
సాక్షి, అమరావతి: కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండటం, ఇప్పటికే ఇద్దరు ఉద్యోగులు కోవిడ్ వల్ల మరణించడం, పలువురు ఉద్యోగులు కోవిడ్ బారిన పడిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణ నిమిత్తం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి నేతృత్వంలో న్యాయ మూర్తులందరితో కూడిన ఫుల్‌కోర్ట్ సోమవారం హైకోర్టులో సమావేశమైంది. కోవిడ్ తీవ్రత నేపథ్యంలో కేసుల విచారణ ఎలా చేపట్టాలి, వ్యాజ్యాలను భౌతికరూపంలో దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలా, గతంలోలాగా ఈ–ఫైలింగ్‌కు అనుమతి ఇవ్వాలా.. అన్న పలు అంశాలపై ఫుల్‌కోర్టు చర్చించినట్లు తెలిసింది. ఉద్యోగులను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి, ఆ దిశగా ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. ప్రస్తుతానికి భౌతికరూపంలోనే కేసులను దాఖలు చేసే విధానాన్ని కొనసాగించాలని ఫుల్‌కోర్టు నిర్ణయించింది.
భౌతిక ఫైలింగ్ కోసం హైకోర్టు ప్రవేశమార్గం వద్ద బాక్స్ ఏర్పాటు చేస్తారు. అందులో పిటిషన్ల కాపీలు వేస్తే, కోర్టు సిబ్బంది శానిటైజ్ చేసి, ఆ కేసుకు ఈ–ఫైలింగ్ ఎస్‌ఆర్ నంబరు కేటాయిస్తారు. సంబంధిత న్యాయ వాది మొబైల్‌కి సంక్షిప్త సందేశం పంపుతారు. న్యాయమూర్తులు హైకోర్టు నుంచి పనిచేయడమా, వారి ఇళ్ల నుంచి పనిచేయడమా.. అన్నది న్యాయమూర్తుల స్వీయ నిర్ణయానికి వదిలేసింది. అలాగే తుది విచారణ కాకుండా తాజా కేసులు, కౌంటర్ కేసులు, కోర్టు ధిక్కార వ్యాజ్యాల విచారణ విషయంలో అంతిమ నిర్ణయాన్ని సంబంధిత న్యాయమూర్తికి వదిలేసింది. ఈ విధివిధానాలపై మంగళవారం హైకోర్టు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
మా భద్రతకు చర్యలు తీసుకోండి
హైకోర్టు ఉద్యోగులు ఇద్దరు కోవిడ్‌తో చనిపోవడం, పలువురు కోవిడ్ బారిన పడిన పరిస్థితుల్లో ఉద్యోగులు పలు అభ్యర్థనలతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గోస్వామికి వినతిపత్రం ఇచ్చారు. ఉద్యోగుల తరఫున ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎ.వేణుగోపాలరావు, కార్యదర్శి సతీష్ వర్మ ఈ వినతిపత్రం సమర్పించారు. 50 శాతం మంది సిబ్బందితో పనిచేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. హైకోర్టులోకి ప్రవేశాన్ని కఠినతరం చేయాలని, హైకోర్టు ప్రాంగణం మొత్తం శానిటైజ్ చేసేలా చూడాలని అభ్యర్ధించారు. హైకోర్టు ఉద్యోగులందరికీ హైకోర్టు ప్రాంగణంలోనే కోవిడ్ వ్యాక్సిన్ వేసేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించాలని కోరారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేవరకు ప్రతి శనివారం సెలవు దినంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వినతిపత్రం పరిశీలించిన సీజే.. తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని సంఘం నాయకులకు హామీ ఇచ్చినట్లు తెలిసింది.