Gudivada Amarnath Press Meet On Ap Global Summit Vizag - Sakshi
Sakshi News home page

4న సీఎం జగన్‌ సమక్షంలో కీలక ఒప్పందాలు

Feb 28 2023 1:17 PM | Updated on Mar 1 2023 7:21 AM

Gudivada Amarnath Press Meet On Ap Global Summit Vizag - Sakshi

సాక్షి, విశాఖపట్నం: గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ (జీఐఎస్‌)–2023లో భాగంగా మార్చి 4వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో కీలక పారిశ్రామిక ఒప్పందాలు జరగనున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ చెప్పారు. విశాఖలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమవేశంలో ఆయన జీఐఎస్‌–2023కు సంబంధించిన వివరాలు తెలిపారు. ఏపీలో ఏయే రంగాల్లో పెట్టుబడులకు ఎంతమేర అవకాశాలున్నాయి, రాష్ట్రంలో ఉన్న వనరులు, సౌకర్యాలు మొదలైన అంశాలన్నింటినీ ఈ సదస్సు ద్వారా ప్రపంచానికి చాటిచెబుతామన్నారు.

14 రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి ఎంవోయూలు జరుగుతాయని చెప్పారు. రెండురోజుల పాటు సదస్సులో కీలక ఒప్పందాలు జరగనున్నాయన్నారు. 24 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్న ఈ సదస్సుకు ప్రపంచస్థాయి ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఐటీ, వ్యవసాయం, హెల్త్, ఫార్మా, టూరిజం, ఎంఎస్‌ఎంఈ, పునరుత్పాదక ఇంధన రంగం, డిఫెన్స్, ఏరోస్పేస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హ్యాండ్‌లూమ్స్‌ అండ్‌ టెక్స్‌టైల్స్, లాజిస్టిక్స్, ఫుడ్‌ ప్రాసెసింగ్, మేరీటైమ్‌ తదితర రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాల్ని దేశవిదేశీ ప్రతినిధులకు వివరిస్తామని తెలిపారు. అత్యధిక పెట్టుబడులు వచ్చే పునరుత్పాదక ఇంధన వనరుల రంగం, అత్యధికంగా ఉపాధి అవకాశాలు సృష్టించే టెక్స్‌టైల్స్‌ రంగంపై ప్రధానదృష్టి సారించినట్లు చెప్పారు.  

త్వరలో కొత్త పారిశ్రామిక విధానం 
ప్రస్తుత పారిశ్రామిక విధానం మార్చితో ముగియనున్న నేపథ్యంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా కొత్త ఇండస్ట్రియల్‌ పాలసీని రూపొందించినట్లు తెలిపారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలనలో ఉందన్నారు. సీఎం ఆమోదం పొందిన తర్వాత త్వరలోనే 2023–28కి కొత్త ఇండస్ట్రియల్‌ పాలసీని అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. కొత్త పాలసీతో పాటు జీఐఎస్‌లో ఎంవోయూ చేసుకున్న సంస్థలు ఆరునెలల్లోగా పరిశ్రమల స్థాపనకు పనులు ప్రారంభిస్తే ఎర్లీబర్డ్‌ పాలసీ ద్వారా అదనపు ప్రోత్సాహకాలు అందించాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారని తెలిపారు. ఈ ప్రత్యేక రాయితీల గురించి సీఎం జీఐఎస్‌లో ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఇండస్ట్రియల్‌ పాలసీతోపాటు, ఇతర రంగాల పాలసీలు కూడా అద్భుతంగా ఉన్నాయని, అవి ఆయా రంగాల్లో పెట్టుబడులు ఆహ్వానించనున్నాయని పేర్కొన్నారు. 

కార్యరూపం దాల్చే పరిశ్రమలతోనే ఒప్పందాలు 
దావోస్‌లో రూ.128 వేల కోట్ల ఒప్పందాలు జరిగితే ప్రస్తుతం రూ.38 కోట్ల పరిశ్రమలు పైప్‌లైన్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ జీఐఎస్‌ ద్వారా రూ.2 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు వస్తాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని, అంతకుమించి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం మాదిరిగా అంకెల గారడీతో ప్రజల్ని మభ్యపెట్టకుండా, వాస్తవంగా కార్యరూపం దాల్చే పరిశ్రమలతోనే ఒప్పందాలు చేసుకుని వాటిని మాత్రమే ప్రజలకు వివరిస్తామని తెలిపారు. టీడీపీ హయాంలో ఉత్తుత్తి ఒప్పందాలు చేసుకుని ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టని సంస్థలు మరోసారి ఎంవోయూలు చేసుకుంటామని వచ్చినా ఆహ్వానించే పరిస్థితి లేదని పేర్కొన్నారు. 

సుదీర్ఘ తీరంలో పెట్టుబడులకు అవకాశాలు 
దేశంలోనే సుదీర్ఘ తీరరేఖ కలిగిన రాష్ట్రాల్లో రెండోస్థానంలో ఉన్నా.. మొదటి స్థానంలో ఉన్న గుజరాత్‌తో పోలిస్తే ఏపీ తీరం వెంబడి పెట్టుబడులకు పుష్కలమైన అవకాశాలున్నాయని చెప్పారు. అందుకే తీరం వెంబడి పోర్టుల అభివృద్ధికి సంబంధించిన పనులు జోరుగా సాగుతున్నాయని తెలిపారు. ఏపీ మారిటైం బోర్డు ద్వారా రూ.15 వేల కోట్లతో 10 పోర్టులు, 9 ఫిషింగ్‌ హార్బర్లుని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి రామాయపట్నం పోర్టుకు మొదటి కార్గోవెసల్‌ తీసుకురావాలన్న లక్ష్యంతో పనులు పూర్తిచేస్తున్నామన్నారు. ప్రతి పోర్టుకి అనుసంధానంగా పారిశ్రామిక అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలి­పారు.

ఇందులో భాగంగా మచిలీపట్నం పోర్టుకు అనుబంధంగా దాదాపు 5 వేల ఎకరాలు, భావనపాడులో 3 వేల ఎకరాల వరకు పారిశ్రామిక అభివృద్ధి కోసం సమాలోచనలు జరుగుతున్నాయని వెల్లడించారు. దేశంలో ఉన్న 11 ఇండస్ట్రియల్‌ కారిడార్లలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏపీలో 3 కారిడార్లున్నాయని చెప్పారు. ఈ కారిడార్లలో 48 వేల ఎకరాల భూమి కేటాయించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. పెద్దపెద్ద పెట్రోలియం కంపెనీలు కూడా వచ్చేలా చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ సృజన పాల్గొన్నారు.

బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకుంటున్న చంద్రబాబు
పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుండటం హాస్యాస్పదమన్నారు. ఏపీలో మంచి వాతావరణం లేకపోతే ప్రతిపక్షనేత చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ కంపెనీని ఎప్పుడో తరలించేవారన్నారు. కానీ అది జరగలేదని, అంటే ఏపీలో ఎంత మంచి వాతావరణం కల్పిస్తున్నామో అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. బ్రహ్మాండంగా బిజినెస్‌ చేసుకుంటున్న చంద్రబాబు.. రాష్ట్ర ప్రభుత్వం అంది­స్తున్న సహకారం గురించి ప్రపంచానికి చాటిచెప్పాలని, కానీ ఆయనకు అంత మంచి మనసు లేదని ఎద్దేవా చేశారు.  

చదవండి: దుష్టచతుష్టయానికి దత్తపుత్రుడు జతకలిశాడు: సీఎం జగన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement