
హత్యాయత్నం కేసులో నిందితుడికి ఆరేళ్ల జైలు
రేపల్లె: ఓ వ్యక్తిని కత్తితో హత్య చేయడానికి ప్రయత్నించిన కేసులో నిందితుడికి ఆరు సంవత్సరాల జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా విధిస్తూ రేపల్లె సీనియర్ సివిల్ జడ్జి ఎస్‌పీడీ వెన్నెల బుధవారం తీర్పు వెలవరించారు. పట్టణానికి చెందిన ఆర్‌కే జ్యూయలర్స్ నిర్వాహకుడు జక్కం రామకృష్ణ భార్యపై పట్టణానికి చెందిన పడకల వెంకటేశ్వరరావు 2017 సెప్టెంబర్ 11న అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చాయి. దీనిపై జక్కం రామకృష్ణ నిలదీశారు. వెంకటేశ్వరరావు చాకుతో రామకృష్ణపై దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. బాధితుడి ఫిర్యాదుతో రేపల్లె ఎస్‌ఐ బాలనాగిరెడ్డి కేసు నమోదు చేశారన్నారు. దర్యాప్తులో నేరం రుజువు కావటంతో న్యాయమూర్తి తీర్పునిచ్చారు. కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనగాని శ్రీనివాసమూర్తి వాదించారు.
రైలు ప్రమాదంలో వ్యక్తి మృతి
చీరాల రూరల్: రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన చినగంజాం–ఉప్పుగుండూరు రైల్వేస్టేషన్ల మధ్య దిగువలైన్‌లో చోటుచేసుకున్నట్లు జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొమడయ్య బుధవారం తెలిపారు. మృతుని వయస్సు 30 సంవత్సరాలు ఉంటాయని, 5.5 అడుగుల ఎత్తు, ఛామనచాయ రంగు కలిగి ఉన్నాడని తెలిపారు. మృతుని కుడి రిబ్స్‌పై ఒక నల్లని పుట్టుమచ్చ, ఎడమ భుజంపై ఒక నల్లని పుట్టుమచ్చ ఉందన్నారు. మృతుని శరీరంపై నలుపు రంగు గడులు కలిగిన ఫుల్‌హ్యాండ్ షర్ట్, వెలిసిపోయిన బ్లూ జీన్స్ ప్యాంట్ ఉందని, ఎడమచేయి ఉంగరం వేలుకు తాబేలు బొమ్మ ఉన్నట్లు చెప్పారు. మృత దేహాన్ని పరిశీలించగా ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసినవారు 9440627646 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.
బస్సు ఢీకొని యాచకుడు మృతి
మార్టూరు: జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యాచకుడు మృతి చెందాడు. హైవే పెట్రోలింగ్ సిబ్బంది అందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ నుంచి ఒంగోలు వెళుతున్న ఇంద్ర బస్సు బొల్లాపల్లి టోల్‌గేట్ సమీపంలోకి వస్తున్న క్రమంలో ఓ యాచకుడు హఠాత్తుగా రోడ్డుపైకి రావటంతో బస్సు ఢీ కొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన యాచకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సును స్టేషన్‌కు పంపి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
డివైడర్‌ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
షిర్డీ నుంచి గుంటూరు వెళుతుండగా ప్రమాదం
నరసరావుపేటటౌన్: ప్రయాణికులతో వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిన సంఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. నిత్యం రద్దీగా ఉండే గడియార స్తంభం సెంటర్‌లో ఆ సమయంలో ఎవ్వరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పినట్లు అయింది. పోలీసుల కథనం ప్రకారం.. షిర్టీలో ప్రయాణికులను ఎక్కించుకొన్న మారుతి సుధాశ్రీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు గుంటూరుకు బయలు దేరింది. మార్గమధ్యంలో తెల్లవారు జామున నరసరావుపేట గడియార స్తంభం వద్దకు వచ్చే సరికి ఆగి ఉన్న లారీని క్రాస్ చేసే క్రమంలో అదుపుతప్పి బస్సు డివైడర్‌ను ఢీకొంది. సంఘటనలో బస్సు ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది. సంఘటనతో ట్రాఫిక్ నిలిచి పోయింది. సమాచారం అందుకున్న సీఐ లోకనాథం సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

హత్యాయత్నం కేసులో నిందితుడికి ఆరేళ్ల జైలు

హత్యాయత్నం కేసులో నిందితుడికి ఆరేళ్ల జైలు