Monsoon Tips: మీ వాహనం సేఫ్‌గా ఉండాలా.. వానాకాలంలో ఈ టిప్స్‌ పాటించాల్సిందే

Tips To Protect Your Vehicles In Rainy Season - Sakshi

టెక్కలి(శ్రీకాకుళం జిల్లా): వర్షాకాలంలో వాహనాల వినియోగంలో శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా బైకులు, కార్లు వినియోగించే వారు ఈ మాత్రం నిర్లక్ష్యం వహించినా బండి హఠాత్తుగా ఆగిపోవడమే కాకుండా కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు సైతం జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో ద్విచక్రవాహనాలు, కార్ల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిశీలిద్దాం..
చదవండి: పుట్టినరోజు.. బయటకు వెళ్లి వస్తానని చెప్పి..

ద్విచక్ర వాహనాల రక్షణ ఇలా.. 
ద్విచక్ర వాహనాల బ్యాటరీలు ఎప్పటికప్పుడు చెక్‌ చేయించుకోవాలి. వర్షం పడుతున్నప్పుడు, పడిన తర్వాత వేగంగా వెళ్లడం ప్రమాదకరం. లైనర్స్, వీల్‌డ్రమ్స్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. వీల్‌డ్రమ్స్, బైక్‌ లైనర్స్‌లోకి నీరు వెళ్తే వెంటనే మెకానిక్‌ వద్దకు వెళ్లి శుభ్రం చేయించాలి. రోజుల తరబడి ఆలస్యం చేస్తే వాహనాలు పాడవుతాయి.

ద్విచక్ర వాహనాలు వర్షానికి తడిసినప్పుడు, నీళ్ల నుంచి వెళ్లినప్పుడు చైన్‌ గ్రీజ్‌ పోతుంది. అలాంటి సమయంలో చైన్‌ కవర్లను తీసి కిరోసిన్‌ గానీ, ఆయిల్‌గానీ వేయాలి. తర్వాత మెకానిక్‌కు చూపించి గ్రీజ్‌ పెట్టించాలి. నిర్లక్ష్యంగా ఉంటే  చైన్‌ స్పాకెట్, వీల్‌ బేరింగ్‌ దెబ్బతింటాయి.

సైలెన్సర్లలోకి నీరు వెళ్లకుండా చూసుకోవాలి. నీటిలో పూర్తిగా మునిగిన వాహనాన్ని సర్వీసింగ్‌ చేయకుండా స్టార్ట్‌ చేయకూడదు. నీటి మడుగులోంచి వెళ్లాల్సివస్తే ఎక్స్‌లేటర్‌ను ఏమాత్రం తగ్గించినా వెంటనే స్పార్క్‌ప్లగ్, సైలెన్సర్‌లోకి నీరు చేరి బైక్‌ ఆగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సైలెన్సర్‌లోని నీరు బయటకు వచ్చేలా వాహనాన్ని వెనక్కి వంచాలి. స్పార్క్‌ప్లగ్‌ను శుభ్రం చేసి కిక్‌ కొట్టి మిగతా నీటిని బయటకు పంపాలి. అయినా స్టార్ట్‌ కాకపోతే మెకానిక్‌ వద్దకు వెళ్లాలి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఇంజన్‌ పాడయ్యే ప్రమాదముంది.

ప్రతి వాహనానికి తప్పనిసరిగా పెట్రోల్‌ ట్యాంక్‌ కవర్‌ ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే వర్షం కురిసిన సమయంలో నీరు లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది.

బైక్‌లో కార్బేటర్‌ది కీలకపాత్ర. దీంట్లోకి నీరు చేరితే వాహనం స్టార్ట్‌ కాదు. కిక్‌ కొట్టినా స్టార్ట్‌ కాకపోతే వెంటనే కార్బేటర్‌ను శుభ్రం చేయాలి. నిర్లక్ష్యం చేస్తే కార్బేటర్‌లోకి తెల్లని ఫంగస్‌ చేరి వాహనం మైలేజ్‌ పడిపోతుంది.

వీలైనంత మేరకు వాహనాలు వర్షంలో తడవకుండా చూసుకోవాలి. బయట ఉంటే కవర్లు కప్పాలి. లేదంటే షెడ్ల కింద పార్కింగ్‌ చేయాలి. వర్షాకాలంలో వ్యాక్స్‌ పాలిష్‌ చేయించుకోవాలి.

కార్లు– జాగ్రత్తలు 
వర్షాకాలంలో ఆథరైజ్డ్‌ క్యాంపుల్లో కార్లను తనిఖీ చేయించాలి. బండి బయటకు తీసే ముందే టైర్లను పరీక్షించాలి. దీనివల్ల దుర్ఘటనలను నివారించుకోవచ్చు. ఎగుడు దిగుడుగా అరిగి ఉండటం, అసలు గ్రిప్‌ లేకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయి.  
‘యూజర్‌ మాన్యువల్‌‘లో సూచించిన విధంగా టైర్‌ ప్రెజర్‌ ఉండాలి. టైర్ల మన్నిక కూడా పెరుగుతుంది. 
వర్షాలకు కారు లోపలికి నీరు వెళ్తుంటుంది.  రబ్బర్‌ మ్యాట్స్‌కు బదులు ఫ్యాబ్రిక్స్‌ మ్యాట్స్‌ వినియోగించడం మంచిది. 
ఏసీ దుర్వాసన వెదజల్లే కాలం కూడా ఇదే. అందుకే ఏసీని నిర్దేశిత సెట్టింగ్స్‌లో ఉంచుకోవాలి.  పోర్టబుల్‌ వ్యాక్యూమ్‌ క్లీనర్‌ను కారులో పెట్టుకుంటే శుభ్రం చేసుకోవచ్చు. 
వర్షాకాలంలో వైపర్స్‌ పక్కాగా పనిచేసేలా చూసుకోవాలి. సాధారణంగా విండ్‌ స్క్రీన్‌ వైపర్స్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంటాం. చాలామంది కారు కొన్న దగ్గర నుంచి అవే వైపర్లను వాడుతుంటారు. సరైన సమయంలో వాటిని మార్చాలి. లేకపోతే విజిబిలిటీ స్పష్టంగా ఉండదు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top