పరీక్ష గదికి 16 మంది విద్యార్థులే  | Tenth public exams following corona protocol | Sakshi
Sakshi News home page

పరీక్ష గదికి 16 మంది విద్యార్థులే 

Mar 1 2022 4:37 AM | Updated on Mar 1 2022 11:20 AM

Tenth public exams following corona protocol - Sakshi

సాక్షి, అమరావతి: రాష్టంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో గదికి 16 మంది విద్యార్థులే ఉండేలా ఎస్సెస్సీ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఇంతకు ముందు గదికి 24 మంది ఉండేవారు. కోవిడ్‌ ప్రొటోకాల్‌ను అనుసరించి విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేందుకు గతంలోనే విద్యార్థుల సంఖ్యను కుదించింది. ప్రస్తుతం కరోనా దాదాపు తగ్గుముఖం పట్టినప్పటికీ, విద్యార్థుల ఆరోగ్యంతోపాటు పరీక్షల్లో కాపీయింగ్‌ జరగకుండా బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది. గతంలో దాదాపు 2 వేల కేంద్రాల్లో టెన్త్‌ పరీక్షలు నిర్వహించగా, ఇప్పుడా సంఖ్యను 4,200కు పెంచినట్లు ఎస్సెస్సీ బోర్డు డైరక్టర్‌ డి.దేవానందరెడ్డి ‘సాక్షి’కి వివరించారు. ఈ ఏడాది పరీక్షలకు 6.30 లక్షల మంది హాజరుకానున్నారు. టెన్త్‌ విద్యార్థులకు, ఉపాధ్యాయులందరికీ ఇప్పటికే ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయించింది.

మే 2 నుంచి పరీక్షలు
టెన్త్‌ పరీక్షలను మే 2వ తేదీ నుంచి 13 వరకు నిర్వహించేలా బోర్డు షెడ్యూల్‌ను ఇంతకు ముందే విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సిలబస్‌ పూర్తి చేశారు. ఇప్పుడు ప్రత్యేక మెటీరియల్‌ను విద్యార్థులకు అందిస్తున్నారు. రివిజన్‌ చేయిస్తూ రోజువారీ, వారాంతపు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రశ్నపత్రాల బ్లూప్రింట్, మాదిరి ప్రశ్నపత్రాలను బోర్డు విడుదల చేసింది. ఈసారి అంతర్గత మార్కులతో సంబంధం లేకుండా 100 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. గతంలో హిందీ మినహా తక్కినవాటిలో రెండేసి పేపర్లు 50 మార్కులు చొప్పున ఉండేవి.

తాజాగా పేపర్లను ఏడింటికి కుదించడంతో 100 మార్కులకు ప్రశ్నపత్రాలు ఉంటాయి. బిట్‌ పేపర్‌ విడిగా ఉండదు. వ్యాసరూప ప్రశ్నలకు 8, లఘు సమాధాన ప్రశ్నలకు 4, అతి లఘు ప్రశ్నలకు, లక్ష్యాత్మక ప్రశ్నలకు 1 మార్కు ఇస్తారు. మేథమెటిక్స్‌లో అకడమిక్‌ స్టాండర్డ్స్‌ ప్రకారం ప్రాబ్లెమ్‌ సాల్వింగ్, రీజనింగ్‌ అండ్‌ ప్రూఫ్, కమ్యూనికేషన్, కనెక్షన్, విజువలైజేషన్‌ అండ్‌ రిప్రజెంటేషన్‌ అంశాలను పరిశీలన చేసేలా ప్రశ్నలుంటాయి. లక్ష్యాత్మక ప్రశ్నల్లో ప్రయోగాలు, ప్రశ్నలు రూపొందించడం,  క్షేత్ర పరిశీలనలు, సమాచార నైపుణ్యాలు, పట నైపుణ్యాలు వంటివి ఉంటాయి. సైన్సు సబ్జెక్టుల్లో సమస్యకు సరైన కారణాలు ఊహించి చెప్పడం, ప్రయోగ అమరిక చిత్రాన్నిచ్చి ప్రశ్నించడం, ప్రయోగ నిర్వహణకు అవసరమైన పరికరాల గురించి అడగడం వంటివి ఉంటాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement