రామయ్యను దర్శించుకున్న పరిక్రమణ సమితి
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని గోదావరి నది పరిక్రమణ(ప్రదక్షిణ) సమితి బృందం బుధవారం దర్శించుకుంది. బృందం సభ్యులకు ఈఓ దామోదర్‌రావు, అర్చకులు స్వాగతం పలకగా, ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకున్నారు. పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ గోదావరి పరివాహక ప్రాంతాల ప్రదక్షిణలో భాగంగా స్వామి వారిని దర్శించుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, సాధువుల బృందం, తదితరులు పాల్గొన్నారు.
స్వామి వారి వస్త్రాల
నిలిపివేత...?
భద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో స్వామి వారి వస్త్రాల కేంద్రం టెండర్‌దారునికి భక్తులు సమర్పించే వస్త్రాలను అందజేయటం నిలిపివేసినట్లు సమాచారం. స్వామి వారి వస్త్రాల పేరుతో బయటి మార్కెట్‌లో లభించేవి ఇటీవల కాలంలో ఆ కేంద్రం వద్ద ఆలయ సిబ్బంది పట్టుకున్న విషయం విదితమే. దీనిపై ఆ కాంట్రాక్టర్‌కు నోటీస్ జారీ చేశారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా వస్త్రాలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. మరో నెల రోజుల్లో ఆ కాంట్రాక్టర్ కాలపరిమితి ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ వస్త్రాలను గతంలో మాదిరిగా దేవస్థానం సిబ్బందితోనే విక్రయించాలనే యోచనలో ఆలయ అధికారులు ఉన్నట్లు సమాచారం. ఎన్నికల కోడ్ ముగిశాక అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
పెద్దమ్మతల్లి ఆలయంలో 14 నుంచి పవిత్రోత్సవాలు
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో ఈనెల 14 నుంచి 16 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజినీకుమారి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేవాలయ పవిత్రత, భక్తుల శ్రేయస్సు కోసం ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఖమ్మానికి చెందిన ఎ.ఎన్.కె.సంతోష్‌కుమార్ శర్మ ఆధ్వర్యంలో రుత్వికులు ఈ మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారని తెలిపారు.
అలసత్వం వహించొద్దు
పినపాక: ఎన్నికల విధుల్లో ఎవరూ అలసత్వం వహించొద్దని, తనిఖీ కేంద్రంలో ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని ఎన్నికల పరిశీలకులు సర్వేశ్వర్ రెడ్డి అధికారులకు సూచించారు. మండలంలోని ఈ బయ్యారం క్రాస్‌రోడ్‌లోని ఎన్నికల తనిఖీ కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఎన్నికల నిబంధనావళిని ప్రతీ ఒక్కరు అనుసరించాలని, సరైన ఆధారాలు లేకుండా అధిక మొత్తంలో నగదు తీసుకెళ్తే జప్తు చేయాలని చెప్పారు. రాత్రి వేళలో అదనపు సిబ్బందితో ప్రత్యేకంగా వాహన తనిఖీలు చేపట్టాలన్నారు.
రామయ్యను దర్శించుకున్న పరిక్రమణ సమితి


