
వైద్యం ప్రైవేటీకరణే కూటమి లక్ష్యం
● ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మ ● అసంపూర్తిగా ఉన్న మెడికల్ కళాశాల భవనాల పరిశీలన
మాకవరపాలెం: వైద్యాన్ని ప్రైవేటుపరం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ ఆరోపించారు. మండలంలోని భీమబోయినపాలెం వద్ద గత ప్రభుత్వం 52.15 ఎకరాల్లో రూ.500 కోట్లతో మెడికల్ కళాశాల మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కళాశాల భవనాల నిర్మాణాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో అసంపూర్తిగా ఉన్న మెడికల్ కళాశాల భవనాలను బుధవారం అజశర్మ పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు ఇక్కడ నిర్మించే వైద్య కళాశాల ద్వారా మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రస్తుతం వీరంతా విశాఖలోని కేజీహెచ్‌కు వ్యయ, ప్రయాసలకోర్చి వెళ్లాల్సి వస్తోందన్నారు. అందుకే గత ప్రభుత్వం వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను మంజూరు చేసిందన్నారు. ప్రస్తుతం వాటిని ప్రైవేటుపరం చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రతిపాదన చేసి నిర్మాణాలను అర్ధంతరంగా నిలిపివేశారని ఆయన విమర్శించారు. ఒక్క పాడేరు కళాశాల తప్ప, మిగిలిన కళాశాలల భవనాల నిర్మాణాలు ఆగిపోయాయన్నారు. మాకవరపాలెం మండలం భీమబోయినపాలెం వద్ద కళాశాల భవన నిర్మాణాలు ఆపివేసి, సామగ్రిని అమరావతికి తరలించారన్నారు. తక్షణం కళాశాల నిర్మాణాన్ని ప్రభుత్వమే చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే అన్నీ పూర్తి చేసుకున్న విజయనగరం కళాశాలను ప్రైవేటుపరం చేయాలన్న ఆలోచనను విరమించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు త్రిమూర్తులురెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు పాల్గొన్నారు.