
175 నియోజకవర్గాల్లో కాంట్రాక్టు విధానంలో నియామకం
నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ
సాక్షి, అమరావతి: స్వర్ణఆంధ్ర విజన్–2047లో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీ4) కార్యక్రమాన్ని అమలు చేయడానికి రాష్ట్రంలోని ప్రతీ అసెంబ్లీ నియోకవర్గానికి కాంట్రాక్టు విధానంలో ఒక కో–ఆర్డినేటర్‌ను నియమిస్తోంది. ఇందుకోసం 175 మంది నియామకానికి ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ నోటిఫికేషన్ జారీ చేసింది.
నియోజకవర్గ కార్యాచరణ ప్రణాళికను తయారు చేసి ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు వాటాదారుల సమన్వయంతో వీరు పనిచేయాల్సి ఉంటుంది. ఎంబీఏ లేదా పీజీ చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసిన అభ్యర్థులకు నెలకు అన్ని రూ.60,000 వేతనంగా ఇస్తారు. ఈ పేరుతో పార్టీ పనులు చేయించుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం వేసిన ఎత్తుగడ అని, ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.