తప్పుడు రాతలెందుకో.. చెప్పవే ‘సిలికా’ | Sakshi
Sakshi News home page

తప్పుడు రాతలెందుకో.. చెప్పవే ‘సిలికా’

Published Tue, May 9 2023 4:45 AM

Eenadu Fake News On Silica Sand Mining - Sakshi

సాక్షి, అమరావతి: తప్పుడు కథనాల్లో ఈనాడుది అందె వేసిన చేయి. అదే కోవలో సిలికా శాండ్‌ విక్రయాలపై మరో కట్టు కథనం ప్రచురించింది. గనుల శాఖకు సంబంధం లేని విషయాలను ఆ శాఖకు ముడిపెట్టి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేసింది. పరస్పర విరుద్ధ వాదనలతో కథనాన్ని అల్లింది. ఈనాడు కథనమంతా పూర్తిగా అవాస్తవాలతో కూడుకున్నదని గనుల శాఖ స్పష్టం చేసింది. సిలికా శాండ్‌ మైనింగ్‌పై అసలు వాస్తవాలను ఆ శాఖ డైరెక్టర్‌ వీజీ వెంకటరెడ్డి వివరించారు.

అసత్యాలు, వక్రీకరణలతో ప్రభుత్వంపై బురదచల్లేలా ఈ కథనం ఉందని చెప్పారు. సిలికా శాండ్‌ మైనింగ్, రవాణా, విక్రయాలు, జీఎస్టీ చెల్లింపులపై ఆ కథనంలో చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేశారు. గనుల శాఖ నలుగురికే అనుకూలంగా ఉందన్న ఆరోపణా అసత్యమని చెప్పారు. ఆ నలుగురికే అనుకూలంగా ఉంటే ఇటీవల కొత్తగా 11 మందికి ఎలా లీజులు జారీ చేస్తామని ప్రశ్నించారు. ఈ అంశంపై సోమవారం ఆయన మీడియాతో చెప్పిన వివరాలు.. 

చెల్లింపులన్నీ ఆన్‌లైన్‌లోనే.. 
సిలికా శాండ్‌ లీజు అనుమతులు, చెల్లింపులు అన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతాయి. సిలికా శాండ్‌కు లీజుదారుల నుంచి సీనరేజీ, డీఎంఎఫ్, మెరిట్, కన్సిడరేషన్‌ మొత్తాలను గనుల శాఖ ఆన్‌లైన్‌లోనే స్వీకరిస్తుంది. అన్ని అనుమతులున్న లీజుదారులకు రవాణా పత్రాలను కూడా ఆన్‌లైన్‌లోనే జారీ చేస్తుంది. లీజుదారులు మైనింగ్‌ చేసిన మెటీరియల్‌ను మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా> బహిరంగ మార్కెట్‌లో ఎవరికైనా అమ్ముకోవచ్చు. లీజుదారులు వారికి అనుకూలమైన సంస్థలకే మినరల్‌ను విక్రయించుకుంటారు.

ఇందులో గనుల శాఖ ప్రమేయం ఉండదు. ఒత్తిడి చేసే అవకాశమే ఉండదు. నష్టం వచ్చేలా ఎవరైనా వ్యాపా­రం చేస్తారా? వ్యాపార రంగంలో విస్తరించి ఉన్న ఈనాడు సంస్థకు ఈ విషయం తెలియదా?  ఆసక్తి ఉంటే ఈనాడు యాజమాన్యం కూడా నిబంధనల ప్రకారం సిలికా శాండ్‌ లీజులు పొందవచ్చు, అలాగే లీజుదారుల నుంచి శాండ్‌ను కొనుక్కోవచ్చు. నిబంధనల ప్రకారం అవసరమైన సహకారాన్ని అందిస్తాం. 

నిష్పాక్షికతకు నిదర్శనమిది 
కేవలం నలుగురు డీలర్లకే మేలు చేకూర్చేలా, లీజుదారులు సిలికా శాండ్‌ను వారికి మాత్రమే విక్రయించేలా గనుల శాఖ జరిమానాల పేరుతో వారిపై ఒత్తిడి తెచ్చిందనడం పూర్తిగా నిరాధారం. ఇటీవల గనుల శాఖ కొత్తగా 11 మందికి సిలికా శాండ్‌ మైనింగ్‌ లీజులు జారీ చేసింది. నిజంగా ఆ నలుగురికే మేలు చేసే ఉద్దేశం ఉంటే ఈ లీజులు వారే దక్కించుకొని ఉండే వారు. కొత్త వారికి అవకాశం లభించేదా? గనుల శాఖ నిష్పక్షపాతంగా వ్యవహరించబట్టే కొత్త వారికి లీజులు లభించాయి. 

గనుల శాఖకేం సంబంధం? 
లీజుదారులు డీలర్లకు విక్రయిస్తున్న సిలికా శాండ్‌కు సగం మొత్తాన్ని ఆన్‌లైన్‌లో, మిగిలిన దాన్ని నగదుగా తీసుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై గనుల శాఖకు ఎటువంటి బాధ్యత ఉండదు. లీజుదారులు, విక్రయదారుల మధ్య జరిగే లావాదేవీల్లో గనుల శాఖ జోక్యం చేసుకోదు. నిబంధనల ప్రకారమే లీజుదారులు జీఎస్టీ చెల్లింపులు చేస్తున్నారు. ఏడాదికి సగటున 20 లక్షల టన్నులు సిలికా శాండ్‌ విక్రయిస్తున్నారు. దానిలో సగం మాత్రమే ఆన్‌లైన్‌లో స్వీకరిస్తూ, దానికి మాత్రమే జీఎస్టీ చెల్లిస్తున్నారంటూ చేసిన ఆరోపణకు ఆధారాలున్నాయా? 

పరస్పర విరుద్ధ వాదనలేమిటి? 
సిలికా శాండ్‌ మైనింగ్‌లో పెద్దఎత్తున ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూనే, మరోవైపు గనుల శాఖ జరిమానాలు విధించిందని, ఆ తర్వాత వాటిని సర్దుబాటు చేసిందని పరస్పరం విరుద్ధంగా రాస్తున్నారు. జిల్లా స్థాయిలో విజిలెన్స్‌ స్క్వాడ్, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చెక్‌ పోస్ట్‌లు, కీలక ప్రాంతాల్లో నిఘా బృందాలను ఏర్పాటు చేయడం ద్వారా సిలికా శాండ్‌ మైనింగ్‌లో అక్రమాలను గనుల శాఖ పూర్తి స్థాయిలో నియంత్రిస్తోంది.

ఆరోపణలు వచ్చిన చోట తనిఖీలు చేసి, జరిమానాలు విధిస్తున్నాం. ఈ జరిమానాలపై లీజుదారులు రివిజన్‌ అథారిటీకి అప్పీల్‌ చేసుకోవచ్చు. ఇది అన్ని మినరల్స్‌ మైనింగ్‌లోనూ సర్వసాధారణంగా జరుగుతుంది. అథారిటీ ఆ జరిమానాలను సమీక్షించి నిర్ణయం తీసుకుంటుంది. కేవలం ఎవరికో లబ్ధి చేకూర్చేందుకు జరిమానాలను సర్దుబాటు చేశారని రాయడం తప్పు.  

 తిరుపతి జిల్లా చిల్లకూరు, కోట మండలాల్లోని 1150.975 హెక్టార్లలో 73 సిలికా శాండ్‌ లీజులున్నాయి. శుద్ధి చేయని సిలికా శాండ్‌ను టన్ను రూ.700 కి విక్రయిస్తారు. శుద్ధి చేసిన ఇసుకను దానికి అయిన వ్యయాన్ని బట్టి రేటు నిర్ణయిస్తారు. శుద్ధి చేయని ఇసుకకు  లీజుదారులు టన్నుకు రూ.100 సీనరేజీ, కన్సిడరేషన్‌ కింద రూ.212, డీఎంఎఫ్‌ కింద రూ.30, మెరిట్‌ కింద రూ.2  కలిపి రూ.346 ప్రభుత్వానికి చెల్లించాలి. 

కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తున్నాం 
సిలికా శాండ్‌ మైనింగ్‌పై కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేస్తున్నాం. 2019లో 73 లీజులను గనుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు తనిఖీ చేసి ఉల్లంఘనలు గుర్తించి 61 లీజులకు జరిమానా విధించారు. వారిలో 52 మంది లీజుదారులు రివిజన్‌ అథారిటీకి అప్పీల్‌ చేసుకున్నారు. అథారిటీ వాటిని సమీక్షించి పరిష్కరించింది. సిలికా శాండ్‌ మైనింగ్, రవాణాపై మూడంచెల నిఘా వ్యవస్థ కొనసాగుతోంది.

ఇంటర్నల్‌ బృందాలు, ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్ట్‌ తనిఖీలు, జిల్లా విజిలెన్స్‌ బృందాలు ఎప్పటికప్పుడు మైనింగ్‌ను పర్యవేక్షిస్తున్నాయి. ఆకస్మిక తనిఖీల  ద్వారా ఎక్కడా అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాయి. తిరుపతి జిల్లా మోమిడి, బల్లవోలు, వేల్లపాలెం తదితర గ్రామాల్లోని అసైన్డ్‌ భూముల్లో అక్రమ సిలికా తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు అవాస్తవం.

తిరుపతి జిల్లా తడ మండలం బీవీ పాలెం వద్ద ఇంటిగ్రేటెడ్‌ చెక్‌ పోస్ట్‌ ఏర్పాటు చేసి అక్రమ మైనింగ్‌ రవాణాను పూర్తి స్థాయిలో నియంత్రిస్తున్నాం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంగా నిఘా బృందాలు ఎప్పటికప్పుడు సిలికా శాండ్‌ మైనింగ్‌ను పర్యవేక్షిస్తున్నాయి.

సిలికా శాండ్‌ మైనింగ్‌లో లీజుదారులది ప్రేక్షక పాత్రని, వందల కోట్ల దందా జరుగుతోందని, కొందరు పెద్దలకు ఈ మొత్తాలు చేరుతున్నాయంటూ ప్రభుత్వంపై ప్రజల్లో అపోహలు కలిగించేలా ఈనాడులో తప్పుడు కథనాన్ని ప్రచురించడాన్ని  ఖండిస్తున్నాం. నిబంధనల ప్రకారమే మైనింగ్, విక్రయాలు, రవాణా జరుగుతుంటే,  అక్రమాలు, పెద్దల పాత్రంటూ ఊహాత్మక అంశాలను జోడించి, అసత్య కథనాలు రాయడం మానుకోవాలి. 

Advertisement
 
Advertisement