టీచర్లకు ‘టెట్’షన్
ఉత్తీర్ణత కోసం పుస్తకాలతో కుస్తీ.. ఉమ్మడి జిల్లాలో సగానికిపైగా ఉపాధ్యాయులు సన్నద్ధం తీరిక సమయం.. సెలవు రోజుల్లో ప్రిపరేషన్
ఉపాధ్యాయులు లేనివారు(సుమారు)
మంచిర్యాలఅర్బన్:జాతీయ విద్యా విధానం ప్రకారం దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) పాస్ కావాలని సెప్టెంబర్ 1న ఉత్తరవులు వచ్చాయి. జనవరి 3 నుంచి 20 వరకు ఆన్‌లైన్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తూనే.. టెట్‌కు సన్నద్ధమవుతున్నారు. అయిదేళ్లకుపైగా సర్వీస్ ఉన్నవారు రెండేళ్లలో టెట్ అర్హత సాధించాల్సి ఉంది. దీంతో అందరిలో టెన్షన్ కనిపిస్తోంది.
సాధన పోరాటం..
తరగతి గది విధుల మధ్య ఖాళీ సమయాల్లో టెట్ కోసం ఆన్‌లైన్ తరగతులు వింటున్నారు. కొందర సాయంత్రం వేళ శిక్షణ కేంద్రాల్లో పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. సెలవు రోజుల్లో ఇంట్లో ఆన్‌లైన్ కోచింగ్‌లతో సిద్ధపడుతున్నారు. ఈ ప్రయత్నాలు వారి రోజువారీ బాధ్యతలతో సమతుల్యం చేసుకోవడం సవాల్‌గా మారాయి.
ఉమ్మడి జిల్లాలో ఇలా..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు పది వేల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో సగానిపైగా టెట్ అర్హత లేనివారే. మంచిర్యాల జిల్లాలో 2,507 మంది ఉండగా, 1,562 మందికి టెట్ లేదు. ఆదిలాబాద్ జిల్లాలో 2,636 మంది ఉపాధ్యాయుల్లో 1,845 మందికి అర్హత లేదు. ఆసిఫాబాద్‌లో 2,030 మంది ఉండగా, 1,015 మందికి టెట్ లేదు. నిర్మల్ జిల్లాలో 2,600 మంది ఉండగా, 1,500 మంది టెట్ లేకుండా పనిచేస్తున్నారు.
జిల్లా మొత్తం టెట్ అర్హత
మంచిర్యాల 2,507 1,562
ఆదిలాబాద్ 2,636 1,845
నిర్మల్ 2,600 1,500
ఆసిఫాబాద్ 2,030 1,015


