
విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగదు
● బాధ్యతగా పనిచేయకుంటే చర్యలు ● కలెక్టర్ దినేష్‌కుమార్ హెచ్చరిక
సాక్షి,పాడేరు: గిరిజన విద్యార్థుల ఆరోగ్యం, వైద్యసేవల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సంభందిత అధికారులు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ హెచ్చరించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో గిరిజన సంక్షేమ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల మృతికి ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కాకూడదన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు, మందులు అందుబాటులో ఉన్నప్పటికీ విద్యార్థుల మరణాలు సంభవించడం బాధాకరమన్నారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఆశ్రమ పాఠశాలల్లో స్కూల్ హెల్త్ కార్యక్రమాన్ని పక్కాగా అమలుజేయాలన్నారు. విద్యార్థుల హెల్త్ రికార్డులపై ఉపాధ్యాయులు,వైద్యాధికారులకు అవగాహన ఉండడం లేదంటూ ఆసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని ఆశ్రమ పాఠశాలల్లో వైద్యశిబిరాలు నిర్వహించేందుకు సూక్ష్మ ప్రణాళికలు రుపొందించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరీక్షల నివేదికలను ప్రతి నెలా పంపాలన్నారు. క్లాస్ టీచర్, వైద్యాధికారి, సూపర్‌వైజర్లు ఆర్‌బీఎస్‌కే పుస్తకంలో సంతకం చేయని పక్షంలో షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మానటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు. గోమంగి మినీ గురుగులంతో పాటు ఇతర పాఠశాలల్లో సికిల్‌సెల్ ఎనీమియా పరీక్షలపై కలెక్టర్ ఆరా తీశారు. అన్ని పాఠశాలల్లో సిక్ రూమ్‌లు ఏర్పాటుతో పాటు సికిల్‌సెల్ ఎనీమియా కేసులకు అదనపు పౌష్టికాహారం అందజేయాలన్నారు. కీటక జనిత మలేరియా,డెంగ్యూ, చికెన్‌గున్యా వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. రెండవ విడత దోమల నివారణ మందు పిచికారి పనులను వచ్చేనెల 31వరకు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో సబ్‌కలెక్టర్ సౌర్యమన్‌పటేల్, రంపచోడవరం ఐటీడీఏ పీవో సింహాచలం, డీఎంహెచ్‌వో డాక్టర్ విశ్వేశ్వరనాయుడు, జిల్లా మలేరియాశాఖ అధికారి తులసి, డీఈవో బ్రహ్మాజీరావు, ఇన్‌చార్జి డీడీ రజని,డీసీహెచ్‌ఎస్ డాక్టర్ లక్ష్మి పాల్గొన్నారు.
వచ్చే నెలాఖరు నాటికి హోంస్టేల నిర్మాణం
వచ్చే నెలాఖరునాటికి జిల్లాలో హోంస్టేల నిర్మాణాలను పూర్తి చేయాలని కలెక్టర్ దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి టూరిజం కమిటీ ప్రతినిధులు,ఎంపీడీవోలతో నిర్వహించిన వీడియో సమావేశంలో ఆయన మాట్లాడారు. హోంస్టేల కోసం గుర్తించిన గృహాల్లో కనీస వసతులు కల్పించాలన్నారు.పర్యాటకులకు వసతితో పాటు అల్పాహారం.భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు.హోం స్టే ప్యాకేజీలు అందించేందుకు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఇంజినీరింగ్ అధికారులు, పోలీసులతో మండలస్థాయి టూరిజం కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.పర్యాటక ప్రాంతాలలో ప్లాస్టిక్ వస్తువులు,బాటిళ్లు,కవర్లను నియంత్రించాలని ఆదేశించారు. రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ, జిల్లా పర్యాటక అఽధికారి దాసు, డీఆర్‌డీఏ పీడీ మురళీ, డీఎల్‌పీవో కుమార్, సీపీవో ప్రసాద్, ఏపీఎఫ్‌డీసీ డీఎం కృష్ణబాబు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.