జైహింద్‌ స్పెషల్‌: సైసైరా చిన్నపరెడ్డీ.. నీ పేరు బంగరు కడ్డీ

Azadi Ka Amrit Mahotsav: Saira Chinnapa Reddy Profile - Sakshi

‘సైసైరా చిన్నపరెడ్డీ.. నీ పేరు బంగరు కడ్డీ..’ స్వరాజ్య ఉద్యమకారుల నాల్కలపై నడయాడిన గేయమిది. రెడ్డిరాజుల పరాక్రమాన్ని పుణికిపుచ్చుకున్న గాదె చిన్నపరెడ్డి శౌర్యపరాక్రమాలకు ఈ గేయం దర్పణం. జాతీయోద్యమాన్ని మలుపు తిప్పిన కోటప్పకొండ దొమ్మీ చిన్నపరెడ్డి సాహసానికి నినాదం. స్వాతంత్య్ర ఉద్యమానికి ఇంతగా ఊపిరిలూదిన ఆ.. చిన్నపరెడ్డి ఉరికొయ్యన సైతం ఉయ్యాలలూగిన ధీరుడు, యోధుడు.
చదవండి: జైహింద్‌ స్పెషల్‌: 47కు 32 ఏళ్ల ముందే భారత్‌కు స్వాతంత్య్రం!

గుంటూరుజిల్లా తెనాలి డివిజనులోని మండల కేంద్రం చేబ్రోలు శివారు.. కొత్తరెడ్డిపాలెం చిన్నపరెడ్డి స్వస్థలం. గాదె సుబ్బారెడ్డి, లింగమ్మ దంపతులకు ఆరుగురు మగ సంతానం. వీరిలో చివరివాడు చిన్నపరెడ్డి. 1864లో జన్మించాడు. నీలిమందు పంట సాగు వీరి ప్రధాన వ్యాపకం. నీలిమందును గుర్రాలపై మద్రాసు తీసుకెళ్లి విక్రయించేవారు. ఇంట్లోనే గుర్రాలు ఉండటంతో చిన్నతనం నుంచి చిన్నపరెడ్డికి స్వారీ అలవాటు. నీలిమందు పంట అమ్మేందుకు తాను కూడా నాటి మద్రాసు రాష్ట్రంలోని కూవం నది ఒడ్డున తెలుగువారి మార్కెట్‌కు వెళుతుండేవాడు.

రెడ్డిపాలెం రాబిన్‌హుడ్‌ 
అప్పట్లో బ్రిటిష్‌ పాలకులు పన్నులు కఠినంగా వసూలుచేసేవారు. కరువు రోజుల్లో గ్రామంలో వీరితోపాటు ఉండే రైతుకూలీలు, బీదాబిక్కీ ఆకలి బాధలు పడుతుండేవారు. వీరికోసం ధాన్యం కొల్లగొట్టేందుకు చిన్నపరెడ్డి జంకేవాడు కాదు. సమీప గ్రామాల్లోని రైతులను కలసి, తాను అడిగిన ధరకు ధాన్యం ఇవ్వమని కోరేవాడు. అందుకు నిరాకరిస్తే రాత్రికి రాత్రే పొల్లాల్లోని ధాన్యం కుప్పలను నూర్చుకు వచ్చేవాడు. ఆజానుబాహుడైన చిన్నపరెడ్డి, గుబురుమీసాలతో తలపాగా చుట్టుకుని గుర్రంపై స్వారీచేస్తూ రోడ్డుపై వెళుతుంటే చిన్నాపెద్దా కన్నార్పకుండా చూసేవారు.

చేబ్రోలులో మకాంవేసిన జమీందారి సైన్యానికి ఇదే కంటగింపయింది. చేబ్రోలు రోడ్డులో గుర్రంపై వెళుతున్న చిన్నపరెడ్డిని వారు అడ్డుకున్నారు. రాజవీధుల్లో ఇతరులు స్వారీ చేయరాదని, తలపాగా చుట్టరాదని ఆంక్ష విధించారు. దీన్ని సహించలేకున్నా, అప్పట్లో ఏమీ చేయలేక వెనుదిరిగి వచ్చాడు చిన్నపరెడ్డి. మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో చిన్నపరెడ్డి ఊరు ఊరంతా వెంటరాగా గుర్రంపై స్వారీ వెళ్లాడు. పెద్ద రగడ అవుతుందేమోనని భావించిన చేబ్రోలులోని పెద్దలు రాజీ ప్రతిపాదన చేశారు. గొడవ సద్దుమణిగినా అతడిలో ఆత్మాభిమానజ్వాల రగులుతూనే ఉంది. ఈ గొడవ పరోక్షంగా మరో యుద్ధానికి తెరతీసింది.

జాతీయ నేతల స్ఫూర్తి
1907లో నీలిమందు పంట విక్రయానికి మద్రాసు వెళ్లినపుడు అక్కడ కూవం నది ఒడ్డున జరుగుతున్న బహిరంగసభలో ప్రకాశం పంతులు, బాలగంగాధర తిలక్‌ ప్రసంగాలను విన్నాడు చిన్నపరెడ్డి. వారి నోటివెంట వెలువడ్డ ‘వందేమాతరం’ నినాదానికి  చిన్నపరెడ్డికి రోమాలు నిక్కబొడిచాయి. తిరిగొచ్చాక ‘వందేమాతరం.. మనదే రాజ్యం, బ్రిటిష్‌వారిని పారద్రోలండి’ అనే నినాదంతో జనాన్ని ఉత్సాహపరిచే ఒక దండును తయారుచేశాడు. 1907లో చిన్నపరెడ్డి గురించి తెలుసుకున్న అప్పటి బ్రిటిష్‌ కలెక్టర్‌ అతడిని పిలిపించుకుని ఉద్యమాన్ని విరమించాలని కోరాడు. రాజీమార్గంలోకి తెచ్చేందుకు ఎంతో ఒత్తిడి చేసినా చిన్నపరెడ్డి అంగీకరించలేదు. 

భారీ ప్రభతో తిరునాళ్లకు
మహాశివరాత్రికి కోటప్పకొండ తిరునాళ్లకు 60 అడుగుల ప్రభను సిద్ధంచేసి తీసుకెళ్లటం శివభక్తుడైన చిన్నపరెడ్డికి ఆనవాయితీ. నందీశ్వరుడికి ప్రతిరూపంగా శివలింగాల దివ్యతేజస్సుతో ఆరు రాతిచక్రాల ప్రభను అలంకరించేవారు. ప్రభతో అరవైమంది ఆహారధాన్యాలు, వంటకాలతో నడిచివెళ్లేవారు. కోటప్పకొండ ప్రాంతం అప్పట్లో రెడ్డిరాజుల పాలనలో ఉండేది. దీనితో రెడ్డిపాలెం నుంచి వెళ్లిన  చిన్నపరెడ్డి ప్రభకు ముందువరుసలో స్థానం కల్పించేవారు. నరసరావుపేట సమీపంలోని రావిపాడుకు చెందిన మోతుబరి మహిళ తాలూకు ప్రభకు రెండోస్థానం ఇచ్చేవారు. గుర్రంతో సహా ఏటా కోటప్పకొండకు వెళ్లటం చిన్నపరెడ్డికి అలవాటు. ఏనుగులబాట నుంచి గుర్రంపైనే కొండపైకి నేరుగా వెళ్లేవాడు. స్వామివారికి పూజలు జరిపించి వచ్చేవాడు. 
– బి.ఎల్‌.నారాయణ, సాక్షి, తెనాలి  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top