
No Headline
సాక్షి, అమలాపురం/ రావులపాలెం: ఉచితమంటూనే మెలిక పెట్టారు.. అదనపు చార్జీల వసూలుతో వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఉచిత ఇసుక విధానంలో లారీలకు ‘వెయిటింగ్’ చార్జీల పేరుతో భారం మోపుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడే అదనంగా సొమ్ము చెల్లించాల్సి వస్తోంది. ‘అవకాశాలు సృష్టించుకోవాలి.. అలా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలంటూ’ ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ చెప్పే మాటలను ఆ పార్టీ నాయకులు అందిపుచ్చుకొంటున్నారు. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీలో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. ఉచిత ఇసుక పాలసీలో చెల్లించాల్సిన సొమ్ము కన్నా అదనంగా ‘బీ– వీ’ ట్యాక్స్‌లో వసూలు చేస్తున్న టీడీపీ నేతలకు దన్నుగా కొందరు లారీ డ్రైవర్లు తోడయ్యారు. వెయిటింగ్ చార్జీల పేరుతో నిర్దేశించిన రవాణా చార్జీలకు అదనంగా వసూలు చేస్తున్నారు.
ప్రభుత్వ ఉచిత ఇసుక విధానం ప్రజలకు మోయలేని భారమైంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ర్యాంపుల వద్ద ఇసుకకు రుసుం వసూలు చేసిన దానికన్నా కూటమి ప్రభుత్వంలో స్టాక్ పాయింట్ వద్ద నిల్వఉన్న ఇసుక ధర అధికంగా ఉండడం గమనార్హం. ఇందుకు అతి పెద్ద ఉదాహరణ రావులపాలెంలో ఇప్పుడు పలుకుతున్న ఇసుక ధర. గత ప్రభుత్వంలో ఐదు యూనిట్ల ఇసుక (అప్పట్లో 22 టన్నుల వరకూ వచ్చేది) కొనుగోలు చేస్తే, లారీ రవాణా ఖర్చులతో కలిపి రూ.12,500 వరకూ అయ్యేది. అప్పట్లో ఇసుక ర్యాంపు వద్ద టన్ను రూ.475 వరకూ ఉండేది. ఐదు యూనిట్లు (22 టన్నులు) ధర రూ.10,450 వరకూ అయ్యేది. జొన్నాడ, గోపాలపురం ర్యాంపుల నుంచి రావులపాలేనికి రూ.1,500 నుంచి రూ.2 వేల వరకూ రవాణా చార్జీ ఇవ్వాల్సి వచ్చేంది. ఇలా ఐదు యూనిట్ల లారీ ఇసుక వినియోగదారుని వద్దకు చేరేసరికి రూ.12,500కు వచ్చేది. టన్ను రూ.475లోనే ప్రభుత్వానికి రూ.375 వరకూ ఆదాయం రూపంలో వెళ్లేది. ఇది కాకుండా ర్యాంపుల్లో లోడింగ్, బాటల నిర్వహణ, ఇతర ఖర్చులకు రూ.వంద వసూలు చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఉచిత ఇసుక పాలసీల్లో స్టాక్ పాయింట్ వద్ద టన్ను ధర రూ.265గా నిర్ణయించారు. ఇప్పుడు ఐదు యూనిట్లు (గరిష్టంగా 20 టన్నులు) ధర రూ. 5,300. బీ– వీ ట్యాక్స్ పేరుతో ఇస్తున్న స్లిప్‌లకు వసూలు చేస్తున్న రూ.5,100 కలిపి మొత్తం రూ.10,400 అవుతోంది. స్టాక్ పాయింట్ల వద్ద అనధికార ట్యాక్స్ వసూలు చేస్తున్న టీడీపీ తృతీయ శ్రేణి నాయకులు దీనికి అదనంగా రూ.వెయ్యి చార్జీ చేస్తున్నారు. మొత్తం అంతా కలిపి రూ.11,400 వరకూ అవుతోంది. ఇక రవాణా చార్జీ లారీకి ఏకంగా రూ.4 వేల నుంచి రూ.4,600 వరకూ తీసుకుంటున్నారు. ఇలా మొత్తం అంతా కలిపి రూ.16 వేలు అవుతోంది. ఇందులో కూడా రెండు టన్నుల ఇసుక తక్కువగా వస్తుండడం గమనార్హం.
అదనపు భారం వేస్తూ..
గత ప్రభుత్వంలో ర్యాంపుల వద్ద వసూలు చేసిన సొమ్ములో మూడో వంతు అంటే సుమారు 78 శాతం ప్రభుత్వానికి ఆదాయం రూపంలో వెళ్లేది. ఇప్పుడు ప్రభుత్వం వసూలు చేస్తున్న రూ.265లో చాలా కొంత మొత్తం మాత్రమే సీనరేజ్, జీఎస్టీగా వసూలు చేస్తున్నారు. ఇందులో సీజరేజ్‌గా వసూలు చేసే ఆదాయం రూ.88ని జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీలకు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక జీఎస్టీగా 18 శాతం ఆదాయం మాత్రమే ప్రభుత్వానికి వస్తోంది. ఈ విధానంతో వినియోగదారులపై భారం పడుతుంది.
మిగతా చోట్లా ఇంతే..
రావులపాలెంలోనే కాదు జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇసుక ధర గతం కన్నా అధికంగా ఉంది. ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం గ్రామం సముద్రతీర ప్రాంతం. ఇక్కడకు ఐదు యూనిట్ల ఇసుక రవాణా చార్జీలతో కలిపి రూ.19 వేల నుంచి రూ.21 వేల వరకూ అయ్యేది. ఇప్పుడు రూ.23 వేల నుంచి రూ.25 వేల వరకూ అవుతుండడం గమనార్హం. అంతమాత్రాన ఇసుక అడిగిన వెంటనే దొరకడం లేదు. రవాణా చార్జీలపై అదుపు లేకపోవడంతో స్టాక్ పాయింట్‌కు దగ్గరగా ఉన్న ప్రాంతాలకు ఇసుక రవాణా చేసేందుకు లారీల యజమానులు మక్కువ చూపుతున్నారు. దీనివల్ల రోజులో కనీసం రెండు, మూడు ట్రిప్పులు వేసే అవకాశముంది. అదే దూర ప్రాంతమైతే ఒక ట్రిప్పు వేసే అవకాశం ఉండడం వల్ల రాబడి తక్కువగా ఉందని లారీల యజమానులు దూరానికి రవాణా పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
ఇ‘దందా’ వెయిటింగ్ వల్లే..
జిల్లాలో రావులపాలెంలో రెండు, మందపల్లి, కపిలేశ్వరపురం స్టాక్ పాయింట్ల వద్ద నుంచి ఇసుక ఎగుమతి అవుతోంది. ఇక్కడ ఇసుకకు అదనపు వసూలు చేయడమే కాకుండా ఎంపిక చేసిన లారీలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో మిగిలిన లారీల నిర్వాహకులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఒక్కోసారి రోజంతా లైన్‌లో నిలబడాల్సి వస్తోంది. దీంతో లారీల యజమానులు వెయిటింగ్ భారాన్ని వినియోదారులపై వేస్తున్నారు. లారీలు వెయిటింగ్‌లో ఉండడం వల్ల డ్రైవర్లకు అదనపు బేటాలు చెల్లించాల్సి రావడంతోపాటు అదనపు చార్జీలు వసూలు చేయడం వినియోగదారులకు ఇబ్బందిగా మారింది.
ఫ ఉచిత ఇసుకంటూ
మెలిక పెట్టిన ప్రభుత్వం
ఫ లారీలకు ‘వెయిటింగ్’
చార్జీల పేరుతో భారం
ఫ కొత్త తరహా దోపిడీకి
తెరదీసిన ఇసుకాసురులు
ఫ గతంలో ర్యాంపు నుంచి
ఐదు టన్నులు రూ.12,500
ఫ ఇప్పుడు స్టాక్ పాయింట్ల ద్వారా
రూ.16 వేలకు పైగా వసూలు

No Headline