
మార్కెట్ల పరిస్థితి ఒక్కో రోజు ఒక్కో రకంగా ఉంటుంది. ఒకరోజేమో అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు, మారిపోతున్న సమీకరణాల వల్ల కార్పొరేట్లపై ఎలాంటి ప్రభావం ఉంటుందోననే ఆందోళన. మరుసటి రోజు కార్పొరేట్ల ఆదాయాలు, వృద్ధి అంచనాలు సానుకూలంగా కనిపించడంతో చాలా ఉత్సాహం. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు కొత్త ధోరణుల వెంటబడటం కాకుండా ఒక స్పష్టమైన, దీర్ఘకాలిక ప్రణాళిక ఉండటం మంచిది. ఇది గుర్తించే చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు ప్రస్తుతం ప్యాసివ్ వ్యూహాల వైపు మళ్లుతున్నారు.
తక్కువ వ్యయాలతో, పారదర్శకంగా, అందుబాటులో ఉండే ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు మెరుగ్గా రాణిస్తుండటంతో ఈ వ్యూహాన్ని ఎంచుకునే రిటైల్ ఇన్వెస్టర్లు కూడా పెరుగుతున్నారు. సులభతరంగా ఇన్వెస్ట్ చేసేందుకు, పెట్టుబడులను ట్రాక్ చేసుకునేందుకు డిజిటల్ ప్లాట్‌ఫాంలు వీలు కల్పిస్తుండడం, నియంత్రణ సంస్థలపరమైన మద్దతు, కొత్త ఆవిష్కరణలు కూడా ప్యాసివ్ ఫండ్స్ మరింత ప్రాచుర్యంలోకి రావడానికి దోహదపడుతున్నాయి.
పలు ప్రయోజనాలు ..
తక్కువ వ్యయాలు
ప్యాసివ్ ఇన్వెస్టింగ్‌లో అత్యంత ప్రయోజనకరమైన అంశమేమిటంటే, వీటిలో వ్యయాలు చాలా తక్కువగా ఉంటాయి. సాధారణంగా తరచుగా ట్రేడింగ్ చేయడం లేదా క్రియాశీలకమైన నిర్వహణ అవసరం ఉండదు కాబట్టి ఈ ఫండ్స్ వ్యయ నిష్పత్తులు చాలా తక్కువగా ఉంటాయి. ఈ వ్యత్యాసం తొలినాళ్లలో పెద్దగా తెలియకపోయినప్పటికీ, కాలక్రమేణా పోర్ట్‌ఫోలియో విలువ గణనీయంగా పెరిగినప్పుడు తెలుస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక ప్రణాళికలున్న వారికి, కెరియర్ ప్రారంభ దశలోని ఇన్వెస్టర్లకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కాంపౌండింగ్ కారణంగా, ఫీజుల భారం కొంచెం తగ్గినా కూడా, దీర్ఘకాలిక రాబడులు పెరిగేందుకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది.
వైవిధ్యం
వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవడం చాలా సవాళ్లతో కూడుకున్నదై ఉంటుంది. ముఖ్యంగా కొత్త ఇన్వెస్టర్లకు ఇది ఇంకా కష్టంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఒకే ఇన్వెస్ట్‌మెంట్‌తో విస్తృత పెట్టుబడుల అవకాశాలను ప్యాసివ్ ఫండ్స్ కల్పిస్తాయి. ఇండెక్స్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్‌లనేవి వివిధ రంగాల్లోను, భౌగోళికంగా వివిధ ప్రాంతాలవ్యాప్తంగా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా, పెట్టుబడులపరమైన రి స్క్‌లను తగ్గించుకునేందుకు తోడ్పడతాయి. అంతగా సమయం కేటాయించలేనివారు, కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్నవారు ఒక్కొక్క సెక్యూరిటీని విడివిడిగా ఎంచుకోవాల్సిన అవసరం లేకుండానే డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియోను నిర్మించుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి.
పారదర్శకత
బెంచ్‌మార్క్ సూచీలను ప్రతిబింబించడం ద్వారా ప్యాసివ్ ఫండ్స్ ఒక సిస్టమాటిక్ విధానాన్ని పాటిస్తాయి. భావోద్వేగాలతో, మార్కెట్ ఊహాగానాలతో నిర్ణయాలు తీసుకోవడం లేదా వ్యూహాల్లో స్వల్పకాలిక మార్పులు, చేర్పులు చేయడంలాంటి ధోరణులు వీటిలో ఉండవు. క్రమశిక్షణకు విలువనిస్తూ, దీర్ఘకాలిక లక్ష్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టే ఇన్వెస్టర్లకు ఈ పారదర్శకత ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. రాబడులపై ప్రతికూల ప్రభావం చూపే భావోద్వేగాలపరమైన నిర్ణయాలు తీసుకోకుండా, మార్కెట్ పరిస్థితులకు అతీతంగా
పెట్టుబడులను కొనసాగించేందుకు ఇన్వెస్టర్లకు ఇవి తోడ్పడతాయి.
పోర్ట్‌ఫోలియోకి స్థిరత్వం
ఎలాంటి పెట్టుబడి వ్యూహానికైనా ప్యాసివ్ ఫండ్స్ అనేవి పటిష్టమైన పునాదిగా నిలుస్తాయి. రిటైర్మెంట్, గృహం, పిల్లల చదువు లేదా సంపద సృష్టి ఇలా ఏ లక్ష్యం కోసం ఇన్వెస్ట్ చేస్తున్నా సరే, దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు అవసరమైన స్థిరత్వం, క్రమశిక్షణను ప్యాసివ్ ఫండ్స్ అందిస్తాయి. కొత్త ఇన్వెస్టర్ల విషయానికొస్తే చాలా సరళంగా, చాలా తక్కువ వ్యయాలతో పెట్టుబడులు ప్రారంభించేందుకు సహాయకరంగా ఉంటాయి. అనుభవజ్ఞులైన ఇన్వెస్టర్ల విషయాన్ని తీసుకుంటే యాక్టివ్ వ్యూహాలతో సమతూకం పాటించేందుకు, ఓవరాల్ ఖర్చులను తగ్గించుకునేందుకు ఉపయోగపడతాయి. ప్యాసివ్ ఇన్వెస్టింగ్ పరిధి మరింత విస్తృతమవుతోంది. కేవలం లార్జ్ క్యాప్ ఈక్విటీ సూచీలకే పరిమితం కాకుండా డెట్ మార్కెట్లు, అంతర్జాతీయంగా పెట్టుబడులు, సెక్టార్ ఆధారిత సూచీలు, ఫ్యాక్టర్ స్ట్రాటజీల్లో అంతర్జాతీయంగా ప్యాసివ్ ఆప్షన్స్‌కి ఆదరణ పెరుగుతోంది.
ఇంతటి వైవిధ్యం వల్లే మీ లక్ష్యాలకు అనుగుణంగా పోర్ట్‌ఫోలియోను తీర్చిదిద్దుకునేందుకు, ఎలాంటి మార్కెట్ పరిస్థితుల్లోనైనా అది పటిష్టంగా ఉండేలా చూసుకునేందుకు ప్యాసివ్ వ్యూహం తోడ్పడుతుంది. ఊహాగానాలు, అంచనాలు, వేగవంతమైన ట్రేడింగ్‌లతో హడావిడిగా ఉండే ప్రపంచంలో, ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అనేది ఒక స్పష్టతనిస్తుంది. దీర్ఘకాలిక లక్ష్యాలపై ఫోకస్ పెట్టేందుకు, కాంపౌండింగ్ ప్రయోజనాలు పొందేందుకు, నిరంతరం మార్కెట్‌ను ట్రాక్ చేయాల్సిన ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఇవి తోడ్పడతాయి. ఇప్పుడిప్పుడే పెట్టుబడుల ప్రస్థానం ప్రారంభిస్తున్నా లేక రిటైర్మెంట్ నిధిని ఏర్పర్చుకోవాలనుకుంటున్నా అందుకు తగిన స్థిరత్వాన్ని, నిలకడను ప్యాసివ్ ఫండ్స్ అందిస్తాయి. నిఫ్టీ 100 లేదా నిఫ్టీ 500 ఇండెక్స్ ఫండ్‌లాంటి సరళమైన ప్యాసివ్ ఫండ్‌ను ప్రధాన సాధనంగా తీసుకుని ఇన్వెస్టర్లు, పెట్టుబడులను ప్రారంభించవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగిస్తూ వెళ్తే కాలక్రమేణా సత్ఫలితాలు వాటంతటవే వస్తాయి.
