గందరగోళమా.. తింగరి మేళమా..? ఎక్కడుందయ్యా రామోజీ గందరగోళం..?

Eenadu Ramojirao Fake News On AP Govt Schools - Sakshi

ఒక్క స్కూలు మూతపడకున్నా.. మూసేస్తారంటూ ఎల్లో ప్రచారం 

ఒక్క టీచర్ని తొలగించకున్నా.. తీసేస్తారంటూ తప్పుడు కథనాలు 

‘చదువు గందరగోళం’ అంటూ రామోజీ రంకెలు 

స్కూళ్ల మ్యాపింగ్‌తో రాష్ట్రంలో మారనున్న పరిస్థితి 

3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు.. అదనంగా 56వేల తరగతి గదులు 

విద్యార్థులను జాతీయ స్థాయిలో పోటీకి తీర్చిదిద్దేలా సంస్కరణలు 

సీఎంకు మంచి పేరు వస్తుండడంతో తట్టుకోలేకపోతున్న పచ్చదండు 

9 సంస్కరణలతో ఈ మూడేళ్లలో రూ.52,676.98 కోట్ల వ్యయం 

నాడు–నేడుతో సర్వాంగ సుందరంగా బడులు 

జగనన్న గోరుముద్ద, విద్యాకానుక, విద్యాదీవెనలతో విద్యార్థులకు వేల కోట్ల లబ్ధి 

టీడీపీ హయాంలో ఒక్క ఆలోచన చేయకున్నా పట్టించుకోని ‘ఈనాడు’  

ఏది నిజం ?

ప్రభుత్వ స్కూళ్లను తీసేస్తున్నారని... ఉపాధ్యాయులను తొలగిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధిపతి చంద్రబాబు రెండు రోజులుగా ఊదరగొడుతున్నారు. గురువారం రామోజీరావు కూడా అదే ప్రచారాన్ని అచ్చేశారు. ‘చదువు గందరగోళం’ అంటూ గుండెలు బాదుకున్నారు. దీన్నిపుడు మిగతా తెలుగుదేశం నాయకులూ వల్లెవేస్తున్నారు. వాస్తవానికి.. ఇదంతా ఎల్లో ముఠా స్కెచ్‌. పకడ్బందీగా నడిపించే స్కీమ్‌!. ఏదో ఒక దుష్ప్రచారాన్ని మొదలుపెట్టి... నిజమేనేమో అని భ్రమపడే స్థాయికి దాన్ని తీసుకెళ్లటమే వీళ్ల అజెండా.  

అసలు మీ బుర్రల్లో తప్ప ఎక్కడుందయ్యా రామోజీ గందరగోళం...? రాష్ట్రంలో స్కూళ్లు మారటం లేదా? పిల్లల చదువు మారటం లేదా? విద్యను అత్యంత ప్రాధాన్యాంశంగా చేసుకుని... చదువుతోనే భవిత మారుతుందన్న దృఢమైన సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ముందుకెళ్లటం లేదా? ప్రభుత్వ స్కూళ్లకు ఇంగ్లిష్‌ మీడియం వస్తుందని, సర్కారీ స్కూలు విద్యార్థులు బైజూస్‌ లాంటి ఎడ్యుటెక్‌ కంపెనీ నుంచి ఆన్‌లైన్లోనూ ట్యాబ్‌ల ద్వారా నేర్చుకుంటారని అసలు మీరెప్పుడైనా ఊహించారా? మీరు నడిపే ప్రైవేటు స్కూళ్లలో ఉండే సౌకర్యాలు ప్రభుత్వ స్కూళ్లలో కూడా పెడితే బాగుంటుందని ఏనాడైనా మీ చంద్రబాబుకు సలహా ఇచ్చారా? ఎందుకింత దారుణంగా పతనమవుతున్నారు? స్కూళ్లను పునర్వ్యవస్థీకరించటం వల్ల విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలతో పాటు మెరుగైన బోధన లభ్యమవుతుందని మీకు తెలీదా? అన్నీ తెలిసి కూడా ప్రజల్ని రెచ్చగొట్టేలా ఎందుకీ విషపు రాతలు? అసలు చంద్రబాబు గనక అధికారంలో ఉండి ఇలాంటివి మొదలుపెట్టి ఉంటే మీరు భూమ్మీద నిలబడేవారా? బాబును భారతరత్న చెయ్యాలనే స్థాయిలో వార్తలు రాసి ఉండేవారు కాదా? మరీ ఇంతగా దిగజారిపోతున్నారెందుకు?  

స్కూళ్ళను పునర్వ్యవస్థీకరించటం వల్ల ఒక్క స్కూలు కూడా మూతపడటం లేదు. ఒక్క టీచరు పోస్టు కూడా తగ్గలేదు. గతంలో ఎన్ని స్కూళ్లున్నాయో ఇప్పుడూ అన్నే ఉన్నాయి. టీచర్ల సంఖ్యా అంతే. పైగా ప్రభుత్వ స్కూళ్లలో అదనంగా 11, 12 తరగతులను ప్రవేశపెట్టేలా హైస్కూల్‌ ప్లస్‌ విధానాన్ని తెస్తున్నారు. అయినా ఎందుకింత దుష్పచారం రామోజీరావు గారూ? 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లతో బోధనను అందుబాటులోకి తేవడం, ఫౌండేషన్‌ స్కూళ్లలో మంచి బోధన కోసం అవసరమైన టీచర్లను ఏర్పాటుచేయడం, ప్లస్‌–2 తరగతులకు అదనంగా లెక్చరర్ల ఏర్పాటు వల్ల టీచర్ల సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గేదెక్కడ? అనేక చోట్ల స్కూళ్లను అప్‌గ్రేడ్‌ చేస్తున్నారు.

ఇలా అప్‌గ్రేడ్‌ చేయడంలో భాగంగా వివిధ దశల్లో 56వేలకు పైగా అదనపు తరగతి గదులు ఏర్పాటవుతాయి. వీటివల్ల ఆయా స్కూళ్లలో టీచర్ల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గుతుందా? ఎందుకింత కడుపు మంట? అసలు చంద్రబాబు నాయుడి హయాంలో 3వ తరగతికి క్లాస్‌ టీచర్లయినా సరిగా ఉన్నారా? ఇప్పుడు 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లను తెస్తే ఎందుకింత విషపు రాతలు? మ్యాపింగ్‌ పూర్తయి, 3, 4, 5 తరగతులు సమీపంలోని హైస్కూల్‌కు మారినా... ప్రస్తుతం ఉన్న ప్రైమరీ, ప్రీప్రైమరీ పాఠశాలల్లోనే 1, 2 తరగతులు కొనసాగుతాయి. వీటికి అంగన్‌వాడీ కేంద్రాలు అనుసంధానమై, వీటిలోని పిల్లలకు పీపీ–1, పీపీ–2 విద్య అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల ఏ పాఠశాలైనా ఎలా మూతపడుతుంది? పాఠశాలలకు దూరంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలు శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూళ్లుగా కొనసాగుతాయి కదా!!. 

లోపాలకు చెక్‌ పెట్టడం మీకు తెలియదా? 
చంద్రబాబు హయాంలో ప్రీ స్కూలింగ్‌ లేదు. పీపీ–1, పీపీ–2 ప్రైవేటు స్కూళ్లకే పరిమితం.దీంతో ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు పునాది స్థాయిలో సామర్ధ్యాలు పరిమితమైపోయాయి. పై స్థాయికి వెళ్లేకొద్దీ ప్రమాణాలు దిగజారిపోయాయి. 1–5 తరగతులున్న ప్రైమరీ స్కూళ్లలో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఎస్జీటీ టీచర్లుండటంతో బోధన అంతంత మాత్రం. 1–5 తరగతులకు 18 సబ్జెక్టులుంటే ఒకరిద్దరు టీచర్లు వాటిపై దృష్టి సారించడం సాధ్యమా? ఒక టీచర్‌ సెలవు పెడితే ఒక్క టీచర్‌తో ఆ పాఠాలూ ఉండేవి కావు కదా? ఏకోపాధ్యాయ స్కూళ్లలో బోధన పూర్తిగా అటకెక్కడం నిజం కాదా? ఇవన్నీ తెలిసి కూడా అప్పట్లో ఒక్క వార్త కూడా ఎందుకు రాయలేదు రామోజీరావు గారూ? ఇప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దీన్ని సమూలంగా మారుస్తుంటే ఎందుకంత కడుపుమంట? 

ఆరంచెల విధానం... స్కూల్‌ ఎక్సలెన్సుకు శ్రీకారం 
పేదరికానికి చదువే సరైన చికిత్స అని పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి జగన్‌... ఈ పరిస్థితిని పూర్తిగా మార్చే లక్ష్యంతో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆరంచెల విద్యా విధానంలో.. 
► కేవలం అంగన్వాడీ కేంద్రాలు మాత్రమే ఉండే చోట ప్రీప్రైమరీ–1, ప్రీప్రయిమరీ–2 (పీపీ–1, పీపీ–2)లను ప్రవేశపెట్టి వాటిని శాటిలైట్‌ ఫౌండేషనల్‌ స్కూళ్లుగా చేశారు. 
► ప్రయిమరీ పాఠశాలలున్న చోట వాటికి పీపీ1, పీపీ2లను అనుసంధానించి 1, 2 తరగతులతో ఫౌండేషనల్‌ స్కూళ్లుగా చేశారు. 
► 3, 4, 5 తరగతుల విద్యార్ధులను హైస్కూళ్లకు అనుసంధానించే వీలులేని చోట పీపీ1, పీపీ2లను, 1–5 తరగతులతో ప్రయిమరీ స్కూళ్లను ఫౌండేషనల్‌ ప్లస్‌ స్కూళ్లుగా మార్పు చేస్తున్నారు. 
► 3వ తరగతి నుంచి 7/8వ తరగతి వరకు ప్రీ హైస్కూళ్లుగా చేస్తున్నారు. 
► 3, 4, 5 తరగతుల పిల్లల అనుసంధానం ద్వారా 3–10 వరకు హైస్కూళ్లుగా పరిగణిస్తున్నారు. 
► 3–10వ తరగతితో పాటు,  ఇంటర్మీడియెట్‌ (11, 12 తరగతులను) కలిపి హైస్కూల్‌ ప్లస్‌ గా మార్పు చేస్తున్నారు. 

సమూలంగా మార్చే సంస్కరణలు... 
ఇలా స్కూళ్లను పునర్వ్యవస్థీకరించడంతో ఊరుకోలేదు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్ధులు, టీచర్లకు సదుపాయాలు కల్పిస్తూ ‘మనబడి నాడు– నేడు’ కింద వాటి రూపు రేఖలు మార్చేశారు. రన్నింగ్‌ వాటర్‌తో టాయిలెట్లు, డ్రింకింగ్‌ వాటర్, మరమ్మతులు, ప్రహరీలు, విద్యుత్తు, ఫ్యాన్లు, లైట్లు... విద్యార్ధులు, టీచర్లకు డ్యూయెల్‌డెస్కులు, కుర్చీలు, అల్మారాలు వంటి ఫర్నీచర్, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, ఇంగ్లిష్‌ ల్యాబ్‌లు, పెయింటింగ్, కిచెన్‌ షెడ్లు నిర్మించారు. అమ్మ ఒడితోపాటు జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద కార్యక్రమాలనూ అమలుచేస్తున్నారు. ఇలాంటి అంశాలపై చంద్రబాబు ఆలోచన కూడా చెయ్యలేదు. రామోజీ సలహా కూడా ఇవ్వలేదు.  

రామోజీ... ఇదిగో చూడండి... నాడు– నేడు!!  
వై.ఎస్‌.జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక విద్యపై ఈ మూడేళ్లలో ఏకంగా రూ.52,676.98 కోట్లు వెచ్చించారు. కుల మత పార్టీ వివక్షలకు తావు లేకుండా... లంచాలకు ఆస్కారం లేకుండా పథకాలు అమలు చేస్తున్నారు. వీటిని నాటి చంద్రబాబు పరిస్థితులతో పోలిస్తే... 
► పిల్లలను బడికి పంపించే అర్హులైన దాదాపు 44,48,865 మంది తల్లులకు జగనన్న అమ్మ, ఒడి కింద ఏటా రూ.15వేలు నేరుగా ఖాతాల్లో పడుతున్నాయి. ఇప్పటిదాకా రూ.19,617.53 కోట్లు దీనిపై ఖర్చు చేయగా... బాబు హయాంలో ఇలాంటి పథకం ఆలోచనే రాలేదు.  
► జగనన్న విద్యాదీవెనతో 21,55,298 మందికి ఇప్పటిదాకా పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేశారు. రూ.11,007.17 కోట్లు చెల్లించారు. గతం ప్రభుత్వం అరకొర ఫీజులు చెల్లించటమే కాక... వాటిని కూడా బకాయి పెట్టడానికే ప్రాధాన్యమిచ్చింది. బాబు ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన రూ.1,778 కోట్లను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే చెల్లించింది. అదీ నిజం!. జగనన్న వసతి దీవెనతో ఏకంగా 18,77,863 మందికి లబ్ధి చేకూరింది. 
► జగనన్న విద్యాకానుక ఓ విప్లవం. స్కూళ్లు మొదలైన రోజే విద్యార్థులకు స్కూలు బ్యాగుతో పాటు డిక్షనరీతో సహా టెక్ట్స్‌ బుక్స్, నోట్‌బుక్స్, యూనిఫారం ఇలా కార్పొరేట్‌ స్కూళ్ల పిల్లలకే సాధ్యమైన సమస్త వస్తువులనూ కిట్‌ రూపంలో అందించటమనేది గతంలో ఊహల్లో కూడా సాధ్యంకాని పని. ఏకంగా 47,40,421 మంది పిల్లలకు ఈ మూడేళ్లలో రూ.2368.33 కోట్లతో వీటిని అందించారు ముఖ్యమంత్రి జగన్‌. ఈ ఒక్క ఏడాదే దాదాపు రూ.931 కోట్లు జగనన్న విద్యాకానుకకు వెచ్చించారు. త్వరలో అందించబోయే ట్యాబ్‌లకు మరో 500 కోట్లు వెచ్చిస్తున్నారు. అంటే ఈ ఒక్క ఏడాదే రూ.1,431 కోట్లు... అదీ ఈ ఒక్క పథకంమీదే. బాబు హయాంలో స్కూళ్లు తెరిచి ఆరేడు నెలలైనా యూనిఫారం సంగతి దేవుడెరుగు. కనీసం టెక్ట్స్‌ బుక్సు కూడా అందించలేని దుస్థితి. ఇక ఇతర వస్తువుల జాడే లేదు. మరి ఏ మొహం పెట్టుకుని ఇలాంటి వార్తలు రాస్తారు రామోజీరావు గారూ? 
► ‘జగనన్న గోరుముద్ద’ పేరిట ఏకంగా 43,26,782 మంది విద్యార్థులకు రోజూ రుచికరమైన పౌష్టికాహారం అందుతోంది. దీనికోసం ఈ మూడేళ్లలో పెట్టిన ఖర్చు రూ.3087.50 కోట్లు. కానీ బాబు హయాంలో నాసిరకం ఆహారం, ఉడికీ ఉడకని అన్నం, రుచీపచీ లేని కూరలు, నీళ్ల చారే గతి. ఆయాల జీతాలు 8, 9 నెలలు పెండింగ్‌లోనే ఉండేవి. కాకపోతే నాటి దుస్థితిపై రామోజీ ఎన్నడూ పెన్నెత్తలేదు మరి. 
► బాబు హయాంలో బడులు శిథిలావస్థకు చేరినా పట్టించుకుంటే ఒట్టు. మంచినీరు కాదు కదా... బాత్రూమ్‌కు వెళ్లాలన్నా ఆడపిల్లలు తమ ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితులుండేవి. ఈ దరిద్రాలన్నీ ‘ఈనాడు’ ఏనాడూ చూడకుండా ఉండటానికే ప్రయత్నించింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ‘నాడు–నేడు’ పేరిట తొలిదశలో 15,715 స్కూళ్ల రూపు మార్చడానికి రూ.3669 కోట్లు ఖర్చుచేసింది. రెండో దశలో రూ.8,000 కోట్లతో 22,344 స్కూళ్లు మారుతున్నాయి. మొత్తంగా రూ.16450 కోట్ల వ్యయంతో 56,572 స్కూళ్లను అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి దృఢ సంకల్పం. 
► గతంలో అతి తక్కువ మందికి నామమాత్రపు పౌష్టికాహారాన్ని అందించగా... ఇపుడు తల్లులతో పాటు ఆరు నెలల నుంచి ఆరేళ్ల వయసున్న పిల్లలకు సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందించేందుకు ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ’ తీసుకొచ్చారు. నీతీ ఆయోగ్‌తో సహా పలు రాష్ట్రాలు సైతం ఈ పథకాన్ని ఇప్పటికే పలుమార్లు కొనియాడాయి. 34,19,875 మందికి రూ.4,895.45 కోట్లు ఖర్చుబెట్టారంటే పరిస్థితి తేలిగ్గానే అర్థంచేసుకోవచ్చు. 
► బాలికల డ్రాపవుట్‌ రేటు తగ్గించడానికి గత ప్రభుత్వం చేసిందేమీ లేదు. స్కూళ్లలో కనీసం బాత్రూమ్‌లైనా బాగు చేయాలన్న తలంపు చంద్రబాబుకు రానే లేదు. ఆడపిల్లల కష్టాలు తెలిసిన తండ్రిగా... రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లోని 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న 10 లక్షల మందికి పైగా విద్యార్థినులకోసం ‘స్వేచ్ఛ’ పథకం ఆరంభించారు జగన్‌. ఏటా రూ.32 కోట్ల వ్యయంతో నెలకు 10 చొప్పున ఏడాదికి 120 నాణ్యమైన బ్రాండెడ్‌ శానిటరీ నాప్‌కిన్లు ఉచితంగా పంపిణీ చేయిస్తున్నారు. 10,01,860 మంది ఆడపిల్లలకు ఇచ్చిన ఈ ‘స్వేచ్ఛ’ రామోజీకి కనిపించదా? 
► ఎడ్యుటెక్‌ కంపెనీలతో టైఅప్‌ కావటమనేది కార్పొరేట్‌ స్కూళ్లకే సాధ్యం. దానికోసం విద్యార్థులు ఏటా కనీసం రూ.24వేల చొప్పున చెల్లించక తప్పదు. అలాంటి చదువును ప్రభుత్వ స్కూళ్ల విద్యార్ధులకు ‘బైజూస్‌’ ద్వారా అందుబాటులోకి తెచ్చారు వై.ఎస్‌.జగన్‌. దీనికోసం ఏటా 8వ తరగతిలోకి వచ్చే 4.7 లక్షల మంది విద్యార్ధులకు రూ.500 కోట్లతో ట్యాబ్‌లు అందజేస్తారు. ఫలితంగా కార్పొరేట్‌ స్కూళ్లకు దీటైన బోధన సర్కారీ స్కూలు పిల్లలకూ అందుతుంది. దీంతో పాటు డిజిటల్‌ విధానంలో బోధన జరిగేలా ప్రతి తరగతి గదిలో టీవీ లేదా డిజిటల్‌ బోర్డులూ ఏర్పాటు కాబోతున్నాయి. ఇవే... రామోజీకి గానీ, చంద్రబాబుకు గానీ నచ్చనివి.

ఇంగ్లీష్‌ మీడియంకు ఎందుకు వ్యతిరేకం? 
నిజానికి చంద్రబాబు గానీ, రామోజీరావుగానీ ఇంగ్లీషుకు వ్యతిరేకం కాదు. ఎందుకంటే తమ పిల్లల్ని ఇంగ్లీషు మీడియాల్లోనే చదివిస్తారు. రామోజీరావు నడిపే స్కూల్లో ఇంగ్లీషు మీడియమే ఉంటుంది. మరి ఆ చదువును గల్లీలోని సర్కారీ స్కూల్లోకి తీసుకొస్తే ఎలా? అదే వాళ్ల ఆగ్రహానికి కారణం. విద్యార్థులను ప్రయివేటు స్కూళ్లలోకి నడిపించటమనేది బాబు ప్రాధాన్యాల్లో ఒకటి. కానీ జగన్‌ అధికారంలోకి రాగానే ప్రయివేటు పాఠశాలల్లోని ఎల్‌కేజీ, యూకేజీ మాదిరిగా ఫౌండేషన్‌ విద్యతో పాటు ఆంగ్ల మాధ్యమానికీ శ్రీకారం చుట్టారు. దీనికోసం రాష్ట్రంలోని 1.90 లక్షల టీచర్లకు ప్రత్యేక శిక్షణనిచ్చారు.

విద్యార్ధులకు, టీచర్లకు ప్రయోజనకరంగా ఉండేలా ఒకవైపు తెలుగు, మరోవైపు అంగ్లం ఎదురెదురు పేజీల్లో ఉండేలా బైలింగ్యువల్‌ పాఠ్యపుస్తకాలను అందుబాటులోకి తెచ్చారు. దేశవ్యాప్తంగా అందరు విద్యార్థులతో పోటీపడేలా సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) విదానాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమల్లోకి తెచ్చారు. ఈ చర్యలన్నీ నచ్చి... 2018–19 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 37.21 లక్షలుగా ఉన్న విద్యార్ధులు 7 లక్షలకు పైగా పెరిగి 2021–22 విద్యాసంవత్సరానికి 44.30 లక్షలకు చేరారు. వీటిని ఏమాత్రం సహించలేకపోతోంది ‘ఈనాడు’. ఎందుకంటే జనం అభినందించే ఏ పనైనా చంద్రబాబు చేసినట్టే చెప్పాలన్నది దాని ఉద్దేశం. వేరొకరు ఎంత మంచి చేసినా... దాన్ని వ్యతిరేకించడమే ఆ పత్రిక అసలైన పాలసీ. ఔరా.. మరీ ఇంత దిగజారుడా!!.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top