breaking news
wildlife officials
-
కింగ్ కోబ్రాలు గూడు కట్టి.. గుడ్లు పెట్టి..
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అత్యంత అరుదైన జాతికి చెందిన కింగ్ కోబ్రాలు గుడ్లు పెట్టేందుకు దిబ్బల మాదిరిగా నేలపై గూళ్లు కడతాయి. ఇందుకోసం ఆడ కింగ్ కోబ్రా గర్భం దాల్చిన వెంటనే ఎండిపోయిన వెదురు ఆకులను సేకరించి గూట్లో గుడ్లు పెట్టేందుకు అనువుగా సర్దుతుంది. అందులో 30 నుంచి 40 గుడ్లు పెట్టి పొదుగుతుంది. ఆ సమయంలో నెల నుంచి నెలన్నర పాటు ఆహారం మానేసి గూట్లోనే ఉండిపోతుంది. ఆ తరువాత 15 నుంచి 30 రోజుల్లో గుడ్ల నుంచి పిల్లలు వస్తాయనగా తల్లిపాము గూడు విడిచి వెళ్లిపోతుంది. ఆ గూళ్లను అడవి పందులు, ముంగిసలు ఇతర జంతువులు తవ్వి గుడ్లను తినేస్తాయి. ఫలితంగా కింగ్ కోబ్రాల జాతి అంతరించిపోయే స్థితికి చేరుకుంది. ఎలా రక్షిస్తున్నారంటే.. మన రాష్ట్రంలో వెదురు పొదలు ఎక్కువగా ఉండే చోట కింగ్ కోబ్రా గూళ్లు ఎక్కువగా పెడుతున్నట్టు తూర్పు కనుమల వైల్డ్ లైఫ్ సొసైటీ, అటవీ శాఖ గుర్తించాయి. పిల్లలు బయటకు వచ్చేంత వరకు వీటి గుడ్లను సంరక్షించేందుకు వైల్డ్ లైఫ్ సొసైటీ, అటవీ శాఖ ప్రయోగాత్మకంగా చర్యలు చేపట్టాయి. గిరి నాగులు గుడ్లు పెట్టే దశ మార్చిలో ప్రారంభమై జూలై, ఆగస్టులో ముగుస్తుంది. ఆగస్టు నెలలో గుడ్లలోంచి పిల్లలు బయటకు వస్తాయి. ఆ గూళ్లను రక్షించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం అనకాపల్లి జిల్లా మాడుగులలో మొదటిసారి ఒక గూడును పరిరక్షించి గుడ్లలోంచి పిల్లలు వచ్చాక వాటిని అడవిలో వదిలేశారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఈ గూళ్లపై సర్వే పూర్తి చేయగా.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రస్తుతం ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఆడ గిరి నాగులు గుడ్లు పెట్టిన గూళ్లను వదిలి వెళ్లిపోయిన తరువాత గూళ్ల చుట్టూ వెదురు బొంగుల్ని పాతి ఇతర జీవులేవీ గుడ్లను తాకలేని విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆపై గూళ్ల చుట్టూ దోమ తెరలను ఆమరుస్తున్నారు. గుడ్లలోంచి గిరి నాగు పిల్లలు బయటకు వచ్చిన తరువాత వెదురు బొంగులు, దోమ తెరలను తొలగించి.. ఆ పిల్లల్ని స్వేచ్ఛగా అడవిలో వదిలేస్తున్నారు. వీటిని ఎందుకు కాపాడుకోవాలంటే.. కింగ్ కోబ్రా ఆహార గొలుసులో అగ్ర స్థానంలో ఉంటుంది. అంటే గిరి నాగులు ఇతర అన్ని రకాల పాముల్ని ఆహారంగా తీసుకుంటాయి. వీటి వల్ల ఇతర పాముల జనాభా నియంత్రణలో ఉంటుంది. పర్యావరణంలో కింగ్ కోబ్రాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. గిరి నాగులు ఉన్నచోట జీవ వైవిధ్యం ఎక్కువగా ఉన్నట్టు లెక్కిస్తారు. సాధారణంగా ఇవి మనుషులు వస్తే.. తప్పించుకుని పోతాయి. ఈ పాముల కాటు వల్ల మనుషులు చనిపోయిన సందర్భాలు తక్కువ. కింగ్ కోబ్రాల రక్షణ కోసం పని చేస్తున్నాం ఐదారేళ్ల క్రితం వరకు గిరి నాగుల్ని స్థానికులు ఎక్కువగా చంపేసేవారు. ఆ సమయంలో అటవీ శాఖతో కలిసి కింగ్ కోబ్రా కన్జర్వేషన్ ప్రాజెక్టును మొదలుపెట్టాం. వాటి సంరక్షణ, ఇతర పాము జాతులపై అధ్యయనం, పాము కాటు నివారణే లక్ష్యంగా పని చేశాం. మేం చేపట్టిన చర్యలు ఫలించి గిరి నాగుల్ని చంపడం చాలా వరకూ తగ్గిపోయింది. ప్రస్తుతం వాటి గూళ్లు, వాటి సంతతి పరిరక్షణ కోసం చర్యలు చేపడుతున్నాం. – కంఠిమహంతి మూర్తి, అధ్యక్షుడు, తూర్పు కనుమల వైల్డ్ సొసైటీ -
గిరిజన యువకుడిపై చిరుత దాడి
ఖానాపూర్: నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలోని అక్టోనిమాడ గ్రామ శివారులో దారుగు ఒర్రె ప్రాంతంలో గిరిజన యువకుడిపై శనివారం చిరుత దాడి చేసింది. గ్రామానికి చెందిన ఆత్రం సంతోష్ గ్రామశివారులోని కంది చేనుకు కాపలా కోసం శనివారం వెళ్లి ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో తిరిగి వస్తున్నాడు. మార్గ మధ్యంలో ఒక్కసారిగా అతనిపై చిరుత దాడిచేసింది. దీన్ని గమనించిన గిరిజనులు కేకలు వేయడంతో చిరుత పారిపోయింది. గాయపడిన సంతోష్‌ను పెంబి పీహెచ్‌సీకి తరలించారు. పారిపోయిన చిరుత ఒర్రె గట్టు గుహలు ఉన్న నెమలి చెట్టు తొర్రలో నక్కింది. గమనించిన స్థానికులు అరవడంతో అక్కడి నుంచి పారిపోయి ముళ్ల పొదలపై రోజంతా గడిపింది. చిరుతను పట్టుకునేందుకు అటవీ, వైల్డ్ లైఫ్ అధికారులు రాకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వేటగాళ్ల ఉచ్చుకు వన్యప్రాణి మృతి
వేటగాళ్ల ఉచ్చుకు ఒక దుప్పి, నాలుగు గేదెలు మృత్యువాడపడ్డాయి. గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఎర్రగుంట గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో వేటగాళ్లు వన్యప్రాణుల కోసం విద్యుత్ తీగలలో ఉచ్చు పెట్టారు. వాటికి చిక్కుకుని దుప్పి, నాలుగు గేదెలు ప్రాణాలు కోల్పోయాయి. ఆదివారం ఉదయం ఇది గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. -
పురుగుల మందు ప్రభావంతో జింక మృతి
పొలానికి వేసిన పురుగుల మందులు ఓ జింక ప్రాణాన్ని బలితీసుకున్నాయి. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం నక్కలదిన్నె, ఆర్.నాగులవరం గ్రామాల మధ్య పొలంలో జింక మృతిచెంది ఉండగా బుధవారం స్థానిక రైతులు గుర్తించారు. అటవీ అధికారులు వచ్చి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. రైతులు పొలానికి విషపు గుళికలు చల్లడంతో ఆ గడ్డి తిని, అక్కడి నీరు తాగడం వల్ల మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. -
రూ.60 లక్షల ఎర్రచందనం స్వాధీనం
ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు అటవీ అధికరులు జరుపుతున్న కూంబింగ్‌లో ఇప్పటివరకు రూ. 60 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా చంద్రిగిరి మండలంలోని నాగయ్యగారి పల్లెలో మంగళవారం కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అక్రమంగా ఎర్ర చందనం తరలించడానికి ప్రయత్నిస్తున్న 11 మంది ‘ఎర్ర’ కూలీలను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 60 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలతో పాటు 2టాటా సుమోలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అధికారులు కూంబింగ్‌ను కొనసాగిస్తున్నారు.