Historical Places In AP: యునెస్కో.. ఓ లుక్కేస్కో

Historical, Cultural And Artistic Glory In AP In Line With UNESCO Standards - Sakshi

యునెస్కో ప్రమాణాలకు తగ్గట్టుగా ఏపీలో చారిత్రక, సాంస్కృతిక, కళా వైభవం

4 ఎకరాల్లో విస్తరించిన 550 ఏళ్ల నాటి తిమ్మమానుమర్రి

మూడు వేల ఏళ్లనాటి కూచిపూడి నృత్య కళ.. తొమ్మిది శతాబ్దాల క్రితం ఎర్రమల కొండల్లో నిర్మించిన గండికోట.. 16వ శతాబ్దం నాటి లేపాక్షి ఆలయం.. గాలిలో తేలియాడే రాతి స్తంభం.. కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయం.. 550 ఏళ్లనాటి తిమ్మమ్మ మర్రిమాను.. కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని రాక్‌ గార్డెన్‌.. విభిన్న వృక్ష, జంతు జాతులకు ఆలవాలమైన శేషాచల అడవులు వంటి సహజసిద్ధ ప్రదేశాలు.. తరగని వారసత్వ సంపదలతో ఏపీ చారిత్రక, సాంస్కృతిక, భౌగోళిక, జీవ వైవిధ్యాలను చాటుతోంది. వీటిని యునెస్కో ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్ది ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. 

శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగేశ్వరస్వామి ఆలయం

శతాబ్దాల నాటి కట్టడాలు.. అపూర్వ శిల్ప సోయగాలు.. సహజసిద్ధ ప్రదేశాలు.. సంప్రదాయ కళలు.. సాంస్కృతిక వైభవాలు.. అరుదైన స్మారక చిహ్నాలతో మన రాష్ట్రం భౌగోళిక, జీవ వైవిధ్యాలను చాటుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దశాబ్దాలుగా ఆక్రమణలకు, నిరాదరణకు గురైన వాటిని పరిరక్షించి కొత్త శోభ అద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టబోతోంది. ఈ క్రమంలోనే ప్రాధాన్యతా జాబితాలో అగ్రస్థానంలో కడప జిల్లాలోని గండికోట (గ్రాండ్‌ కేనియాన్‌ ఆఫ్‌ ఇండియా), అనంతపురంలోని లేపాక్షి (వీరభద్ర స్వామి) ఆలయం ప్రపంచ వారసత్వ హోదా దక్కించుకునేందుకు సమాయత్తమవుతున్నాయి. వారసత్వ నిపుణులు, పురావస్తు శాస్త్రవేత్తలు యునెస్కో ప్రమాణాలకు అనుగుణంగా వాటిని తీర్చిదిద్ది వాటికి ప్రపంచ వారసత్వ హోదా సాధించే దిశగా అడుగులు వేస్తున్నాయి.

అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఆలయం

బౌద్ధ స్థూపాలు.. బెలూం, బొర్రా గుహలు కూడా..
రాష్ట్రంలోని మూడు స్థూపాలు, కట్టడాలను ఆదర్శ సంరక్ష పథకం కింద కేంద్ర ప్రభుత్వం పరిరక్షించనుంది. గుంటూరు జిల్లానాగార్జున కొండలోని బౌద్ధ స్థూపాలు, శ్రీకాకుళంలోని శాలిహుండంలో బౌద్ధ అవశేషాలు, అనంతపురంలోని లేపాక్షి ఉన్నాయి. వీటిలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా వైఫై, ఫలహార శాల, వ్యాఖ్యాన కేంద్రం, బ్రెయిలీ సంకేతాలు తదితర సౌకర్యాలను సమకూర్చనున్నారు. ఇటీవల కట్టడాలను అభివృద్ధి చేయడంలో భాగంగా గండికోటను కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ దత్తత తీసుకున్న విషయం విదితమే. ఇక కర్నూలులోని బెలూం గుహలు, విశాఖ జిల్లాలోని బొర్రా గుహలు, శ్రీకాకుళం జిల్లాలోని 8–10వ శతాబ్దంలో నిర్మించిన శ్రీముఖలింగేశ్వరాలయం అద్భుత శిల్పకళకు సజీవ సాక్ష్యంగా నిలుస్తూ వారసత్వ హోదాకు పోటీపడుతున్నాయి. 

కర్నూలు జిల్లా ఓర్వకల్లు రాక్‌ గార్డెన్‌  

యునెస్కో ప్రమాణాలు ఇలా..
ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేరాలంటే యునెస్కో సూచించిన 10 ప్రమాణాల్లో ఏదో ఒక దానికి సరిపోల్చాలి. 2, 3, 4 ప్రమాణాల ప్రకారం వాస్తు, శిల్పకళ, సాంకేతికత, స్మారక కట్టడాలు, కళలు, పట్టణం–ప్రణాళిక, ప్రకృతి దృశ్యం, సంస్కృతి–సంప్రదాయం, నాగరికత, మానవ చరిత్రలో గొప్ప నిర్మాణాలు ఉండాలి. 7, 8, 9 ప్రమాణాల ప్రకారం అద్భుతమైన, అసాధారణమైన సహజ సౌందర్యం, ప్రాంతాలు, స్థల చరిత్ర భౌగోళిక సాక్ష్యాలు, సముద్ర పర్యావరణ వ్యవస్థలు, జీవ వైవిధ్యం వారసత్వ హోదాకు ప్రాథమిక అర్హతను నిర్ణయిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 1,154 ప్రదేశాలు, కట్టడాలు యునెస్కో జాబితాలో ఉన్నాయి. వీటిలో భారతదేశంలోని 32 సాంస్కృతిక, చారిత్రక కట్టడాలు, ఏడు సహజసిద్ధ ప్రదేశాలు, ఒకటి మిశ్రమ జాబితాలో వారసత్వ హోదాను పొందాయి. 

కడప జిల్లాలోని గండికోట గ్రాండ్‌ కేనియన్‌ గార్జ్‌ వ్యూ  

ప్రణాళికతోనే యునెస్కో గుర్తింపు 
ఏపీలోని లేపాక్షి, గండికోట, ఒంటిమిట్ట, శాలిహుండం, శ్రీముఖ లింగేశ్వరాలయం, బెలూం గుహలు, తిమ్మమ్మ మర్రిమాను వంటి వాటికి యునెస్కో జాబితాలో చేరడానికి అన్ని అర్హతలున్నాయి. ప్రపంచ వారసత్వ కేంద్ర నియమాల ప్రకారం తొలుత ఈ ప్రతిపాదిత కట్టడాలు తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకోవాలి. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం వివరణాత్మక నివేదికను తయారు చేసి కేంద్ర పురావస్తు శాఖ ద్వారా దేశంలోని ప్రపంచ వారసత్వ కేంద్రానికి పంపాలి. వారు పరిశీలించి ప్రతిపాదిత ప్రదేశాల్లో సంరక్షణ మరమ్మతులు, ఆక్రమణల తొలగింపు వంటివి చేపడితే యునెస్కో గుర్తింపు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
– ఈమని శివనాగిరెడ్డి, పురావస్తు పరిశోధకుడు,సీఈవో ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ 

అనంతపురం జిల్లాలో  తిమ్మమ్మమర్రిమాను
 

యునెస్కో ప్రమాణాలకు సరితూగేవి ఇవే..
క్రీ.శ 1,123లో నిర్మించిన గండికోట ఎర్రమల కొండల్లో అద్భుతమైన ఒంపుతో పెన్నా నది హొయల మధ్య సహజసిద్ధ ప్రకృతి సౌందర్యంతో యునెస్కో ప్రమాణాన్ని నెరవేరుస్తోంది. 

16వ శతాబ్దంలో నిర్మించిన లేపాక్షి ఆలయం అద్భుత శిల్పకళతో.. గాలిలో తేలియాడే రాతి స్తంభం నిర్మాణంతో గొప్ప కట్టడంగా వారసత్వ ప్రమాణాలకు సరితూగుతోంది. 

కడప జిల్లా ఒంటిమిట్ట ఆలయం మూడు గోపురాలు.. 160 అడుగుల ఎత్తైన ముఖద్వారంతో అద్భుత నిర్మాణంగా అలరారుతోంది. ఆలయ మధ్య మండపంలో 32 స్తంభాలున్న మండపం చోళ, విజయనగర శిల్ప శైలిని పోలి ఉంటుంది. ఇది కూడా యునెస్కో ప్రమాణాలతో సరితూగుతోంది.

కూచిపూడి నృత్య కళ, కూచిపూడి కళాకారుల జీవనం యునెస్కో 6వ ప్రమాణం ప్రకారం కళాత్మక జీవన విధానం, సరికొత్త ఆలోచనలు, సంప్రదాయ కళ, ప్రపంచ ప్రాముఖ్యతకు సరిపోలుతోంది. 

ప్రపంచంలోనే అత్యంత పెద్ద మర్రి చెట్టు అనంతపురం జిల్లా కదిరి సమీపంలోని తిమ్మమ్మ మర్రిమాను యునెస్కో సహజసిద్ధ, జీవ వైవిధ్యం, భౌగోళిక పరిమాణం, పర్యావరణ ప్రమాణాలకు తగ్గట్టుగా 4.721 ఎకరాల్లో విస్తరించింది. దాదాపు 550 ఏళ్లనాటి ఈ వృక్షం 1,110 ఊడలను కలిగి ఉంది. 
కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని రాక్‌ గార్డెన్, విభిన్న వృక్ష, జంతు జాతులకు ఆలవాలమైన శేషాచల అడవులు సహజసిద్ధ, జీవ వైవిధ్య ప్రమాణానికి దగ్గరగా ఉంది.

మరిన్ని వార్తలు :

Read latest AP Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top