
విద్యా రంగం దీనావస్థపై నినదిద్దాం
● 7న ఎన్టీఆర్ యూనివర్సిటీ ముట్టడి ● వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హేమంత్‌కుమార్
అనకాపల్లి: విద్యా రంగంలో సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 7న విజయవాడలో ఎన్టీఆర్ యూనివర్సిటీని ముట్టడించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్టు వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బొడ్డపల్లి హేమంత్‌కుమార్ తెలిపారు. జిల్లా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక రింగ్‌రోడ్డు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. విదేశాల్లో మెడిసిన్ చదువుకున్న రాష్ట్ర విద్యార్థులకు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీలకతీతంగా విదేశీ విద్యా దీవెన అమలు చేశారని, ఇప్పుడు కూటమి పాలనలో ఈ పథకాన్ని ఎత్తివేయడం దారుణమన్నారు. విదేశాల్లో చదువుకుని వచ్చి ఎఫ్ ఎంజీ పరీక్షలో క్వాలిఫై అయిన వీరి సేవలను కూటమి ప్రభుత్వం ఏడాది పాటు ప్రభుత్వ ఆస్పత్రిలో వినియోగించుకుని, తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు వాపోయారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన మెడికల్ కళాశాలలను ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలన్నారు. కూటమి ప్రభుత్వం వీటిని ప్రభుత్వ – ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్వహిస్తామని చెప్పడం అన్యాయమన్నారు. మెడికల్ సీట్లు అమ్మకాలు చేసేందుకు ఇలా చేస్తున్నారని విమర్శించారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ప్రైవేట్ విద్యా సంస్థలకు తొత్తుగా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ కళాశాలలను అభివృద్ధి చేయాలని కోరారు. దేశంలో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంటే, రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన నడుస్తుందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో జిల్లా ఐటీ వింగ్ విభాగం అధ్యక్షుడు పల్లేలసాయి కిరణ్, విద్యార్థి విభాగం జిల్లా నాయకులు రాయి రాజా, కిల్లాడ శ్రీనివాసరావు, చదరం అప్పలనాయుడు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.