
సాక్షి, విశాఖపట్నం: రానున్న మూడు రోజులపాటు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఎండలు తీవ్రం కానున్నాయి. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి తదితర జిల్లాల్లో 37 నుంచి 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. రుతుపవనాల అస్థిర పరిస్థితుల కారణంగానే వేసవిని తలపించేలా ఎండలు ఉండబోతున్నాయని అధికారులు చెబుతున్నారు. దాదాపు ఈ నెల 9 వరకు పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్నాయి. తర్వాత మరోసారి వర్షాలు పడే అవకాశాలున్నాయి.
ఈ నెల 8న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో వర్షాలు జోరందుకోనున్నాయి. మరోవైపు.. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం పశి్చమ–వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతూ ఉత్తర ఛత్తీస్‌గఢ్, దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.