
తగ్గని వర్షాలు.. పొంగిన గెడ్డలు
సాక్షి,పాడేరు: జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఐదు రోజుల నుంచి కుండపోత వానతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది.గురువారం కూడా పాడేరుతో పాటు సమీప ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. పాడేరు మండలం గుత్తులపుట్టు,జి.మాడుగుల మండలం బొయితిలి సంతకు వెళ్లే గిరిజనులు వర్షంతో అవస్థలు పడ్డారు. జోలాపుట్టు జలాశయానికి నీరందించే మత్స్యగెడ్డ, రాళ్లగెడ్డ, చాపరాయి, కురిడి గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి.హుకుంపేట మండలంలోని చీడిపుట్టు రోడ్డులో రాళ్లగెడ్డ కాజ్‌వే మీదుగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.గెడ్డ ప్రమాదకరంగా ఉన్నప్పటికి గిరిజనులు ప్రాణాలకు తెగించి గెడ్డను దాటుతున్నారు.
జిల్లాలో 620.4 ఎంఎం వర్షపాతం నమోదు
జిల్లా వ్యాప్తంగా గురువారం 620.4మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముంచంగిపుట్టులో80.2, హుకుంపేటలో 46.8, పెదబయలులో 41.2, మారేడుమిల్లిలో 39.4, జి.మాడుగులలో 37.4, వై.రామవరంలో 36.4, చింతూరులో 34.6, అరకులోయలో 32.6, అడ్డతీగలలో 30.8, చింతపల్లిలో 28.4, గంగవరంలో 26.6, కూనవరంలో 25.4, దేవీపట్నంలో 24.6, రాజవొమ్మంగిలో 24.2, వీఆర్‌పురంలో 22.2, డుంబ్రిగుడలో 20.8, ఎటపాకలో 18.4, రంపచోడవరంలో 18.2, కొయ్యూరులో 16.2, అనంతగిరిలో 9.2, జీకేవీధిలో 4.2, పాడేరులో 2.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని కలెక్టరేట్ అధికారవర్గాలు తెలిపాయి.
ముంపులో ఇల్లు
పాడేరు మండలం చింతలవీధి జంక్షన్‌లో కిల్లో డొమై అనే గిరిజన మహిళకు చెందిన ఇల్లు ముంపునకు గురైంది. గురువారం ఇంటిలోకి వరదనీరు ప్రవహించడంతో ఆందోళనకు గురయ్యారు. జాతీయ రహదారి నిర్మాణంతో దిగువున ఉన్న నివాసాలన్నీ వర్షం పడినప్పుడల్లా ముంపు సమస్యను ఎదుర్కొంటున్నాయి. డ్రైనేజీలు నిర్మించకపోవడం వల్ల ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.
రాకపోకలకు ఇబ్బందులు
ముంచంగిపుట్టు: మండలంలోని మారుమూల బుంగాపుట్టు, రంగబయలు, వనుగుమ్మ, భూసిపుట్టు, కుమడ, దొడిపుట్టు పంచాయతీల్లో వాగులు,గెడ్డలు పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కించాయిపుట్టు పంచాయతీ వర్కుగుమ్మి వాగు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాల గిరిజనులు రెండు గంటల పాటు నిరీక్షించిన అనంతరం అతికష్టం మీద వాగును దాటారు.కుమడ గ్రామ సమీపంలో కల్వర్టుపై నుంచి వరదనీరు భారీగా పారింది. వనుగుమ్మ పంచాయతీ తర్లగూడ వద్ద కల్వర్టుపై వరదనీరు ప్రవహించడంతో గ్రామ గిరిజనులు రాకపోకలు సాగించేందుకు గిరిజనులు ఇబ్బందులు పడ్డారు. లక్ష్మీపురం పంచాయతీ కర్లపొదర్, దొడిపుట్టు పంచాయతీ బిడిచంపా వద్ద వాగులు ఉధృతంగా ప్రవహించడంతో గిరిజనులు గ్రామాలకు పరిమితం అయ్యారు. రంగబయలు పంచాయతీ జోడిగుమ్మలో కొర్ర పూయు అనే గిరిజనుడి ఇల్లు వర్షానికి స్వల్పంగా దెబ్బతింది.
పెదబయలు: మండలంలోని జామిగుడ, గిన్నెలకోట, మత్ప్యగెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. పెదకోడాపల్లి పరదానిపుట్టు సమీపంలోని వంతెనను తాకుతూ ప్రవహిస్తున్నాయి. కిముడుపల్లి పంచాయతీ గేదెగెడ్డ కాజ్‌వేపై నీరు ప్రవహించడంతో గురువారం ఉదయం మూడు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. జామిగుడ పంచాయతీలో పలు గ్రామాల ప్రజలు పొంగి ప్రవహిస్తున్న గెడ్డను దాటేందుకు అవస్థలు పడుతున్నారు.
జి.మాడుగుల: మండలంలోని కుంబిడిసింగికి వెళ్లే రోడ్డు మార్గంతోపాటు గడుతూరు పంచాయతీలోని వసమామిడి మార్గంలో గెడ్డలు పొంగి ప్రవహించడం వల్ల మారుమూల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తపల్లి జలపాతం, సొలభం పంచాయతీ ఎగకంఠవరం సమీపంలోని అక్కా చెల్లెళ్ల గుమ్మి జలపాతం, కుంబిడిసింగి–పెదలోచలి పంచాయతీల్లో గుర్రాయి వద్ద గల రాళ్లగెడ్డ జలపాతం వరదనీటితో ప్రవాహం ప్రమాదకరంగా మారింది.

తగ్గని వర్షాలు.. పొంగిన గెడ్డలు

తగ్గని వర్షాలు.. పొంగిన గెడ్డలు

తగ్గని వర్షాలు.. పొంగిన గెడ్డలు

తగ్గని వర్షాలు.. పొంగిన గెడ్డలు

తగ్గని వర్షాలు.. పొంగిన గెడ్డలు

తగ్గని వర్షాలు.. పొంగిన గెడ్డలు