విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
● పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడండి ● అధికారులకు కలెక్టర్ ఆదేశం
బూర్గంపాడు/భద్రాచలంటౌన్ : ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. బుధవారం ఆయన బూర్గంపాడు, భద్రాచలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తొలి విడత ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. సెక్టార్ల వారీగా పోలింగ్ సామగ్రి తరలింపునకు ప్రత్యేక బస్సులు, 10 మంది అధికారులను ఏర్పాటు చేశామని చెప్పారు. చలి తీవ్రత దృష్ట్యా సిబ్బందికి పోలింగ్ కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేశామని చెప్పారు. అందరూ సమన్వయంతో పనిచేసి గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. బ్యాలెట్ బాక్స్‌లను తెరవడం, మూయడం వంటి కీలక ప్రక్రియలపై సిబ్బందికి సమగ్రంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో ఐటీడీఏ పీఓ బి.రాహుల్, సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, తహసీల్దార్లు ధనియాల వెంకటేశ్వర్లు, ప్రసాద్, ఎంపీడీఓలు బాలయ్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
వైద్య సేవలపై ఆరా..
చర్ల: చర్ల సీహెచ్‌సీలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆరా తీశారు. బుధవారం ఆయన స్థానిక సీహెచ్‌సీని పరిశీలించారు. ఆస్పత్రిలో కొన్నిచోట్ల లీకేజీలను గుర్తించి తక్షణమే సరిచేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఆస్పత్రికి అవసరమైన పరికరాలు, అభివృద్ధి పనులపై నివేదిక సమర్పించాలని వైద్యాధికారికి సూచించారు. గర్భిణులు, చిన్నారులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి సిబ్బందిని అభినందించారు. అనంతరం ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్‌లో భద్రత ఏర్పాట్లు సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా ఉండాలని సూచించారు. అనంతరం ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందితో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత ఆర్ కొత్తగూడెంలో శ్రీ ముత్యాలమ్మ జాయింట్ లయబిలిటీ యూనిట్‌ను సందర్శించి మహిళలు తయారు చేస్తున్న విప్ప పువ్వు లడ్డూ, బర్ఫీ, చాక్లెట్, టీ పొడి, నల్లేరు పచ్చడి తదితర ఉత్పత్తులను పరిశీలించారు. విప్పపండ్లు సేకరణ సమయంలో నేలపై పడకుండా ఉండేలా అవసరమైన నెట్లు అందిస్తామని హామీ ఇచ్చారు. వాటిని ఆరబెట్టేందుకు సోలార్ పరికరాలు కావాలని మహిళలు కోరగా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎం.శ్రీనివాస్, ఎంపీడీఓ ఈదయ్య, సీహెచ్‌సీ సూపరింటెండెంట్ సాయివర్దన్, వైద్యులు కాంత్, రవికుమార్, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.


