మూగబోయిన ‘దీపక్‌’ రాగం

Cine Lyricist Adrushta Deepak Passed Away - Sakshi

కవి, రచయిత అదృష్ట దీపక్‌ మృతి

కరోనాకు చికిత్స పొందుతూ కాకినాడలో అస్తమయం

విషాదంలో మునిగిన సాహిత్య లోకం

అంతు తెలియని వేదనలతో అలమటించే ఆర్తజనులకు కొత్త ఊపిరి అందజేసిన ఆ స్నేహశీలిని.. పనికిరారని పారవేసిన మోడువారిన జీవితాలకు చిగురుటాశల దారి చూపిన ఆ మార్గదర్శిని.. కారుమబ్బులు ఆవరించిన కటిక చీకటి జీవితాల్లో వెలుగులు ప్రసరింపజేసిన ఆ కాంతిమూర్తిని.. కరోనా రాహువు కబళించింది. ఔను.. తన అక్షర శరాలతో సమాజ అవకరాలను చీల్చి చెండాడిన కవి, బహుముఖ ప్రజ్ఞాశాలి అదృష్ట దీపక్‌.. కోవిడ్‌తో మృతి చెందారన్న వార్త సాహితీలోకానికి అశనిపాతమే అయింది. మానవత్వం పరిమళించిన మంచి మనసు కలిగి.. బతుకు అర్థం తెలియజేసిన ఆ మంచి మనిíÙ.. భువిని వీడి దివికేగిపోవడంతో గోదావరి గడ్డ విషాదంలో మునిగిపోయింది.

రామచంద్రపురం: ‘‘ఎర్రజెండాయే నా అజెండా’’ అంటూ అసమ సమాజం మీద అక్షర యుద్ధం ప్రకటించిన రాజీలేని కలం యోధుడు అదృష్ట దీపక్‌ (72). విద్యార్థి సమాఖ్య, యువజన సమాఖ్య, అభ్యుదయ రచయితల సంఘం, ప్రజానాట్య మండలి సంస్థల్లో క్రియాశీలక బాధ్యతలు నిర్వహించారు. భాషావేత్తగా, నిబద్ధ కవిగా, కథకుడిగా, బుర్రకథా రచయితగా, వ్యాసకర్తగా, కాలమిస్టుగా, విమర్శకుడిగా, ఉపన్యాసకుడిగా, నటుడిగా, గాయకుడిగా, సినీ గేయ రచయితగా అన్ని రంగాల్లోనూ బలమైన ముద్ర వేసిన ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి ఇక లేరు. నాలుగు రోజుల క్రితం కరోనా బారిన పడిన అదృష్ట దీపక్‌ కాకినాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఆయన కన్నుమూశారు.

బాల్యం నుంచే.. 
రావులపాలెంలో 1950 జనవరి 18న జన్మించిన ఆయనకు మేనమామ అదృష్ట దీపక్‌ అనే పేరు పెట్టారు. కాశీ మజిలీ కథలు రెండో భాగంలో అదృష్టదీప చక్రవర్తి కథ ఉంది. వైవిధ్యంగా ఉంటుందని ఆ పేరు పెట్టారు. ఐదో తరగతి చదివేటప్పుడు మంచి మార్కులు సాధిస్తున్న దీపక్‌కు.. వేంకట పార్వతీశ్వర కవులు రచించిన ‘పిల్లల బొమ్మల భారతం’ పుస్తకం బహుమతిగా ఇచ్చారు. దీంతోపాటు ఆ రోజుల్లో చందమామ పత్రిక ఆయనను బాగా ఆకర్షించి, పఠనాసక్తి పెంచడానికి దోహదపడింది. దీపక్‌ మేనమామకు నాజర్‌ వంటి ప్రజాకళాకారులతో మంచి సంబంధాలుండేవి. తద్వారా వాళ్లందరితో సన్నిహితంగా తిరిగే అవకాశం చిన్నతనంలోనే దీపక్‌కు లభించింది. వ్యవసాయదారుడైన తండ్రి బంగారయ్య ఆలపించే రామదాసు కీర్తనలు, జానపద గీతాలు ప్రభావం చూపేవి. వీటితో పాటు దీపక్‌ తల్లి సూరాయమ్మ వీధి అరుగు మీద ఇరుగుపొరుగు స్త్రీలను కూర్చోబెట్టుకుని స్త్రీల పాటలు, గేయ కథలు పాడి వినిపించేది. ఈ నేప«థ్యమే దీపక్‌ను కవిగా, కళాకారుడిగా తయారు చేసింది. 

ఏడేళ్ల వయస్సులోనే.. 
కమ్యూనిస్టు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అదృష్ట దీపక్‌ ఏడేళ్ల వయస్సులోనే గాయకుడిగా, తొమ్మిదేళ్లకే నటుడిగా, పన్నెండేళ్లకే రచయితగా కళా జీవితాన్ని ప్రా రంభించారు. అనేక పత్రికలు, సంస్థలు నిర్వహించిన పోటీల్లో ఉత్తమ కవిగా, కథా రచయితగా బహుమతు లు పొందారు. నాటక పరిషత్తుల్లో ఉత్తమ నటుడిగా అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రసిద్ధ సంకలనా ల్లో దీపక్‌ రచనలు చోటు చేసుకున్నాయి. బెర్ర్‌టోల్ట్‌ బ్రెహ్ట్, ప్లేటో నెరుడాల కవితలను తెలుగులోకి అనువదించారు. దీపక్‌ రాసిన కొన్ని కవితలను ప్రముఖ కవి నిర్మలానంద వాత్సాయన్‌ హిందీలోకి అనువదించారు.

పత్రికల్లో శీర్షికల నిర్వహణ 
ఇరవయ్యెనిమిదేళ్ల పాటు కళాశాలలో చరిత్ర అధ్యాపనం చేసి రిటైరైన దీపక్‌.. విద్యార్థి దశలోనే జోకర్‌ మాసపత్రికలో ‘కాలింగ్‌ బెల్‌’ శీర్షిక నిర్వహించారు. తరువాతి కాలంలో ఉదయం దినపత్రికలో ‘పద సంపద’, చినుకు మాసపత్రికలో ‘దీపక రాగం’ శీర్షికల ద్వారా పాఠకులకు బాగా దగ్గరయ్యారు. ప్రస్తుతం ‘సాక్షి’ దినపత్రిక ఆదివారం అనుబంధం ఫన్‌డేలో ప్రారంభ సంచిక నుంచి ‘పదశోధన’ శీర్షిక నిర్వహిస్తున్నారు. అనేక ప్రతిష్టాత్మక సాహితీ పురస్కారాల ఎంపికలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రముఖ నాటక పరిషత్తులకు న్యాయనిర్ణేతగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

1980లో మాదాల రంగారావు తీసిన ‘యువతరం కదిలింది’ చిత్రంలో ‘ఆశయాల పందిరిలో’ గీత రచనతో సినీ రంగప్రవేశం చేసి, 40కి పైగా ప్రగతిశీలకమైన పాటలు రాశారు. కొంత కాలం కిందట ‘సాక్షి’ దినపత్రిక, నలుగురు ప్రముఖులతో నియమించిన కమిటీ.. అప్పటి వరకూ వెలువడిన 34 వేల తెలుగు సినిమా పాటల్లో 100 ఉత్తమ గీతాలను ఎంపిక చేసింది. ‘నేటి భారతం’ సినిమాకు అదృష్ట దీపక్‌ రాసిన ‘మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం’ అనే పాట ఆ వంద గీతాల్లో ఒకటిగా ఎంపికైంది. ఇటీవలే గుంటూరు మహిళా కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పని చేస్తున్న జి.స్వర్ణలత రూపొందించిన ‘అదృష్ట దీపక్‌ సాహిత్యం – అనుశీలన’ అనే సిద్ధాంత గ్రంథానికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ ప్రదానం చేసింది.

మంచి స్నేహశీలి 
‘ఆగండి నేను పోజు పెట్టొద్దా.. అప్పుడే ఫొటో తీసేస్తున్నారు..’ అంటూ నాటకోత్సవాలు, సాహితీ సభల్లో పాత్రికేయులతో ఎంతో స్నేహశీలిగా ఉంటూ జోకులతో నవ్వించేవారు. ఎప్పుడూ నవ్వుతూ.. ఎంతో స్నేహశీలిగా అదృష్ట దీపక్‌ అందరి మనసులలో నాటుకుపోయారు. యువ సాహితీవేత్తలను ఆయన ఎంతో ప్రోత్సహించేవారు. ఆయన ఆకస్మిక మృతిని సాహితీవేత్తలు, ఆయనతో సన్నిహితంగా ఉండేవారు జీరి్ణంచుకోలేకపోతున్నారు.

దీపక్‌కు అత్యంత సన్నిహితుడైన ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ యనమదల మురళీకృష్ణ, అదృష్టదీపక్‌ శాశ్వత న్యాయనిర్ణేతగా వ్యవహరించిన మయూర కళాపరిషత్‌ అధ్యక్ష, కార్యదర్శులు సత్తి వెంకటరెడ్డి, శృంగారం అప్పలాచార్యర్, గోదావరి కవి ర్యాలి శ్రీనివాస్, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తోట త్రిమూర్తులు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వట్టికూటి సూర్యచంద్ర రాజశేఖర్, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి కొవ్వూరి త్రినాథ్‌రెడ్డి, పార్టీ నాయకులు తొగరు మూర్తి తదితరులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.

ఇంతింతై...
పేరు : అదృష్టదీపక్‌ 
పుట్టిన రోజు : 18–1–1950 
పుట్టిన ఊరు : తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం 
తల్లిదండ్రులు : సూరాయమ్మ, బంగారయ్య 
భార్య : స్వరాజ్యం 
కుమారుడు : చక్రవర్తి 
కుమార్తె : కిరణ్మయి 
అదృష్ట దీపక్‌ విద్యాభాస్యం : 8వ తరగతి వరకూ రావులపాలెం. ఎంఏ వరకూ రామచంద్రపురం. 
వృత్తి : ద్రాక్షారామ పీవీఆర్‌ జూనియర్‌ కళాశాలలో చరిత్రోపన్యాసకునిగా 1979 నుంచి 2008 వరకూ పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. 
ప్రవృత్తి : సాహిత్యం, నాటక రంగాలు, కవి, సినీ గేయ రచయిత, నాటకాలకు న్యాయనిర్ణేత, విమర్శకుడు. 
రచనలు : కోకిలమ్మ పదాలు పదశతకం (1972–2014), అగ్ని కవిత్వం (1974), ప్రాణం కవిత్వం (1978), సమరశంఖం బుర్రకథ (1981), అడవి కవిత్వం (2008), దీపకరాగం వ్యాసాలు (2008), ఆశయాల పందిరిలో సినిమా పాటల సంకలనం (2010), శ్రీశ్రీ ఒక తీరని దాహం – మహాకవి సంస్మరణ (2010), అదృష్ట దీపక్‌ క«థలు (2016), దీపం, తెరచిన పుస్తకం (2020)

పురస్కారాలు 
1984 : నేటిభారతం చిత్రంలో ‘మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం’ గీతానికి ఉత్తమ గేయ రచయితగా మద్రాసులో అప్పటి రాష్ట్రపతి డాక్టర్‌ శంకర్‌దయాళ్‌శర్మ చేతుల మీదుగా కళాసాగర్‌ అవార్డు. 
2003 : అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా రాష్ట ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు. 
2003 : విశాలాంధ్ర స్వర్ణోత్సవ వేడుకల్లో కవి సత్కారం. 
2004 : మోడరన్‌ ఫౌండేషన్‌ కళానిధి అవార్డు, సాహితీ పురస్కారం. 
2004 : సినీ నటుడు తనికెళ్ల భరణి సార«థ్యంలో రావులపాలెంలో పౌర సన్మానం. ఉగాది పురస్కారం. 
2006 : తూర్పు గోదావరి జిల్లా అధికార భాషా సమీక్ష సంఘ సభ్యునిగా నియామకం. 
2008 : రాష్ట్ర ప్రభుత్వం రాజమండ్రిలో నిర్వహించిన నంది నాటకోత్సవాల్లో అభినందన సత్కారం. 
2009 : అరసం విశాఖ శాఖ ఆధ్వర్యంలో పురిపండా సాహితీ పురస్కారం. 
2010 : విజయవాడలో జరిగిన మహాకవి శ్రీశ్రీ శతజయంతి ఉత్సవాల్లో శ్రీశ్రీ సాహితీ పురస్కారం. 
2010 : హైదరాబాద్‌ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యాన సృజనాత్మక సాహిత్యంలో కీర్తి పురస్కారం. 
2010 : విశాఖపట్నం కళాభారతి ఆడిటోరియంలో జాలాది సాహితీ పురస్కారం. 
2012 : తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో నాటి ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ జార్జివిక్టర్‌ చేతుల మీదుగా శ్రీనాథ రత్న శిల్పి ఉడయార్‌ కళాపురస్కారం. 
2013 : కాకినాడ సూర్యకళా మందిరంలో నాటి రాష్ట్ర మంత్రి తోట నరసింహం చేతుల మీదుగా తెలుగు నాటకరంగ దినోత్సవ పురస్కారం. 
2017 : నంది నాటకోత్సవాల్లో న్యాయనిర్ణేతగా రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారం.
ఇవే కాకుండా 50కి పైగా వివిధ నాటక కళాపరిషత్తులలోనూ, సాహితీ సభల్లోనూ, విద్యాలయాల్లోనూ, ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు.   

చదవండి: కానిస్టేబుల్‌ ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే దుద్దుకుంట 
ప్రాణ వాయువుకు ఫుల్‌‘పవర్‌’

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top