బీహెచ్‌ఈఎల్‌ లాభం హైజంప్‌ | BHEL jumps 10percent on strong Q4 profit beat estimates | Sakshi
Sakshi News home page

బీహెచ్‌ఈఎల్‌ లాభం హైజంప్‌

May 5 2026 4:27 AM | Updated on May 5 2026 4:27 AM

BHEL jumps 10percent on strong Q4 profit beat estimates

క్యూ4లో రూ. 1,290 కోట్లు 

షేరుకి రూ. 1.4 తుది డివిడెండ్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంజనీరింగ్, తయారీ దిగ్గజం భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌(బీహెచ్‌ఈఎల్‌) గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 2.5 రెట్లు ఎగసి రూ. 1,290 కోట్లను అధిగమించింది. ప్రధానంగా విద్యుత్‌ ఉపకరణాల విభాగం జోరు ఇందుకు సహకరించింది. అంతక్రితం ఏడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 504 కోట్లు ఆర్జించింది. 

వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 1.40 చొప్పున తుది డివిడెండ్‌ ప్రకటించింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం రూ. 9,143 కోట్ల నుంచి రూ. 12,554 కోట్లకు జంప్‌చేసింది. దీనిలో విద్యుత్‌ విభాగం టర్నోవర్‌ రూ. 9,510 కోట్లకు బలపడింది. అంతక్రితం క్యూ4లో రూ. 6,192 కోట్లు మాత్రమే నమోదైంది. 

ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి బీహెచ్‌ఈఎల్‌ నిక ర లాభం మూడు రెట్లు వృద్ధిచెంది రూ. 1,600 కోట్లను దాటింది. 2024–25లో కేవలం రూ. 534 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 28,805 కోట్ల నుంచి రూ. 34,590 కోట్లకు పుంజుకుంది. దీనిలో విద్యుత్‌ ఉపకరణాల టర్నోవర్‌ రూ. 20,937 కోట్ల నుంచి రూ. 25,407 కోట్లకు పురోగమించింది.  
 

ఫలితాల నేపథ్యంలో బీహెచ్‌ఈఎల్‌ షేరు బీఎస్‌ఈలో 7 శాతం జంప్‌చేసి రూ. 377 వద్ద ముగిసింది. ఒక దశలో రూ. 399కు దూసుకెళ్లి 52 వారాల గరిష్టాన్ని తాకింది.

Advertisement
 
Advertisement
Advertisement