Sakshi News home page

‘పీఎస్పీ’ ప్రయోజనాలు కనిపించవా? 

Published Thu, Nov 2 2023 4:30 AM

PSPs in the state as a model for other states - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పంప్డ్‌ స్టోరేజి ప్రాజెక్టు (పీఎస్పీ)లకు ఇస్తున్న ప్రోత్సాహానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. దీనిని తట్టుకోలేని పచ్చ పత్రిక ఈనాడు పీఎస్పీలపై విషం చిమ్మింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అనుసరిస్తున్న పీఎస్పీలు అనవసరమంటూ ఓ కట్ట్దు కథ రాసింది. ఎగువ సీలేరులో ఉన్నది ఎన్ని మెగావాట్ల హైడల్‌ ప్రాజెక్టో కూడా అవగాహన లేని ఈనాడు పత్రిక.. దానిపై అసత్యాలు అల్లింది.

రాష్ట్ర ప్రజలకు కోట్లలో ఆదా చేయడంతో పాటు డిమాండ్‌ ఎక్కువగా ఉండే సమయాల్లో విద్యుత్‌ను అందించే పీఎస్పీలపై ‘జెన్‌కోకు గుదిబండగా.. ఎగువ సీలేరు పీఎస్‌పీ’ శీర్షికతో బుధవారం ‘రామోజీ’ రాసిన కథనమంతా పచ్చి అబద్ధమని ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ (ఏపీ జెన్‌కో) స్పష్టం చేసింది. అదనంగా ఒక్క మెగావాట్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేసే అవకాశం లేకపోయినా ఎగువ సీలేరులో పీఎస్పీ ఏర్పాటు చేస్తున్నారన్న ఆరోపణను ఏపీ జెన్‌కో ఎండీ కేవీఎన్‌ చక్రధర్‌బాబు ఖండించారు. వాస్తవాలను వెల్లడించారు. ఆ వివరాలు..  

అసలు 1350 మెగావాట్ల ప్రాజెక్టు లేనే లేదు 
ఎగువ సీలేరులో ప్రస్తుతం 1,350 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల జల విద్యుత్‌ ప్రాజెక్టు ఉందనడంలో వాస్తవం లేదు. ఇక్కడ ప్రస్తుతం 240 మెగా­వాట్ల జల విద్యుత్‌ ప్రాజెక్టు మాత్రమే ఉంది. సీలేరు నది నుంచి 1.7 టీఎంసీల నీటి వినియోగం ద్వారా 1,350 మెగావాట్ల సామర్థ్యంతో పీఎస్పీ నిర్మా­­­ణానికి ఏపీ జెన్‌కో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను సమర్పించి సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) ఆమోదంతో పాటు చట్టపరమైన అనుమతులు తీసుకుంది. ఒక్క సీలేరులోనే కాదు.. మిగతా ప్రాంతాల్లోనూ ఏపీజెన్‌కో పీఎస్పీలు ఏర్పాటు చేస్తోంది. ఎన్‌హెచ్‌పీసీ సంయుక్త భాగస్వామ్యంలో యాగ­ంటి, కమలపాడు, అరవేటిపల్లి, దీనేపల్లి, గడికోటలో పీఎస్పీలు ఏర్పాటుకు డీపీఆర్‌ తయారవుతోంది. 

అవసరానికి ఆదుకుంటుంది 
డిమాండ్‌ తక్కువగా ఉన్న సమయంలో మార్కెట్‌లో విద్యుత్‌ కొనుగోలు ధర తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో మిగులు విద్యుత్‌ను లేదా చౌక ధరకు కొనే విద్యుత్‌ను వినియోగించుకుని నీటిని పంప్‌ చేసి పీక్‌ డిమాండ్‌ సమయంలో ఆ నీటితో విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలన్నదే పీఎస్పీల లక్ష్యం. ఈ ఉద్దేశంతోనే దేశవ్యాప్తంగా  ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు అనేక ప్రైవేటు సంస్థలూ పీఎస్పీలు నిర్మిస్తున్నాయి. ప్రపంచంలోని అనేక దేశాలు కూడా ఇవే ప్రాజెక్టులు చేపడుతున్నాయి. పీక్‌ సమయంలో పీఎస్పీ ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్‌ వల్ల బహిరంగ మార్కెట్‌లో అధిక ధరకు కరెంటు కొనాల్సిన అగత్యం తప్పుతుంది. రాష్ట్ర ప్రజలకు తక్కువ ధరతో విద్యుత్‌ అందించొచ్చు. 

యూనిట్‌ రూ.3 కే విద్యుత్‌ 
ఎగువ సీలేరులో 1,350 మెగావాట్ల పీఎస్పీ నిర్మా­ణం ద్వారా ఏటా సగటున 3,501 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయాలన్నది ఏపీ జెన్‌కో ప్రణాళిక. దీని ద్వారా గరిష్ట ఉత్పత్తి వ్యయం యూనిట్‌కు రూ.3 ఉంటుందని అంచనా. పీక్‌ డిమాండ్‌ సమయంలో ప్రస్తుతం మార్కెట్‌లో విద్యుత్‌ ధర యూనిట్‌ రూ.10 ఉంది. మార్కెట్‌లో యూనిట్‌ కనిష్ట ధర రూ.8 ఉంటుంది. అంటే పీఎస్పీ విద్యుత్‌ ధర కంటే మార్కెట్‌ కనిష్ట ధరే చాలా ఎక్కువ. ఏపీ జెన్‌కో ఉత్పత్తి చేసే విద్యుత్‌ను లాభాపేక్ష లేకుండా డిస్కంలకు సరఫరా చేస్తుంది. ఈ మేరకు రాష్ట్ర వినియోగదారులకు (ప్రజలకు) పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. 

ఎందుకీ ఊహాజనిత రాతలు రామోజీ? 
ఈ పీఎస్పీ నిర్మాణ వ్యయం రూ.11,884 కోట్లు కాదు. రూ.11,154.39 కోట్లు మాత్రమే. నిర్మాణంలో జాప్యమైతే తీసుకున్న వడ్డీ, ఇతర ఖర్చులు కలిపి వ్యయం రూ.15 వేల కోట్లకు చేరుతుందని అంచనా వేసినట్లు ‘ఈనాడు’ పేర్కొంది. కానీ సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతోనే ఏపీ జెన్‌కో ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతోంది. నిర్మా­ణం ఆలస్యమైతే వ్యయం పెరుగుతుందనేది రామోజీ ఊహాజనిత కథనం మాత్రమే.

సాంకేతికత పెరిగి బ్యాటరీ స్టోరేజి విధానం అందుబాటులోకి వస్తే పీఎస్పీలు భారమవుతాయని నిపుణులు చెబు­తు­న్నారన్న వాదనలోనూ వాస్తవం లేదు. ప్రస్తుతానికి మన దేశంలో బ్యాటరీ స్టోరేజి విధానం కంటే పీఎస్పీనే ప్రయోజనకరంగా ఉంది. పీఎస్పీ జీవితకాలం 40 ఏళ్లు కాగా బ్యాటరీ స్టోరేజి సిస్టమ్‌ జీవిత కా­లం పదేళ్లు మాత్రమే. పైగా బ్యాటరీ స్టోరేజి సిస్టమ్‌ ఏర్పాటు వ్యయం చాలా ఎక్కువ. ఈనాడు మాత్రం అదే తక్కువంటూ పచ్చి అబద్ధాలు రాసింది.

అంతర్జాతీయంగా ఇదే విధానం 
‘పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రో పవర్‌‘ను  మొట్టమొదటిసారి 1890 కాలంలో ఇటలీ, స్విట్జర్లాండ్‌లో వినియోగించారు. 1930లో యునైటెడ్‌ స్టేట్స్‌ (అమెరికా)లో కూడా వాడటం ప్రారంభించారు. ఇప్పుడివి ప్రపంచమంతా విస్తరించాయి. హైడ్రో పవర్‌ మార్కెట్‌ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం యునైటెడ్‌ స్టేట్స్‌లోని మొత్తం యుటిలిటీ – స్కేల్‌ ఎనర్జీ స్టోరేజ్‌లో 93 శాతం వాటా పీఎస్పీలకు ఉంది. అమెరికాలో ప్రస్తుతం 43 ప్లాంట్లు ఉన్నా­యి. పంప్డ్‌ స్టోరేజీ ప్లాంట్లలో పగటిపూట సౌర ఫలకాల ద్వారా విద్యుత్‌ సరఫరా చేయవచ్చు.

రాత్రి వేళ జలాశయం ద్వారా ఎగువ రిజర్వాయర్‌ నుంచి దిగువ రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయడం వల్ల టర్బైన్‌ కదిలి విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. గాలి తక్కువగా ఉండి, సూర్యరశ్మి లేని పరిస్థితుల్లో కూడా ప్రస్తు­త సాంకేతిక పరిజ్ఞానంతో, ఆర్థికంగా లాభ­దాయకంగా, పెద్ద ఎత్తున శక్తిని నిల్వ చేయడానికి పంప్డ్‌ స్టోరేజీ మాత్రమే సరైన మార్గం. ఈ పంప్డ్‌ స్టోరేజీ ప్లాంట్లు 82 శాతం సామర్థ్యంతో పని చేస్తాయి. నీటి వనరుల నిర్వహణ, వరద నియంత్రణ, అతి ఎక్కువ జీవితకాలం వీటి అదనపు ప్రయోజనాలు.

ఏపీ ముందు చూపు 
సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్ర విద్యుత్‌ రంగంలో పలు సంస్కరణలు తెచ్చి, వాటిని ప్రణాళికాబద్దంగా అమలు చేస్తున్నారు. వినూత్నమైన, అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానంతో విద్యుత్‌ రంగాన్ని దేశ­ంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తీర్చిదిద్దు­­తు­న్నారు. ప్రజలపైనా భారం పడకుండా చర్య­లు చేపడుతున్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో విద్యుత్‌ కొరత రాకుండా పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్టులు సరైన మార్గమని ముందు చూపుతో నిర్ణయాలు తీసుకున్నారు.

వేరియబుల్‌ రెన్యూ­వబుల్‌ ఎనర్జీ (వీఆర్‌ఈ)ని బ్యాలెన్స్‌ చేయ­డానికి, పీక్‌ పవర్‌ డిమాండ్‌ను చేరుకోవడానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పీఎస్పీలను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే 32,400 మెగావాట్ల పీఎస్‌పీల ఏర్పా­టుకు 29 సైట్‌ల కోసం టెక్నో కమర్షియల్‌ ఫీజిబిలిటీ రిపోర్ట్‌ (టీసీఎఫ్‌ఆర్‌)లను సిద్ధం చేసింది. రాష్ట్రంలో మొత్తం 37 ప్రాంతాల్లో 42,370 మెగావాట్ల సామర్థ్యం గల పీఎస్‌పీల నిర్మాణానికి స్థలాలను ప్రభుత్వం గుర్తించింది. పీఎస్‌పీల వల్ల గ్రీన్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ చార్జీ­లు, పన్నుల రూపంలో రాబడి వస్తుంది. ప్రత్య­క్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధీ లభిస్తుంది.

Advertisement

What’s your opinion

Advertisement