
పసుపు గోదాం దగ్ధం
● నర్సీపట్నం మార్కెట్ యార్డులో ప్రమాదం ● రూ.కోటి ఆస్తి నష్టం
నర్సీపట్నం: పట్టణంలోని పెదబొడ్డేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం పసుపు గోదాం నుంచి మంట లు, దట్టమైన పొగలు రావటాన్ని యార్డులోని వారు గుర్తించారు. విషయం తెలుసుకున్న గొడౌన్ లీజుదారుడు, పసుపు వ్యాపారి పెదిరెడ్ల గోవింద్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన యార్డుకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఎంతకూ మంటలు అదుపులోకి రాకపోవడంతో రావికమతం నుంచి మరో ఫైర్ ఇంజన్ రప్పించారు. జిల్లా ఫైర్ అధికారి వెంకటరమణ, నర్సీపట్నం ఫైర్ ఆఫీసర్ అప్పలస్వామి పర్యవేక్షణలో ఫైర్ సిబ్బంది శ్రమంచి మధ్యాహ్నానికి మంటలను అదుపులోకి తెచ్చారు. విషయం తెలుసుకున్న మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, ఏడీఎం రవికుమార్, సెక్రటరీ భువనేశ్వరి యార్డుకు చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. గోదాంలో నిల్వ చేసిన 60 టన్ను ల పసుపు, పసుపు ప్రాసెసింగ్ యంత్రాలు, డ్రమ్మింగ్ మిషనరీ పూర్తిగా దగ్ధమయ్యాయి. వీటి విలువ దాదాపు కోటి రూపాయలు ఉంటుందని బాధితుడు గోవింద్ చెప్పారు. మార్కెట్ యార్డు గొడౌన్‌కు కూడా నష్టం వాటిల్లింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ఫైర్ అధికారులు భావిస్తున్నారు. వ్యాపారి నష్టపోవటమే కాకుండా పసుపు గ్రేడింగ్ పనులపై ఆధారపడ్డ 150 మంది మహిళలు, 25 మంది కళాసీలు ఉపాధి కోల్పోయారు. గోదాంలోని పసుపు పూర్తిగా దగ్ధమవడంతో వీరంతా రెండు నెలల పనిదినాలను కోల్పోయారు. గొడౌన్ దగ్ధమైన విషయాన్ని తెలుసుకున్న మహిళా కూలీలు పెద్ద ఎత్తున యార్డుకు చేరుకుని సహాయక చర్యల్లో పాలు పంచుకున్నారు.

పసుపు గోదాం దగ్ధం