breaking news
Young energy
-
చిన్న పనినైనా శ్రద్ధాసక్తులతో చేయాలి
భారతీయ ఆధ్యాత్మిక చేతన స్వామి వివేకానంద. తన గురువు శ్రీ రామకృష్ణ పరమహంస ప్రేరణతో ఆయన ప్రపంచమంతటా పర్యటించారు. యువశక్తిని ప్రేరేపించే విధంగా ఎంతో ఉత్తేజపూరితమైన ప్రసంగాలు, ప్రబోధాలు చేశారు. కొన్నితరాలకు సరిపోయేటటువంటి ఆధ్యాత్మిక జ్ఞానామృతాన్ని పంచారు. స్ఫూర్తిదాయకమైన ఆయన మాటలు మంచి ముత్యపు మాలికలు!ఆ మాలికలనుంచి రాలిన కొన్ని మేలిముత్యాలివి. శ్రద్ధ, ధీరత్వం కలిగి ఉండి ఆత్మజ్ఞానాన్ని పొందండి. అలా జ్ఞానం పొందిన మీ జీవితాన్ని ఇతరుల మేలుకై త్యాగం చేయండి. ఇదే నా ఆకాంక్ష, ఆశీర్వాదం. మనసు ఎంత నిర్మలమైతే దాన్ని నిగ్రహించడం అంత సులభమౌతుంది. మనసును నిగ్రహించాలనుకుంటే, చిత్తశుద్ధికి తప్పకుండా ప్రాధాన్యం ఇవ్వాలి. చేపట్టిన కర్తవ్యం మధురంగా తోచటం చాలా అరుదు. చేదుగా తోచే పనిని చెయ్యాలంటే దాని మీద గొప్ప ప్రేమను పెంపొందించుకోవాలి. ప్రేమను దాని చక్రాలకు కందెనగా పూసినప్పుడు మాత్రమే ఈ కర్తవ్యమనే యంత్రం సాఫీగా నడుస్తుంది. జీవించినా, మరణించినా మీ బలం మీదనే ఆధారపడండి. ప్రంచంలో పాపమనేది ఉంటే అది బలహీనతే కానీ మరొకటి కాదు. అన్ని రకాల బలహీనతల్ని విడనాడండి. మానవ చరిత్రను పరికిస్తే, ఉన్నతులైన స్త్రీ, పురుషుల జీవితాల్లో అన్నింటికంటే ఎక్కువగా సామర్ధ్యాన్ని ఇచ్చిన మూలశక్తి వారి ఆత్మవిశ్వాసమే. వాళ్లు ఉన్నతులు కాగలరనే విశ్వాసంతో జన్మించారు, ఉన్నతులై నిలిచారు. నిరాశలో మునిగిపోవడం ఏమైనా కావచ్చు కానీ ఆధ్యాత్మికత మాత్రం కాదు. ఎల్లప్పుడూ సంతోషంగా, నవ్వుతూ ఉండటం అన్ని ప్రార్థనల కన్నా మనల్ని భగవంతునికి చేరువ చేస్తుంది. సౌశీల్యం, జ్వాజ్వల్యమానమైన ప్రేమ, నిస్వార్థాలే జీవితంగా గల కొంతమంది వ్యక్తుల అవసరం ఈ ప్రపంచానికి ఉంది. కాబట్టి నీలో ఆ గుణాలను పెంచుకోవడానికి ప్రయత్నించు. మనిషికి, మనిషికి మధ్య గల భేదం, విశ్వాసంలో ఉన్న భేదమే తప్ప వేరేమీ కాదు. ఒక వ్యక్తిని ఉన్నతుణ్ణి గాను, మరొకర్ని దుర్బలునిగాను, అధమునిగాను చేసేది ఈ విశ్వాసమే. అసూయను, తలబిరుసునూ విడనాడండి. పరహితం కోసం సమష్టిగా కృషి చేయడం అలవరచుకోండి. మనదేశపు తక్షణ అవసరం ఇది. పరిపూర్ణ అంకితభావం, అతిసునిశితమైన బుద్ధి, సర్వాన్ని జయించగల సంకల్పం, వీటిని కలిగిన కొద్దిమంది వ్యక్తులు పని చేసినా మొత్తం ప్రపంచంలో పెనుమార్పు సంభవిస్తుంది. ప్రపంచానికి కావలసింది సౌశీల్యం, ఎవరి జీవితం ఉజ్వల ప్రేమయుతమై, నిస్వార్థమై ఉంటుందో అలాంటి వారే లోకానికి కావాలి. పరిస్థితులను ఎదుర్కొని పోరాడి ముందుకు సాగినప్పుడే... పురోగమించడానికి మళ్లీ మళ్లీ ప్రయత్నం చేసినప్పుడే మనలోని సంకల్ప శక్తి బయటకు వస్తుంది. చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనా వెనక్కు చూడకుండా పురోగమించాలి. అందుకు మనకు కావలసినవి శక్తి, పట్టుదల, ధైర్యం, సహనం. అప్పుడే మహాకార్యాలను సైతం సులువుగా సాధించగలుగుతాం. సింహసదృశులైనటువంటి కొద్దిమంది ప్రపంచాన్ని జయిస్తారు కానీ లక్షలకొద్దీ గొర్రెల మందలు కాదు. మీ మనసులో, మాటలలో గొప్ప శక్తిని ఉంచుకోవాలి. నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడం అంటే నీలోని భగవంతుని తక్కువ చేయడమే! భగవంతుని వైపు వెళ్లేలా చేసే ఏ కార్యమైనా సత్కార్యమే. అదే మన ధర్మం. మనల్ని అధోగతి చేరేలా చేసే ఏ కార్యమైనా దుష్కార్యమే. అది మన ధర్మం కాదు. నీవు శ్రద్ధాభావంతో ఏం చేసినా నీకది మేలే. చాలా చిన్న పనైనా సవ్యంగా చేస్తే మహాద్భుత ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతివ్యక్తి తాను చేయగల ఎంత చిన్నపనైనా శ్రద్ధతో నిర్వహించాలి. సంకల్పశక్తిని సరైన రీతిలో, నైపుణ్యంగా ఉపయోగించేలా వ్యక్తులకు ఇచ్చే శిక్షణే విద్య. మన దేశానికి కావలసింది ఇనుప కండరాలు, ఉక్కునరాలు. ఇంకా ఎవ్వరూ నిరోధించలేనిదీ, జగత్తులోని రహస్యాలను ఛేదించగలిగేది అయిన వజ్రసంకల్పం. వీటితోబాటు మహాసముద్రంలో అట్టడుగునకు మునగవలసి వచ్చినా, లక్ష్యాన్ని ఏ విధంగానెనా సాధించగలిగే దృఢసంకల్పం మనకు అవసరం. - ధ్యానమాలిక -
యువశక్తిని మేల్కొలిపిన వివేకానందుడు
వరంగల్ స్పోర్ట్స్/కేఎంసీ/ఎన్జీవోస్ కాలనీ/కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : దేశంలోని యువశక్తిని మేల్కొల్పిన స్వామి వివేకానందుడి స్ఫూర్తితో యువతరం జాతీయభావాన్ని పెంపొందించుకోవాలని వివేకానంద 150వ జయంతి ఉత్సవ సమితి జాతీయ ఉపాధ్యక్షుడు, అఖిల భారత సాహిత్య పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు కసిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వివేకానందుడి 150వ జయంతి ఉత్సవాలలో భాగంగా నగరంలో ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ ద నేషన్’ పేరిట భారీ మారథాన్ నిర్వహించారు. ఆర్ట్ కళాశాల నుంచి కలెక్టర్ కిషన్ యూత్ రన్‌ను జెండాఊపి ప్రారంభించారు. ఎస్డీఎల్సీఈ క్రాస్ నుంచి కేయూరిజిస్ట్రార్ ప్రొఫెసర్ సాయిలు, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్. రామస్వామి కాకతీయ మెడికల్ కళాశాల నుంచి ప్రిన్సిపాల్ డాక్టర్ రాంచందర్ దరక్ జెండా ఊపిప్రారంభించారు. ఈ మూడు ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, యువకులు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు చేరుకున్నారు. ముఖ్య వక్తగా విచ్చేసిన కసిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగిస్తూ చికాగోలో మహాసభలో వివేకానందుడు.. ప్రపంచానికి భారతదేశ ఖ్యాతిని తెలియజెప్పిన రోజును పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు. సోదర, సోదరీమణులారా.. అనే మాటలతో ప్రారంభించిన ఆయన ప్రసంగాన్ని పాశ్యాత్యులు మొత్తం విన్నారన్నారు. అప్పటి నుంచే హిందూ, సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత పాశ్చాత్యులకు కలిగిందన్నారు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన యువత దేశానికి కావాలని వివేకానందుడు పిలుపునిచ్చారన్నారు. కానీ ఆయన కలలు కల్లలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామీజీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని నూతన ఉత్తేజంతో, జాతీయభావంతో దేశం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం స్టేడియంలో ఏర్పాటు చేసిన వివేకానందుడి ఫ్లెక్సీల వద్ద విద్యార్థులు, యువకులు పూలతో నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఎ. వరదారెడ్డి, డాక్టర్ విశ్వనాథం, జూలపల్లి కరుణాకర్, కానిగంటి విశ్వనాథ్జీ, బొల్లంపల్లి మురళీధర్‌రావు, బీజేపీ నాయకులు మార్తినేని ధర్మారావు, మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశ భవిష్యత్‌ను నిర్ణయించేది యువతే దేశ భవిష్యత్‌ను నిర్ణయించి పురోభివృద్ధి సాధించేందుకు యువకులే ముందు వరుసలో ఉండాలని కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంచందర్ దరక్ సూచించారు. కాకతీయ మెడికల్ కళాశాల నుంచి ప్రారంభమైన రన్ఫర్ది నేషన్ మారథాన్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 15 సంవత్సరాలు నిం డిన యువతీ యువకులు పెద్ద సంఖ్యలో మా రథాన్‌లో పాల్గొంటున్నారని, దేశ భవిష్యత్‌లో యువతే కీలకపాత్ర వహించాలని తెలిపారు. దే శ భవితకు యువత పరుగు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ప్ర ముఖ న్యాయవాదులు అల్లం నాగరాజు, గుడిమల్ల రవికుమార్, పీడీ ప్రభాకర్‌రెడ్డి, కళాశాలకు చెందిన మెడికోలు, నగరానికి చెం దిన ప్రముఖ యువకులు పాల్గొన్నారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలి దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని కలెక్టర్ జి.కిషన్ పిలుపునిచ్చారు. సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో వివేకానందుని జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన ‘రన్ ఫర్ ది నేషన్’ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అంతకు ముందు కలెక్టర్ మాట్లాడుతూ యువత దేశ సేవలో భాగస్వాములు కావాలని స్వామి వివేకానందుడు యువతకు పిలుపునిచ్చారన్నారు. అభివృద్ధికి పునాది రాళ్లుగా యువత దోహదపడాలన్నారు. మనసు బాగుండాలంటే శరీరం కూడా బాగా ఉండాలన్నారు. శరీర దారుఢ్యానికే ఈ మారథాన్ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు చెప్పారు.