రైతన్నకు అన్నీ చెబుదాం

CM Jagan Video Conference With District Collectors On agriculture - Sakshi

రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 9 నుంచి 23 వరకు రైతు భరోసా చైతన్య యాత్రలు

రేపు రైతు దినోత్సవం నిర్వహిస్తున్నాం

ఆర్బీకేల విధి విధానాలు, సీఎం యాప్‌ పనితీరు, ఇ–క్రాపింగ్‌.. తదితర అంశాలపై రైతులకు అవగాహన 

కలెక్టర్లు, ఎస్పీలు 2 వారాలకొకసారి కలిసి కూర్చుని ప్రజా సమస్యలపై చర్చించాలి.. వీటి పరిష్కారం విషయంలో ముందడుగు వేయాలి

వ్యవసాయ రంగం బాగుంటేనే అందులోని వారి జీవనోపాధి పెరుగుతుంది

నకిలీ విత్తనాల విక్రయాలను అడ్డుకునేందుకు దాడులు జరగాలి

ప్రతినెలా మూడుసార్లు వ్యవసాయ సలహా మండలి సమావేశాలు విధిగా జరగాలి

కౌలు రైతులకు రుణాలు అందేలా చూడాలి

‘ఉపాధి’ పనుల విషయంలో కలెక్టర్లు అద్భుతంగా పనిచేశారు, అభినందనలు

16 కోట్ల పనిదినాలు లక్ష్యమైతే 17.18 కోట్లకు పైగా పనిదినాలు చేశారు

దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం 

‘స్పందన’లో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలకు వ్యవసాయంపై వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌ దిశానిర్దేశం 

సాక్షి, అమరావతి: ఈ నెల 8న రైతు దినోత్సవం నిర్వహిస్తున్నామని.. అలాగే 9 నుంచి ఈ నెల 23 వరకు రైతుభరోసా చైతన్య యాత్రలు నిర్వహించనున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌ వెల్లడించారు. ఈ చైతన్య యాత్రల్లో వ్యవసాయ, దాని అనుబంధ విభాగాల సిబ్బంది, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలతో కలిసి రైతులకు అవగాహన కలిగించాలన్నారు. అలాగే ఆర్బీకేల విధివిధానాలు, సీఎం యాప్‌ పనితీరు, ఇ–క్రాపింగ్‌ తదితర వ్యవసాయ సంబంధ అంశాలపై రైతుల్లో అవగాహన పెంచాలని ఆయన ఆదేశించారు. 62 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని, వ్యవసాయ రంగం బాగుంటేనే వీరి జీవనోపాధి పెరుగుతుందని ఆయనన్నారు. అలాగే, వ్యవసాయ, సంబంధిత కార్యక్రమాలపై కలెక్టర్లు దృష్టి పెట్టాల్సిందిగా సీఎం సూచించారు. 94.84 లక్షల ఎకరాల్లో పంటలు వేయాలని ఖరీఫ్‌లో లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. ఖరీఫ్‌ సన్నద్ధత, ఇ–క్రాపింగ్‌ నమోదు, నకిలీ విత్తనాలపై నిఘా, వ్యవసాయ సలహా మండలి సమావేశాలు, కౌలు రైతులకు రుణాలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే..

నకిలీలపై నిఘా
కలెక్టర్లు, ఎస్పీలు రెండు వారాలకొకసారి కలిసి కూర్చుని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించుకోవాలి. వీటిని పరిష్కరించడంలో ముందగుడు వేయాలి. వివిధ దుకాణాల ద్వారా అమ్ముతున్న విత్తనాల నాణ్యత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో పరిశీలించాలి. కచ్చితంగా దాడులు జరగాలి. నకిలీ విత్తనాలను అడ్డుకోవడానికి గట్టి చర్యలు తీసుకోండి. రైతులను కాపాడే అవకాశాన్ని దేవుడు మీకు ఇచ్చారు. అలాగే, ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు పంపిణీ చేస్తున్నాం. వీటి నాణ్యతపై క్రమం తప్పకుండా దృష్టిపెట్టాలి. సబ్సిడీయే కాకుండా, సబ్సియేతర విత్తనాలు కొనుగోలు విషయంలోనూ రైతులు మోసపోకూడదు. సబ్సిడీయేతర విత్తనాలను కూడా ఆర్బీకేల ద్వారా అందుబాటులోకి తీసుకురండి. 38 కంపెనీలతో వ్యవసాయశాఖ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. 
వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ జిల్లాల అధికారులతో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ఇ–క్రాపింగ్‌పై పూర్తిగా ధ్యాస పెట్టండి
ఇ–క్రాపింగ్‌పై పూర్తిగా ధ్యాస పెట్టండి. ఇన్‌పుట్‌ సబ్సిడీ, బీమా, సేకరణ, పంట రుణాలకు సున్నావడ్డీ వంటి వాటన్నింటికీ ఇ–క్రాపింగ్‌ వన్‌స్టాప్‌ సొల్యూషన్‌ అవుతుంది. రైతుభరోసా యూనిఫైడ్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ (ఆర్బీయూడీపీ) యాప్‌ను కూడా తీసుకొస్తున్నాం. రైతు దగ్గర నుంచి ఆర్బీకేల వద్ద బయోమెట్రిక్‌ ఇ–కేవైసీని తీసుకోవాలి. ఇ–క్రాపింగ్‌కు సంబంధించి రశీదు కూడా ఇవ్వాలి. సరైన రశీదులు ఇవ్వకపోతే రైతులకు నష్టం జరుగుతుంది. ఈ సమస్యలను తీర్చడానికే చేతికి రశీదులివ్వాలి. దీనిపై రైతు సంతకం, విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ సంతకం ఉంటుంది. ఏదైనా జరిగినప్పుడు ఈ రశీదు ద్వారా క్లెయిమ్‌ చేసుకోవడానికి రైతు వద్ద అది ఒక ఆయుధంలా ఉంటుంది. 

జియో ఫెన్సింగ్‌
దీంతోపాటు మరో మార్పునూ తీసుకొస్తున్నాం. ప్రతి పంటనూ జియో ఫెన్సింగ్‌ చేస్తున్నాం. రైతులెవరికీ అన్యాయం జరగకుండా, నష్టం జరగకుండా ఇది తోడ్పడుతుంది. వీటికి అత్యంత ప్రాధాన్యత కల్పించాలి. ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నాయా? లేదా? అన్నదానిపై దృష్టిపెట్టాలి. సీజన్‌లతో సరిపెట్టకుండా.. రైతు ఏ సమయంలో పంట వేసినా దాన్ని ఇ–క్రాప్‌ చేయాలి. దీనివల్ల రైతులకు మేలు జరుగుతుంది. గ్రామ సచివాలయాల్లో ఉన్న క్షేత్రస్థాయి సిబ్బందికి పూర్తిగా మార్గనిర్దేశం చేయండి. రైతు సాగుచేసిన భూమికి ఎలాంటి పత్రాలు లేకపోయినా.. ఇవ్వకపోయినా సరే ఇ–క్రాప్‌ చేయాలి. రైతు పంట వేస్తే చాలు.. దాన్ని ఇ–క్రాపింగ్‌ చేయండి. కనీసం 10 శాతం ఇ–క్రాప్‌ బుకింగ్స్‌ను కలెక్టర్‌ పర్యవేక్షించాలి. వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు 20 శాతం ఇ–క్రాప్‌ బుకింగ్స్‌ తనిఖీ చేయాలి. మండల స్థాయిలో ఉన్న వ్యవసాయ అధికారులు 30 శాతం ఇ–క్రాపింగ్‌ను పర్యవేక్షించాలి. రైతుకు శ్రీరామ రక్షగా ఇ–క్రాపింగ్‌ నిలుస్తుంది. 

విధిగా వ్యవసాయ సలహా మండలి సమావేశాలు
అలాగే, వ్యవసాయ సలహా మండలి సమావేశాలు తప్పనిసరిగా జరగాలి. ఖరీఫ్‌ సన్నద్ధత, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, క్రాప్‌ ప్లానింగ్‌ తదితర అంశాలపై కచ్చితంగా ఈ సమావేశాలు జరగాలి. ఏ రకాలు పండించాలి? ఏవి పండించకూడదన్నది నిర్ణయించాలి. మెట్ట ప్రాంతాల్లో బోర్ల కింద వరిసాగు చేపట్టకుండా చూడాలి. దీనిపై రైతులకు అవగాహన కల్పించి ప్రత్యామ్నాయ పంటల సాగువైపు ప్రోత్సహించాలి. ప్రతినెలా మొదటి శుక్రవారం ఆర్బీకే స్థాయిల్లో, రెండో శుక్రవారం మండల, మూడో శుక్రవారం జిల్లా స్థాయ్లిలో ఈ సమావేశాలు కచ్చితంగా జరగాలి. అంతేకాక.. 
– కౌలు రైతులకూ రుణాలు అందేలా చూడాలి. ఆర్బీకేల్లో బ్యాంకుల ప్రతినిధులు ఉండేలా చూసుకోండి. రాష్ట్రస్థాయిలో ఇప్పటికే బ్యాంకర్లతో మాట్లాడాం.
– ఉపాధి హామీ పనుల విషయంలో కలెక్టర్లు అద్భుతంగా పనిచేశారు, అభినందనలు. జూన్‌ నెలాఖరు నాటికి 16 కోట్ల పనిదినాలను లక్ష్యంగా పెట్టుకుంటే 17 కోట్ల 18 లక్షలకు పైగా పనిదినాలు చేశారు. దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో ఒకవైపు కోవిడ్‌తో పోరాడుతూనే మరోవైపు పేదవాడి ఉపాధికి లోటు రాకుండా చూడగలిగారు.
– జగనన్న పచ్చతోరణం కింద ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 75వేల ఎకరాల్లో ప్లాంటేషన్‌ చేయాలన్నది లక్ష్యం. దీనిలో నాడు–నేడు కింద స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను కవర్‌ చేయాలి. మొక్కలు నాటే కార్యక్రమం ఆగస్టు 15 నాటికి పూర్తికావాలి.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top