రూ.2,247 కోట్లుగా, జూన్‌లో రూ.2,182 కోట్లుగా ఉన్నాయి.
→ మొత్తం యూపీఐ లావాదేవీలు రూ.25 లక్షల కోట్లు చేరాయి. జూన్‌లో నమోదైన రూ.24.03 లక్షల కోట్లతో పోలిస్తే 4% పెరిగాయి. 2024 జూలైలో రూ.20.64 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి.
→ మోసపూరిత లావాదేవీల సంఖ్య పెరిగింది. 2025 జూలైలో ఈ తరహా లావాదేవీల మొత్తం విలువ రూ.440 కోట్లుకి చేరింది. జూన్‌లో ఇది రూ. 303 కోట్లుగా ఉంది. ప్రతి 81,444 లావాదేవీల్లో ఒకటి మోసపూరితమైనదిగా గుర్తించారు.
→ క్రెడిట్ కార్డుల విషయంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అగ్రస్థానంలో ఉంది. 3.15 లక్షల కొత్త కార్డులు జారీ చేయడంతో జూలై ఆఖరు నాటికి బ్యాంకు క్రెడిట్ కార్డుల సంఖ్య 2.48 కోట్లకు చేరింది.
→ 66,640 కొత్త కార్డుల జారీ చేయడం ద్వారా 2.12 కోట్ల క్రెడిట్ కార్డులతో ఎస్‌బీఐ రెండో స్థానంలో ఉంది.
→ ఐసీఐసీఐ బ్యాంకు 67,664, యాక్సిస్ బ్యాంకు 1.22 లక్షల కొత్త క్రిడెట్ కార్డులు జారీ చేశాయి.