ఐదేళ్లుగా..అసంపూర్తిగా.. | - | Sakshi
Sakshi News home page

ఐదేళ్లుగా..అసంపూర్తిగా..

Jul 5 2025 6:42 AM | Updated on Jul 5 2025 6:44 AM

సౌకర్యాల్లేక ఇబ్బందులు

డుంబ్రిగుడ ఏకలవ్య పాఠశాలను గత కొన్నేళ్లుగా అరకు డిగ్రీ కళాశాలలోని ఓ భవనంలో నిర్వహిస్తున్నారు. ఇరుకు గదుల్లో నిర్వహించడం వల్ల పూర్తిస్థాయి సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వీలైనంత త్వరగా డుంబ్రిగుడలోని భవనాలను పూర్తి చేసి తరలిస్తే బాగుంటుంది.

– గొల్లోరి లైకోన్‌, విద్యార్థిని తండ్రి,

సంతవలస, పోతంగి పంచాయతీ,

డుంబ్రిగుడ మండలం

చాలీచాలని వసతితో కాలక్షేపం

కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి. కొత్తభవనాలు అందుబాటులోకి రానందున విద్యార్థులు, సిబ్బంది చాలీచాలని వసతి మధ్య కాలం గడుపుతున్నారు. సుమారు 18 నెలల్లో పూర్తికావాల్సినవి ఐదేళ్లు దాటుతున్నా అందుబాటులోకి రాకపోవడం బాధాకరం.

– పాంగి జీవన్‌ కృష్ణ,

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి

త్వరలో బిల్లు బకాయిల చెల్లింపు

ఇటీవల జిల్లాకు ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారుల బృందం డుంబ్రిగుడలో భవన నిర్మాణ పనులను పరిశీలించింది. డుంబ్రిగుడలో మిగతా పది శాతం పనులు పూర్తికాకపోవడానికి కారణాలు తెలుసుకుంది. రూ.2.80 కోట్ల బిల్లు బకాయిలు త్వరలో చెల్లిస్తారు. లబ్బూరులో భవనాలను ఈనెల 9న ప్రారంభిస్తాం.

– వేణుగోపాల్‌, ఈఈ, గిరిజన సంక్షేమ

ఇంజినీరింగ్‌ శాఖ, అరకులోయ

అరకులోయ టౌన్‌: గిరిజన విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య అందించేందుకు ఏజెన్సీలో ఏర్పాటుచేసిన ఏకలవ్య రెసిడెన్షియల్‌ పాఠశాలలు వసతి సమస్యను ఎదుర్కొంటున్నాయి. శాశ్వత భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం బిల్లుల చెల్లింపు జాప్యం చేస్తోంది. దీనివల్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. సుమారు 18 నెలల్లో పూర్తికావాల్సిన భవనాలు ఐదేళ్లయినా కొన్నిచోట్ల జరుగుతూనే ఉన్నాయి.

పర్యవేక్షణ లేక..

కేంద్ర ప్రభుత్వం పాడేరు డివిజన్‌లో పది, రంపచోడవరం డివిజన్‌ పరిధిలో ఆరు ఏకలవ్య రెసిడెన్షియల్‌ పాఠశాలలను 2019లో మంజూరు చేసింది. ఒకొక్కదానికి రూ.12 కోట్లు కేటాయించింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో భవన నిర్మాణాలకు స్థలాలు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో నిర్మాణ పనులు చురుగ్గా ప్రారంభమయ్యాయి. ఏడాది కాలంగా పనులు చురుగ్గా సాగడం లేదు. కూటమి ప్రభుత్వ పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

● అరకులోయ మండలం మజ్జివలసలో పాఠశాల భవన నిర్మాణ పనులు 90 శాతం మేర పూర్తయ్యాయి. కాంట్రాక్టర్‌కు రూ.కోటి మేర బిల్లు చెల్లించాల్సి ఉంది. దీంతో చివరి దశలో పనులు నిలిచిపోయాయి. డుంబ్రిగుడలో 90 శాతం పనులు పూర్తికాగా రూ.2.80లక్షలు బిల్లు చెల్లించాల్సి ఉన్నందున చివరి దశలో పనులు ముందుకు సాగడం లేదు. కొయ్యారు, రంపచోడవరం, అడ్డతీగలలో 90 శాతం పనులు పూర్తయ్యాయి. బిల్లులు సకాలంలో మంజూరు అవుతున్నప్పటికీ కాంట్రాక్టర్లు పనులు చురుగ్గా చేయడం లేదని తెలుస్తోంది. ముంచంగిపుట్టు మండలం లబ్బూరులో పాఠశాల భవనాలు పూర్తయ్యాయి. ప్రహరీ నిర్మించాల్సి ఉంది. బిల్లులు చెల్లించకపోవడంతో ప్రారంభంలో జాప్యం జరుగుతోంది. అనంతగిరి (పాతకోట), జి.మాడుగుల, హుకుంపేటలో భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి.

సొంత భవనాల్లేక..

ఏకలవ్య పాఠశాలలకు సొంత భవనాలు అందుబాటులోకి రానందున విద్యార్థులు, ఉపాధ్యాయులు వసతి సమస్యను ఎదుర్కొంటున్నారు. అరకులోయ మండలంలోని మజ్జి వలస పాఠశాలను అరకులోయ గురుకుల బాలికల కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్నారు. డుంబ్రిగుడ పాఠశాలను అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో, కొయ్యూరు పాఠశాలను చింతపల్లి వైటీసీలో, అనంతగిరి పాఠశాలను అరకులోయ వైటీసీలో, రంపచోడవరం పాఠశాలను మారేడుమిల్లిలో, ముంచంగిపుట్టు పాఠశాలను పెదబయలులో నిర్వహిస్తున్నారు. జిల్లాలోని పెదబయలు, చింతపల్లి, చింతూరు, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, వై.రామవరంలో మాత్రమే కొత్త భవనాల్లో పాఠశాలలు నిర్వహిస్తున్నారు.

జిల్లాలో ఏకలవ్య రెసిడెన్షియల్‌ పాఠశాలల విద్యార్థులు చాలాచోట్ల కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం భవనాలు మంజూరు చేసినా పనులు చురుగ్గా సాగడం లేదు. సుమారు 18 నెలల్లో పూర్తి కావాల్సిన నిర్మాణ పనులు ఐదేళ్లు దాటుతున్నా ఇంకా జరుగుతూనే ఉండటం గమనార్హం.

నత్తనడకన ఏకలవ్య రెసిడెన్షియల్‌

పాఠశాలల భవన నిర్మాణాలు

బిల్లుల చెల్లింపులో జాప్యమే కారణం

సొంత భవనాలు లేక వసతి సమస్య

ఇబ్బందులు పడుతున్న

విద్యార్థులు, సిబ్బంది

కూటమి ప్రభుత్వ పర్యవేక్షణ లోపమే కారణమని విమర్శలు

ఐదేళ్లుగా..అసంపూర్తిగా.. 1
1/5

ఐదేళ్లుగా..అసంపూర్తిగా..

ఐదేళ్లుగా..అసంపూర్తిగా.. 2
2/5

ఐదేళ్లుగా..అసంపూర్తిగా..

ఐదేళ్లుగా..అసంపూర్తిగా.. 3
3/5

ఐదేళ్లుగా..అసంపూర్తిగా..

ఐదేళ్లుగా..అసంపూర్తిగా.. 4
4/5

ఐదేళ్లుగా..అసంపూర్తిగా..

ఐదేళ్లుగా..అసంపూర్తిగా.. 5
5/5

ఐదేళ్లుగా..అసంపూర్తిగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement