
నిత్యావసర సరకుల కోసం వాగు దాటాల్సిందే
● దొరగూడ గ్రామ గిరిజనుల అవస్థలు
ముంచంగిపుట్టు: వర్షాకాలం వచ్చిందంటే మారుమూల గ్రామాల గిరిజనుల అవస్థలు వర్ణనాతీతం. ఉధృతంగా ప్రవహించే వాగులు, గెడ్డలు దాటితేనే వారి జీవనం ముందుకు సాగేది. దొరగూడ గ్రామ గిరిజనుల పరిస్థితి ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఇంట్లో నిత్యావసర వస్తువులు లేకపోవడంతో వాటి కోసం శుక్రవారం ఆరు కిలోమీటర్లు కాలినడకన వెళ్లారు. అక్కడి నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న బిరిగూడ, ఉబ్బెంగుల వాగులు దాటుకుని లక్ష్మీపురం వచ్చారు. సరకులు కొనుక్కొన్న వారు తిరుగు ప్రయాణంలో అవే సమస్యలు ఎదుర్కొన్నారు. గ్రామానికి మంజూరైన రోడ్డు, కల్వర్టులు నిర్మిస్తే తమకు ఈ కష్టాలు తీరుతాయని గ్రామానికి చెందిన లక్ష్మణ్, డొబ్రు, గాసి, సుక్రి, లక్ష్మి తెలిపారు.
ఐదు కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్?
అడ్డతీగల: మండలంలోని పాపంపేట వద్ద శుక్రవారం ఐదు కిలోల గంజాయితో కాకినాడకు చెందిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా వీరు పట్టుబడినట్టు తెలిసింది. ఒడిశా నుంచి కాకినాడ ప్రాంతానికి ఈ గంజాయిని తరలిస్తూ పోలీసులకు చిక్కినట్టుగా చెబుతున్నారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం.