ఇక ఆటోమేటెడ్‌ డ్రైవింగ్‌ ట్రాక్‌లు | Sakshi
Sakshi News home page

ఇక ఆటోమేటెడ్‌ డ్రైవింగ్‌ ట్రాక్‌లు

Published Tue, Jul 12 2022 1:18 PM

Andhra Pradesh: 9 Automated Driving Tracks - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డ్రైవింగ్‌ లైసెన్సుల జారీ విధానంలో సమూల మార్పులకు రవాణా శాఖ సన్నద్ధమవుతోంది. లైసెన్సుల జారీకి ప్రస్తుతం ఉన్న విధానం స్థానంలో కొత్తగా ఆటోమేటెడ్‌ వ్యవస్థను నెలకొల్పనుంది. కేంద్ర ఉపరితల రవాణా శాఖ, రాష్ట్ర రవాణా శాఖ సంయుక్తంగా రాష్ట్రంలోని 9 ఆటోమేటెడ్‌ డ్రైవింగ్‌ ట్రాక్‌లను నెలకొల్పాలని నిర్ణయించాయి. తద్వారా పూర్తిస్థాయిలో డ్రైవింగ్‌ నైపుణ్య పరీక్షలు నిర్వహించిన అనంతరమే లైసెన్సులు జారీ చేయనున్నారు. దాంతో లైసెన్సుల జారీలో సమగ్రత, కాలయాపన లేకుండా ఉంటుంది. మొదటి దశలో రాష్ట్రంలో చిత్తూరు, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళంలో ఈ ఆటోమేటెడ్‌ డ్రైవింగ్‌ ట్రాక్‌లను నెలకొల్పాలని నిర్ణయించారు. ఇప్పటికే చిత్తూరులోని డ్రైవింగ్‌ ట్రాక్‌ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. మిగిలిన 8 కేంద్రాల్లోనూ త్వరలోనే
ట్రాక్‌ల నిర్మాణ పనులు చేపట్టనున్నారు.  

సమగ్ర పరీక్షల అనంతరమే..  
ప్రస్తుతం లైసెన్సుల జారీకి నాలుగంచెల్లో డ్రైవింగ్‌ నైపుణ్యాన్ని పరీక్షిస్తున్నారు. మోటారు వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు పర్యవేక్షించి లెర్నింగ్‌ లైసెన్స్‌ (ఎల్‌ఎల్‌ఆర్‌), పర్మనెంట్‌ లైసెన్స్‌ జారీ చేస్తున్నారు. కాగా ఈ విధానం లోపభూయిష్టంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. తూతూ మంత్రంగా నైపుణ్య పరీక్షలు నిర్వహించి లైసెన్సులు జారీ చేసేస్తున్నారన్న విమర్శలున్నాయి. మరోవైపు లైసెన్సుల జారీలో తీవ్ర కాలయాపన జరుగుతోంది. రోజుకు సగటున 10 వేల వరకు దరఖాస్తులు వస్తున్నాయి. దాంతో పరీక్షల నిర్వహణ, లైసెన్సుల జారీకి ఎక్కువ సమయం పడుతోంది. దీనికి పరిష్కార మార్గంగా డ్రైవింగ్‌ లైసెన్సుల జారీకి ఆటోమేటెడ్‌ వ్యవస్థను నెలకొల్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి.

24 రకాల నైపుణ్య పరీక్షలు..
ఆటోమేటెడ్‌ డ్రైవింగ్‌ ట్రాక్‌ల డిజైన్‌ను జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) రూపొందించింది. దాంతో ఆధునిక రీతిలో డ్రైవింగ్‌ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తారు. 24 కేటగిరీలుగా డ్రైవింగ్‌ నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. వాహనాన్ని ముందుకు నడిపించడంలో 8 రకాలుగా పరీక్షిస్తారు. ఇక రివర్స్, ఎస్‌ టైప్‌ రివర్స్, ట్రాఫిక్‌ జంక్షన్లు, ఓవర్‌ టేక్‌ చేయడం, క్రాసింగ్, పార్కింగ్‌ ఇలా వివిధ రీతుల్లో డ్రైవింగ్‌ నైపుణ్యాన్ని పరీక్షిస్తూ మొత్తం ప్రక్రియను వీడియో తీస్తారు. డ్రైవింగ్‌ ట్రాక్‌లలో సెన్సార్లు అమరుస్తారు. వాటిని కంప్యూటర్‌ గదికి అనుసంధానిస్తారు.

డ్రైవింగ్‌ నైపుణ్య పరీక్షల సమయంలో తప్పు చేస్తే వెంటనే బీప్‌ శబ్ధం వస్తుంది. ఆ ట్రాక్‌పై డ్రైవింగ్‌ పరీక్ష పూర్తయ్యేసరికి ఆ విధంగా ఎన్ని బీప్‌లు వచ్చాయో లెక్కించి పాయింట్లు వేస్తారు. అర్హత పాయింట్లు వస్తే ఆటోమెటిక్‌గా లైసెన్సు జారీ చేస్తారు. లేకపోతే  ఆటోమెటిక్‌గా లైసెన్సు తిరస్కరిస్తారు. ఆ తరువాత నిర్ణీత గడువు తరువాతే మళ్లీ పరీక్షకు హాజరుకావాలి. తమ డ్రైవింగ్‌ తీరును అభ్యర్థులు వీడియో ద్వారా చూసి లోటుపాట్లు తెలుసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. రాష్ట్రంలో 9 ఆటోమేటెడ్‌ డ్రైవింగ్‌ ట్రాక్‌ల ఏర్పాటును ఏడాదిలోగా పూర్తి చేయాలని రవాణా శాఖ భావిస్తోంది. సమాధానం ఇచ్చారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement