
అల్లూరి కీర్తి..
భావితరాలకు స్ఫూర్తి
నర్సీపట్నం/గొలుగొండ: అగ్గి పిడుగు అల్లూరి సీతారామరాజు జయంతి శుక్రవారం జిల్లా అంతటా ఘనంగా జరిగింది. అల్లూరి విగ్రహాలు, చిత్రపటాల వద్ద పూలదండలతో నివాళులర్పించారు. స్ఫూర్తివంతమైన ఆ విప్లవ వీరుడి గాథను స్మరించుకున్నారు. గొలుగొండ మండలం కృష్ణదేవిపేట (ఏఎల్‌పురం) ప్రాంతంలోని విద్యా సంస్థల్లో చదువుతున్న చిన్నారులు, ప్రభుత్వ ఉద్యోగులు సుమారు రెండు కిలోమీటర్లు ర్యాలీ నిర్వహించి పార్కుకు చేరుకున్నారు. అక్కడి అల్లూరి సమాధికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, కందుల దుర్గేష్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా నివాళులర్పించారు. అల్లూరి కాంస్య విగ్రహానికి, అల్లూరి తల్లి నారాయణమ్మ విగ్రహానికి పూలమాలలు వేశారు. నర్సీపట్నంలోని పెదబొడ్డేపల్లిలో అల్లూరి కాంస్య విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. రూ.12 లక్షల వ్యయంతో తొమ్మిది అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని నర్సీపట్నం క్షత్రియ పరిషత్ సమకూర్చింది. విగ్రహం చుట్టూ ఉన్న ప్రాంతం సుందరీకరణకు మరో రూ.13 లక్షలు వ్యయం చేశారు. క్షత్రియ పరిషత్ అధ్యక్షుడు గణపతిరాజు సూర్య బంగార్రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, ఎంపీలు సీఎం రమేష్, కలిశెట్టి అప్పలనాయుడు హాజరయ్యారు. అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని అల్లూరి సీతారామరాజు సెంటర్‌గా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. విగ్రహం వెనుక భాగంలో 50 అడుగుల ఎత్తు గల జాతీయ జెండా, విగ్రహానికి ముందు భాగంలో వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్సీ డి.వి. సూర్యనారాయణరాజు, కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహిన్‌సిన్హా, ఆర్డీవో వి.వి.రమణ, మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర, క్షత్రియ పరిషత్ ఉపాధ్యక్షుడు రాజా సాగి సత్యనారాయణరాజు, కార్యదర్శి బుద్దరాజు చక్రపాణి రాజు, సంయుక్త కార్యదర్శి దాట్ల రవివర్మ, కోశాధికారి జంపన నాగేంద్ర రాజు తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి కీర్తి..