
ఎన్‌ఏడీ అధికారిపై దాడి.. నలుగురి అరెస్ట్
గోపాలపట్నం: నేవల్ ఆర్మమెంట్ డిపో(ఎన్‌ఏడీ) అధికారిపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, ఎయిర్‌పోర్ట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 27న నేవల్ ఆర్మమెంట్ డిపో డీజీఎం మల్లికార్జునరావుపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఎన్‌ఏడీలో విధులను ముగించుకుని భోజన విరామ సమయంలో క్వార్టర్స్‌లో ఉన్న తన ఇంటికి వస్తుండగా.. కేంద్రీయ విద్యాలయం వద్ద రోడ్డుపై ద్విచక్రవాహనాన్ని ఆపి ఆయనపై దాడి చేశారు. విచక్షణారహితంగా పిడిగుద్దులు కురిపించారు. ఆయన హెల్మెట్ ధరించి ఉండటంతో తలపైనా, ముఖంపైనా దెబ్బలు తగల్లేదు. దాడికి పాల్పడిన వారిలో ఎన్‌ఏడీ ఉద్యోగి ఒకరు ఉండటంతో, కక్షపూరితంగానే దాడి చేశారని తెలుస్తోంది. మల్లికార్జునరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించారు. ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎన్‌ఏడీలో బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టడం వంటి ఏకపక్ష నిర్ణయాల వల్ల ఇబ్బంది పడుతున్నామనే కక్షతోనే దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. దాడికి పాల్పడిన ఎన్‌ఏడీ ఉద్యోగి బెహరా అరుణ్‌తో పాటు ఎల్లవిల్లి దినేష్ కుమార్, చిత్ర గణేష్ కుమార్, నడిపిల్లి నితేష్ కుమార్‌లను అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అరుణ్ కుమార్‌కు ఈ ముగ్గురు స్నేహితులు. అయితే అరుణ్ కుమార్ సుపారీ గ్యాంగ్‌తో కలిసి దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ దాడిలో ఒక సీఈ యూనియన్ హస్తం ఉందని కార్మికులు, ఇతర యూనియన్లు చెప్పుకుంటున్నాయి.
ఐఎన్‌టీయూసీ నిరసన
ఎన్‌ఏడీ అధికారి దాడి ఘటనపై ఐఎన్‌టీయూసీ సభ్యులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి, థర్డ్ లెవెల్ జేసీఎం సభ్యుడు సాలాపు మారయ్య మాట్లాడుతూ ఎన్‌ఏడీ యూనియన్ నాయకులు సుపారీ గ్యాంగ్‌తో అధికారిపై దాడి చేయించారని ఆరోపించారు. హత్యాయత్నం చేయడంతో కార్మికులు భయాందోళన చెందుతున్నారన్నారు. కార్మిక సంఘాల నాయకులు కార్మిక చట్టాలను అనుసరించి పోరాటాలు చేసి అధికారులపై ఒత్తిడి తీసుకురావాలే తప్ప, దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. నిరసనలో యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన