
అనకాపల్లి తలసరి ఆదాయం రూ.2 లక్షలే
● జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర అసంతృప్తి
తుమ్మపాల: విశాఖ జిల్లా తలసరి ఆదాయం రూ.4 లక్షలు ఉంటే, అనకాపల్లి రూ.2 లక్షలకే పరిమితం కావడం బాధాకరమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో స్వర్ణాంధ్ర–2047లో భాగంగా జిల్లా దార్శనికత కార్యాచరణ ప్రణాళికపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికం లేని రాష్ట్రాన్ని సాకారం చేయడమే విజన్ 2047–పి4 కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. మండల స్థాయిలో విజన్ డాక్యుమెంట్స్ రూపొందించాలన్నారు. జిల్లాలో నియోజకవర్గాల వారీగా బంగారు కుటుంబాలను, మార్గదర్శులను గుర్తించాలన్నారు. సమావేశంలో ఎంపీ సీఎం రమేష్, కలెక్టర్ విజయ్‌కృష్ణన్, శాసన సభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి, విజయ్‌కుమార్, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డీఆర్వో వై సత్యనారాయణ, ఆర్డీవో షేక్ అయిషా, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.