
క్వింటా రూ.8,400 నుంచి రూ.7,200కు డౌన్
అన్నదాతల్లో మొదలైన ఆందోళన
ఇప్పటికీ ఇళ్లల్లోనే పత్తి నిల్వలు
రాయదుర్గం: అనంతపురం జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. గత ఏడాది రబీలో వ్యవసాయ బోర్లు, హెచ్చెల్సీ ఆయకట్టు పరిధిలో 2,190 హెక్టార్లలో పత్తి సాగైంది. ప్రస్తుత ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల కారణంగా వేరుశనగ సాగు తగ్గి.. పత్తి విస్తీర్ణం పెరిగింది. 13,695 హెక్టార్లలో పత్తి పంట పెట్టారు. రెండు నెలల క్రితం పంట కోతకొచ్చింది. అప్పట్లో పత్తి నాణ్యత ఆధారంగా క్వింటా ధర రూ.8000 నుంచి రూ.8,500 పలికింది. కొందరు రైతులు విక్రయించుకోగా, మరి కొందరు ఇంకో రెండు నెలల పాటు నిల్వ చేస్తే క్వింటా రూ.9 వేలకు పెరిగినపుడు అమ్ముకోవచ్చని ఆశించారు. అయితే పరిస్థితి తారుమారైంది. క్వింటా రూ.7200కు ధర పడిపోవడం రైతులను కలవర పెడుతోంది.
మార్కెట్ సదుపాయం కురువే..
జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం గణణీయంగా పెరుగుతున్నా సరైన మార్కెట్ సదుపాయం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పత్తి అమ్ముకోవాలంటే కర్ణాటక రాష్ట్రం బళ్లారి, తుమకూరు ప్రాంతాల్లోని మిల్లులు, ఏఎమ్‌సీ మార్కెట్లపై ఆధారపడాల్సి వస్తోంది. అక్కడ ఏ ధర నిర్ణయించినా సరే దానికే అమ్ముకోవాల్సి వస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దళారులే ధర నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఊళ్లలోనే ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తూ రైతుల నడ్డి విరుస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పత్తి కొనుగోలు కేంద్రాన్ని అందుబాటులోకి తేవాలని రైతులు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
మద్దతు ధరతో కొనాలి
ఈ ఏడాది పత్తికి ప్రారంభ ధర క్వింటాలు రూ.8500కు పైగా పలికినా.. ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది. దీంతో ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పడిపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించింది. పెట్టుబడులు చూస్తే ఎకరాకు రూ.40 వేల వరకు పెరిగిపోయాయి. కనీసం క్వింటా పత్తి ధర రూ.10 వేల నుంచి రూ.12 వేలు పలికితేనే గిట్టుబాటు లభిస్తుంది. ప్రభుత్వమే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి మద్దతు ధరతో పత్తి కొనుగోలు చేయాలి. నా వద్ద 20 క్వింటాళ్ల పత్తిని నిల్వ చేశాను. ధర కోసం వేచి ఉన్నా. – జగదీశ్వర్‌రెడ్డి, రైతు, ఉద్దేహాళ్
రైతులను ఆదుకోవాలి
పత్తి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. బళ్లారి మార్కెట్లో ఇష్టమొచ్చిన విధంగా ధరలు నిర్ణయిస్తున్నారు. కూటమి సర్కార్ మద్దతు ధరతో పత్తి కొనుగోలు చేయాలి. జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తీసుకురావాలి. నష్టపోతున్న రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. – రామాంజినేయులు, రాయంపల్లి