తూర్పు తీరంలో పగడపు దిబ్బలు | - | Sakshi
Sakshi News home page

తూర్పు తీరంలో పగడపు దిబ్బలు

Jul 5 2025 6:18 AM | Updated on Jul 5 2025 6:18 AM

తూర్ప

తూర్పు తీరంలో పగడపు దిబ్బలు

● అంతర్జాతీయంగా అధికారిక గుర్తింపు ● ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అర్కైవ్స్‌లో ప్రచురణ ● చింతపల్లిలో అత్యధిక పగడపు దిబ్బలున్నట్టు గుర్తింపు ● పూడిమడక వద్ద పగడపు దిబ్బలను తరలించేందుకు అవకాశం

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : విశాఖ తీరంలోని పూడిమడక, రిషికొండ, మంగమారిపేట, చింతపల్లి (విజయనగరం జిల్లా) వద్ద అరుదైన పగడపు దిబ్బలు ఉన్నాయని అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అర్కైవ్స్‌లో ప్రచురితమైన ‘డైవర్సిటీ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫ్‌ కోరల్‌ కమ్యూనిటీ ఫ్రం విశాఖపట్నం కోస్ట్‌, ఏపీ’ అనే ఆర్టికల్‌లో ఈ విషయం స్పష్టమైంది. జూలై 1న ప్రచురితమైన ఈ నివేదిక, ఆంధ్రప్రదేశ్‌ తూర్పు తీరం కూడా పగడపు దిబ్బలకు నెలవుగా ఉందని తేటతెల్లం చేసింది. తద్వారా ఇప్పటివరకు పగడపు దిబ్బలు ఉన్నాయని పేర్కొంటూ వచ్చిన నివేదికలకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించిందని జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) చేసిన సర్వేలో పాల్గొన్న లివిన్‌ అడ్వెంచర్స్‌ ఫౌండర్‌ బలరాం ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటివరకు పగడపు దిబ్బలు భారతదేశంలో లక్షద్వీప్‌, అండమాన్‌–నికోబార్‌, గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌, గల్ఫ్‌ ఆఫ్‌ కచ్‌లకే పరిమితమని భావించేవారు. ఇందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు తీరం కూడా పగడపు దిబ్బలకు నెలవుగా ఉందని అంతర్జాతీయ తేటతెల్లమయ్యింది.

2019 నుంచి 2023 వరకు...!

వాస్తవానికి పగడపు దిబ్బల ఉనికి కోసం డేటాను సేకరించేందుకు, పరిశోధన చేసేందుకు 2019 నుంచి 2023 వరకు విజయనగరం జిల్లాలోని చింతపల్లి నుంచి పూడిమడక వరకూ సర్వే చేశారు. మొత్తం 15 ప్రదేశాల్లో ఈ అధ్యయనం సాగింది. ఈ అధ్యయన నివేదికలు పలుమార్లు వెలువరించారు. అయితే అంతర్జాతీయ గుర్తింపు లభించడం ఇదే మొదటిసారి. తద్వారా ఆంధ్రా తీరం సముద్ర జీవ వైవిధ్యానికి నెలవుగా ఉందని అధికారికంగా గుర్తింపు లభించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చింతపల్లి నుంచి పూడిమడక వరకు 15 ప్రదేశాల్లో జరిపిన అధ్యయనం సందర్భంగా సాగరగర్భంలో 30 మీటర్ల లోతుల వరకు అన్వేషణ సాగించారు. స్థానిక స్కూబా డైవింగ్‌ సంస్థ లివిన్‌ అడ్వెంచర్స్‌తో కూడిన నలుగురు శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయనాన్ని చేపట్టింది. పొరిటిడే, అగారిసిడె, డెండ్రోఫిలిడే వంటి అరుదైన పగడపు దిబ్బలున్నట్టు గుర్తించారు. వాస్తవానికి చింతపల్లి వద్ద 12 రకాల పగడపు దిబ్బలు, రిషికొండ వద్ద 6, పూడిమడక వద్ద 5, మంగమారిపేట వద్ద 3 రకాల పగడపు దిబ్బలు ఉన్నట్టు గుర్తించారు. చింతపల్లి వద్ద ఎక్కువగా పగడపు దిబ్బలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, పూడిమడక వద్ద ఉన్న పగడపు దిబ్బల్లో కొంతభాగం తీసి మరో చోటికి తరలించి పెంచేందుకూ అవకాశం ఉందని తేలింది.

యాంటీ క్యాన్సర్‌ మందుల తయారికీ...!

సముద్ర గర్భంలో ఉండే ఈ పగడపు దిబ్బల వలన సముద్ర పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగకరంగా ఉందనే అభిప్రాయం ఉంది. పగడాల ద్వారా వచ్చే కాల్షియం కార్బోనేట్‌ వల్ల ఇవి ఏర్పడతాయి. వీటిలో కొన్ని పోషకాలు ఉంటాయి. ఈ పగడపు దిబ్బల ద్వారా సముద్రంలో ఉండే జీవరాశులు మరింతగా పెరిగేందుకు దోహదం చేస్తాయనేది శాస్త్రవేత్తల అభిప్రాయం. అంతేకాకుండా ఈ పగడపు దిబ్బలను యాంటీ బయోటిక్స్‌, యాంటీ క్యాన్సర్‌ వంటి మెడిసిన్‌ తయారీలోనూ ఉపయోగిస్తారని తెలుస్తోంది. అంతేకాకుండా సముద్రతీరం కోతకు గురికాకుండా సహజసిద్ధంగా ఇవి కాపాడతాయని కూడా అధ్యయనాల్లో తేలింది. మరోవైపు అలల తీవ్రతను కూడా తగ్గించేందుకు ఇవి దోహదం చేస్తాయి. ఈ నేపథ్యంలో వీటి పగడపు దిబ్బలను చూసేందుకు స్కూబా డైవింగ్‌, స్నోర్కింగ్‌ ద్వారా టూరిజం అభివృద్దికి కూడా దోహదం చేస్తాయి.

అంతర్జాతీయంగా తొలిసారి గుర్తింపు

మన సముద్ర తీరంలో పగడపు దిబ్బలు ఉన్నట్టు గతంలో మేం జీఎస్‌ఐతో కలిపి జరిపిన అధ్యయనంలో తేలింది. అయితే, ఈ అధ్యయనానికి తొలిసారిగా ఈ నెల 1వ తేదీన ప్రచురణ ద్వారా అంతర్జాతీయ గుర్తింపు లభించింది. పగడపు దిబ్బల ద్వారా మత్స్యసంపదకు ఎంతో ఉపయోగం. కాలుష్యం బారిన పడకుండా వీటిని కాపాడుకోవాల్సిన అవసరం మాత్రం ఎంతో ఉంది.

బలరాం, లివిన్‌ అడ్వెంచర్స్‌, ఫౌండర్‌

తూర్పు తీరంలో పగడపు దిబ్బలు1
1/1

తూర్పు తీరంలో పగడపు దిబ్బలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement