
నేడు నగరంలో తిరంగా యాత్ర
● ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కలెక్టర్ వినోద్‌కుమార్ పిలుపు
అనంతపురం అర్బన్: ‘ఆపరేషన్ సిందూర్’ విజయోత్సవాన్ని పురస్కరించుకుని త్రివిధ దళాల సైనికులకు సంఘీభావంగా శనివారం నగరంలో తిరంగా యాత్ర నిర్వహించనన్నట్లు కలెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. ఉదయం 8 గంటలకు స్థానిక ఆర్ట్స్ కళాశాల నుంచి తిరంగా యాత్ర ప్రారంభమై సప్తగిరి సర్కిల్ మీదుగా నగర పాలక సంస్థ ఎదురుగా ఉన్న జాతీయ జెండా స్తంభం వరకు సాగుతుందన్నారు. దేశరక్షణలో అహర్నిశలు నిమగ్నమైన సైనికులకు సంఘీభావం తెలపడంతో పాటు జాతీయ జెండా గౌరవాన్ని ఇనుమడింపజేసేలా, దేశ సమైక్యత, సౌభ్రాతృత్వం ప్రతిభింబించేలా నిర్వహిస్తున్న తిరంగా యాత్ర ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ట్రాఫిక్, భద్రత సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తాగునీరు, వైద్య బృందం అందుబాటులో ఉంటుందన్నారు.
నేడే సేవ్ ఆర్డీటీ బైక్ ర్యాలీ
● హాజరుకానున్న పార్టీ ముఖ్య నేతలు
కళ్యాణదుర్గం: ఆర్డీటీ సంస్థకు కేంద్రం ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యువల్ చేయాలనే డిమాండ్‌తో వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య తలపెట్టిన ‘సేవ్ ఆర్డీటీ’ బైక్ ర్యాలీ శనివారం ఉదయం 8 గంటలకు బ్రహ్మసముద్రంలో ప్రారంభం కానుంది. శుక్రవారం పార్టీ కార్యాలయంలో రంగయ్య ఆయా మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలతో బైక్ ర్యాలీపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బైక్ ర్యాలీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీలు వై.శివరామిరెడ్డి, మంగమ్మ, జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ, రాయదుర్గం, తాడిపత్రి సమన్వయకర్తలు మెట్టు గోవిందరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.శ్యామల హాజరవుతారన్నారు. ఆయా మండలాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఆర్డీటీ ద్వారా లబ్ధి పొందిన వారిని చైతన్య పరిచి కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలన్నారు. అలాగే వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ అనుబంధ సంఘాల రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
దళిత మహిళలపై దాడి చేసిన వారిపై కేసు
అనంతపురం/బ్రహ్మసముద్రం: తోటలో రాలిపడిన మామిడిపండ్లను తిన్న కుర్లగుండ గ్రామానికి ముగ్గురు దళిత మహిళలపై దాడి చేసి గాయపరిచిన తీటకల్లు గ్రామానికి చెందిన వారిపై ఎట్టకేలకు బ్రహ్మసముద్రం పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు బొబ్బురు రామాంజనేయులు, అనిల్‌చౌదరి, క్రిష్టప్పలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు బ్రహ్మసముద్రం ఏఎస్‌ఐ తిమ్మరాజు తెలిపారు. కాగా, ఈ దాడిలో చెవి కర్ణభేరి దెబ్బతినగా, అనంతపురం సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న మమత అనే మహిళను ఎస్సీ, ఎస్టీ జేఏసీ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి పరామర్శించారు. పోలీసుల కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఎమ్మెల్యే కూతురి పెళ్లి బందోబస్తులో ఉన్నామని వచ్చిన తర్వాత విచారిస్తామని దాటివేయడం సిగ్గుచేటన్నారు. దళిత మహిళలపై విచక్షణారహితంగా దాడి చేసిన అగ్రకులస్తులపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సాకే హరి వెంట జేఏసీ నాయకులు ఎస్. రామాంజినేయులు, రామకృష్ణ, నారాయణస్వామి, నరేంద్ర, నాగేష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
డీఎస్సీకి మహిళా
అభ్యర్థులే ఎక్కువ
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి విడుదల చేసిన డీఎస్సీ–2025కు ఉమ్మడి అనంతపురం జిల్లాలో మహిళా అభ్యర్థులే ఎక్కువమంది దరఖాస్తు చేసుకున్నారు. ఏప్రిల్ 20న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ గురువారం రాత్రితో ముగిసింది. అనంతపురం జిల్లాకు సంబంధించి మొత్తం 29,078 మంది అభ్యర్థుల్లో 17,070 మంది మహిళలే ఉన్నారు. 12,008 మంది పురుష అభ్యర్థులున్నారు. అర్హతను బట్టి కొందరు అభ్యర్థులు రెండు, మూడు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.