
డబుల్ డెక్కర్ బస్ ట్రయల్ రన్
అల్లిపురం / కొమ్మాది : విశాఖ నగర ప్రజలు, యాత్రికులకు డబుల్ డెక్కర్ బస్సులు త్వరలో అందుబాటులోకి వస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ పేర్కొన్నారు. బుధవారం టూరిజం అభివృద్ధి కార్యక్రమాలపై విశాఖ జిల్లాకు విచ్చేసిన ఆయన సాగర్‌నగర్ బీచ్ వద్ద ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయం ప్రాంగణంలో డబుల్ డెక్కర్ బస్సులు, సంబంధిత చార్జింగ్ స్టేషన్‌ను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అజయ్ జైన్ మాట్లాడుతూ త్వరలో హాఫ్ ఆన్ – హాఫ్ ఆఫ్ పేరుతో డబల్ డెక్కర్ బస్సులు విశాఖ నగరంలో అందుబాటులోకి రానున్నాయన్నారు. అందుబాటులో ఉన్న రెండు డబుల్ డెక్కర్ బస్సులతో ట్రయల్ రన్ నిర్వహించారు. టూరిజం ద్వారా విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్, టూరిజం శాఖ సంయుక్తంగా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ సౌజన్యంతో వీటిని అందుబాటులోకి తీసుకురానుందని తెలిపారు. అనంతరం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ విశాఖ నగర ప్రజలు, పర్యాటకుల ఆహ్లాదకర ప్రయాణానికి డబుల్ డెక్కర్ బస్సులు అనువుగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారి మాధవి, జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మి, పర్యవేక్షక ఇంజినీర్ పీవీవీ సత్యనారాయణ రాజు, స్మార్ట్ సిటీ మేనేజర్ ఆనంద్ పాల్గొన్నారు.
నగరవాసులకు త్వరలో
అందుబాటులోకి తీసుకొస్తాం
పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
అజయ్ జైన్