రీసెర్చ్‌ కారిడార్‌గా తిరుపతి | Sakshi
Sakshi News home page

రీసెర్చ్‌ కారిడార్‌గా తిరుపతి

Published Sun, Jul 3 2022 3:35 AM

Tirupati as Research Corridor Andhra pradesh - Sakshi

తిరుపతి రూరల్‌: కేంద్ర పరిశోధన సంస్థలతో పాటు దేశంలో ఏ నగరంలోనూ లేని విధంగా తొమ్మిది యూనివర్సిటీలున్న తిరుపతిని రీసెర్చ్‌ కారిడార్‌గా తీర్చిదిద్దుతామని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) చైర్మన్, కేంద్ర ప్రభుత్వ రక్షణ పరిశోధన కార్యదర్శి డాక్టర్‌ సతీష్‌రెడ్డి తెలిపారు. యువ శాస్త్రవేత్తలు, రీసెర్చ్‌ స్కాలర్లు, విద్యా సంస్థలు నూతన శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణలతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

తిరుపతిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఫౌండేషన్‌(ఐఎస్‌టీఎఫ్‌)ను శనివారం ఆయన ప్రారంభించి, లోగోను ఆవిష్కరించారు. పలు కాలేజీలు, యూనివర్సిటీలను నాలెడ్జ్‌ పాట్నర్స్‌గా చేసుకుని వారికి సర్టిఫికెట్లు అందించారు. యువకులు, అ«ధ్యాపకులు,   విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. పరిశోధనల పరంగా తిరుపతిని అభివృద్ధి చేసేందుకు చాలా అవకాశాలున్నాయని చెప్పారు.

వాతావరణ పరిశోధన కేంద్రంతో పాటు.. వేలాది మంది యువత ఈ నగరానికి అదనపు బలమని చెప్పారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశంలో గత పదేళ్లలో ఊహించని పురోగతి సాధించినట్లు తెలిపారు. ఐఐటీ పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్లు ఉపాధి కోసం గతంలో 75 శాతం మంది విదేశాలకు వెళ్లేవారని, కానీ ఇప్పుడు వారంతా దేశంలోనే ఉంటున్నారని తెలిపారు. 70 వేలకు పైగా నూతన ఆవిష్కరణలు కేంద్ర ప్రభుత్వం వద్ద రిజిస్టర్‌ అయ్యాయని, ఇది మన పురోగతికి నిదర్శనమన్నారు.

నూతన ఆవిష్కరణలకు ఇండెక్స్, టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ విభాగాల ద్వారా  డీఆర్‌డీవో రూ.కోటి నుంచి రూ.15 కోట్ల వరకూ ఫండింగ్‌ చేస్తోందన్నారు. ఇప్పటి వరకు 60 నూతన ఆవిష్కరణలకు ఫండింగ్‌ చేశామని, ఈ ఏడాది కనీసం 5 వేల వరకూ పెంచాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. యువ శాస్త్రవేత్తలు, పరిశోధనలపై ఆసక్తి కలిగిన వారు రక్షణ రంగం అందిస్తున్న ఈ ఫండింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

నూతన ఆవిష్కరణలతో సాంకేతిక రంగంలో దేశం సంపదను సృష్టిస్తోందని, రానున్న రోజుల్లో 39,475 వేల కోట్ల ఎగుమతులే లక్ష్యమన్నారు. దేశాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దాలంటే అన్ని రంగాల్లోనూ అధునాతన పరిశోధనలు అవసరమని, వీటిని ప్రోత్సహించే ఇంక్యూబేషన్‌ సెంటర్లు, విద్యా సంస్థలు, రీసెర్చ్‌ సంస్థలకు అన్ని విధాలా ప్రోత్సాహకాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలపై అవగాహన కల్పించేందుకు సరికొత్త వేదికగా ఫౌండేషన్‌ ఏర్పాటు చేయడం శుభపరిణామమని, ఈ సందర్భంగా దాని రూపకర్త డాక్టర్‌ నారాయణరావును డాక్టర్‌ సతీష్‌రెడ్డి అభినందించారు.  

నూతన ఆవిష్కరణలకు వేదిక.. 
నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు వేదికగా ఐఎస్‌టీఎఫ్‌ ఫౌండేషన్‌ను ప్రారంభించినట్టు దాని అధ్యక్షుడు, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ప్రో–వైస్‌ చాన్సలర్‌ ఆచార్య నారాయణరావు చెప్పారు. తిరుపతిలో డీఆర్‌డీవో ల్యాబ్, ఐఐటీలో సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయాలని ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సత్యనారాయణ కోరారు. ఐఎస్‌టీఎఫ్‌ మూడు దశల్లో సేవలందించాలని సూచించారు.

స్కూల్‌ స్థాయి విద్యార్థులకు క్షేత్ర స్థాయి పరిశీలన, కళాశాల స్థాయి విద్యార్థులకు.. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఉన్న ఉపాధిపై, రీసెర్చ్‌ స్థాయి విద్యార్థులకు నూతన ఆవిష్కరణల రంగంపై శిక్షణ, వారికి తోడ్పాటు వంటి అంశాలపై ఫౌండేషన్‌ దృష్టి పెట్టాలని ఐజర్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ గణేష్‌ సూచించారు. కార్యక్రమంలో గాదంకి ఎన్‌ఏఆర్‌ఎల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఏకే పాత్రో, ఎస్వీయూ, పద్మావతి మహిళా వర్సిటీ, మోహనబాబు వర్సిటీల వీసీ ఆచార్య రాజారెడ్డి, జమున, నాగరాజన్, ఫౌండేషన్‌ కోశాధికారి వాసు, విజయభాస్కరరావుసభ్యులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తిరుపతి రూరల్‌ మండలం పేరూరు బండపై ఉన్న వకుళమాత అమ్మవారిని, తిరుమల శ్రీవారిని డాక్టర్‌ సతీష్‌రెడ్డి దర్శించుకున్నారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement