
అరెస్టులు అప్రజాస్వామికం: అనంత
అనంతపురం కార్పొరేషన్: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం దుశ్చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి నారా లొకేష్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సాక్షితో మాట్లాడారు. మాజీ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి కృష్ణమోహన్ అరెస్టులను ఖండించారు. వారిద్దరి అరెస్టులతో కూటమి సర్కార్ కక్ష సాధింపులు పరాకాష్టకు చేరాయన్నారు. సీఎం చంద్రబాబు సంక్షేమాన్ని పక్కన పెట్టి కక్ష సాధింపులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. లిక్కర్ కేసు విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు చూపకుండానే బెదిరింపులకు పాల్పడి... తప్పుడు వాంగ్మూలాలను తీసుకుని అరెస్టులకు పాల్పడుతున్నారన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మద్యం కల్తీ జరిగిందని ఆరోపిస్తున్నారని... మరి కూటమి ప్రభుత్వం కూడా అవే డిస్టలరీల నుంచి మద్యాన్ని కొనుగోలు చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్‌లను లక్ష్యంగా చేసుకుని కొందరిపై సస్పెన్షన్ వేటు వేశారన్నారు. ఇంత దారుణమైన పరిస్థితులను ఎక్కడా చూడలేదన్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలు అమలు చేయడం చేతకాని చంద్రబాబు.. ఏదో ఒక టాపిక్‌ను తెరపైకి తెచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. ఇది మంచి సంస్కృతికాదన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు వైఎస్సార్ సీపీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజాస్వామ్య పద్ధతిలో చంద్రబాబుకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.