
పేరేంట్స్ డే విజయవంతం చేయండి
పాడేరు : జిల్లాలో ఈనెల 10న ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పెరెంట్స్ డేను విజయవంతం చేయాలని కలెక్టర్ దినేష్‌కుమార్ అన్నారు. మెగా పెరెంట్స్ డే, తల్లికి వందనం అమలుపై శనివారం కలెక్టరేట్‌లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల10న జిల్లాలోని 2,900 పాఠశాలల్లో పేరెంట్స్ డే నిర్వహిస్తున్నామన్నారు. మెగా పెరెంట్స్ డే నిర్వహణకు రూ.61లక్షల 11వేల నిధులను పాఠశాలలకు విడుదల చేశామన్నారు. పాఠశాలలను సుందరంగా అలంకరించి విద్యార్థుల తల్లిదండ్రులను మర్యాదపూర్వకంగా ఆహ్వానించాలన్నారు. పేరెంట్స్ డే నిర్వహణకు మండల ప్రత్యేకాధికారులను నియమించినట్టు తెలిపారు. బాలికల రక్షణ, సైబర్స్ క్రైమ్, ఆరోగ్యం, డ్రగ్స్ వద్దు బ్రో, గంజాయి నిర్మూలన తదితర వాటిపై అవగాహన కల్పిస్తామన్నారు. తల్లికి వందనం మొదటి విడతలో జిల్లా వ్యాప్తంగా లక్షా 56వేల మంది తల్లుల ఖాతాల్లో నిధులు జమ అయినట్టు చెప్పారు. రెండో విడత ఈనెల 10న జమ చేస్తారన్నారు. మెగా పేరెంట్స్ మీట్‌లో రంగవల్లులు, క్రీడలు నిర్వహిస్తామని చెప్పారు.
ఆకాంక్ష జిల్లాకు రూ.10కోట్ల నిధులు విడుదల
అల్లూరి సీతారామరాజు జిల్లా ఆకాంక్ష జిల్లా కావడం వలన నీతి ఆయోగ్ రూ.10కోట్ల నిధులను విడుల చేసిందన కలెక్టర్ దినేష్‌కుమార్ చెప్పారు. ఆ నిధులను విద్యాభివృద్ధికి వెచ్చిస్తామన్నారు. జిల్లాలో ఐదు మోడల్ పాఠశాలలను ఏర్పాటు చేసి వాలీబాల్, కబడ్డీ, ఆర్చరీ, అధ్లెటిక్స్, రెజ్లింగ్ తదితర క్రీడల్లోశిక్షణ ఇస్తామన్నారు. ప్రత్యేకంగా ఫిజికల్ డైరెక్టర్లను, వ్యాయామ ఉపాధ్యాయులను నియమిస్తామన్నారు. విద్యార్ధులకు క్రీడల్లో తర్పీదు ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. గతంలో మాదిరిగా సూపర్ 50 తరగతులను నిర్వహిస్తామన్నారు. మనబడి మన భవిష్యత్ కింద భవనాలు లేని పాఠశాలలను గుర్తించి రూ.56 కోట్లతో అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదించామన్నారు. ప్రస్తుతం అత్యవసరంగా మండలానికి మూడు పాఠశాలలను ఎంపిక చేసి మరమ్మతులు చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో వసతి, నాణ్యమైన భోజనం, వైద్య సేవలు, విద్యా ప్రమాణాలను పర్యవేక్షించేందుకు ఐటీడీఏ మోనటరింగ్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. వారపు సంతల్లో పుడ్‌సేప్టీ అధికారులు చేత ప్రత్యేక తనిఖీలు చేయించి కల్తీలను అరికడతామన్నారు.
పాఠశాలలకు రూ.61లక్షలు విడుదల
కలెక్టర్ దినేష్‌కుమార్