
విస్తారంగా వర్షాలు
గెడ్డలు, వాగుల్లో వరద ఉధృతి
సాక్షి,పాడేరు: జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానతో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంగళవారం వేకువజాము నుంచి రాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉంది. మరో వైపు ఈదురుగాలులు విజృంభిస్తున్నాయి. వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన గెడ్డలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మత్స్యగెడ్డ, రాళ్లగెడ్డ, దిగుడుపుట్టు, కురిడి గెడ్డల ప్రవాహం ప్రమాదకరంగా మారింది. గెడ్డ అవతల గ్రామాల గిరిజనులను రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తం చేసింది.
329.2 ఎంఎం వర్షపాతం నమోదు
జిల్లా వ్యాప్తంగా మంగళవారం 329.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముంచంగిపుట్టులో 62.8, కూనవరంలో 22.2, పెదబయలులో 20.6, మారేడుమిల్లిలో 19.2, జి.మాడుగులలో 19.2, వీఆర్‌పురంలో 16.4, అడ్డతీగలలో 16, గంగవరంలో 14.8, చింతూరులో 14.6, హుకుంపేటలో 14.6, పాడేరులో 13.2, ఎటపాకలో 12.8, వై.రామవరంలో 12.2, అరకులోయలో 11.8, అనంతగిరిలో 10.8, డుంబ్రిగుడలో 10.2, రాజవొమ్మంగిలో 9.6, రంపచోడవరంలో 9.4, దేవీపట్నంలో 7.8, చింతపల్లిలో 5.6, కొయ్యూరులో 3, జీకేవీధిలో 2.4 ఎంఎం వర్షపాతం నమోదైంది.