breaking news
Visakhapatnam Urban Development Authority
-
విశాఖపట్నం విజన్
విశాఖ నగరం మూడు వైపులా విస్తరిస్తోంది.అభివృద్ధి పథంలో శరవేగంగా దూసుకుపోతోంది. వలసలతో రోజురోజుకు జనాభా పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలతోపాటు అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా విశాఖ మహా ప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎంఆర్డీఏ) మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. మరోవైపు నగరం ఆర్థికంగా, సామాజికంగా ఎలా ఎదగాలనే అంశంపైనా మాస్టర్ ప్లాన్‌కి అనుబంధంగా పర్స్పెక్టివ్ ప్లాన్‌కి తుదిమెరుగులు దిద్దుతోంది. సాక్షి, విశాఖపట్నం: వీఎంఆర్డీఏ పరిధిలో ప్రస్తుతం 46 మండలాలు, 1,312 గ్రామాలున్నాయి. మాస్టర్‌ప్లాన్ రూపొందించేందుకు విశాఖపట్నంలోని 5 వర్గాలు, 45 రెవెన్యూ, 55 మత్స్యకార గ్రామాలు, 13 వార్డులను పరిగణనలోకి తీసుకొని.. సలహాలు, సూచనలు ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా వివరాలు సేకరించారు. అలాగే విజయనగరం జిల్లాలోని 48 రెవెన్యూ, 19 మత్స్యకార గ్రామాలు, 5 వార్డులు, రెండు వర్గాల ప్రజల అభిప్రాయాలతోనూ, శ్రీకాకుళం జిల్లాలోని 32 రెవెన్యూ, 41 మత్స్యకార గ్రామాలు, 9 వార్డులు, రెండు వర్గాల అభిప్రాయాలతో రూపొందించారు. మొత్తం మూడు విభాగాల్లో విజన్‌ని ప్రాథమికంగా సిద్ధం చేశారు. ఆర్థిక, ఉపాధి, జనాభా అవకాశాలపై ప్రధానంగా దృష్టిసారించారు. 12.5 మిలియన్ల జనాభాను అంచనా వేస్తూ ప్రణాళిక రూపొందించారు. మొత్తం ఆదాయంలో పారిశ్రామిక రంగం 40 శాతం వాటా, సేవారంగం 50 శాతం, వ్యవసాయ రంగం వాటా 10 శాతంగా ఉండేలా అంచనాలు వేశారు. అదే విధంగా ఉద్యోగ, ఉపాధి కల్పనలో పారిశ్రామిక రంగంలో 28 శాతం, సేవా రంగంలో 45, వ్యవసాయ రంగంలో 27 శాతం ఉండేలా అంచనాలు రూపొందించారు. మొత్తం ఉద్యోగుల సంఖ్య 19 లక్షల నుంచి 56 లక్షలకు పెరుగుతుందని అంచనా వేశారు. మొత్తంగా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై వీఎంఆర్డీఏ విజన్ రూపొందించింది. మూడో మాస్టర్‌ప్లాన్ ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించేందుకు గత 35 సంవత్సరాలుగా వుడా మాస్టర్ ప్లాన్స్ రూపొందించింది. మొదటిసారిగా 1989 నుంచి 2001 వరకూ 1721 చ.కి.మీ విస్తీర్ణంలో మాస్టర్ ప్లాన్ అభివృద్ధి చేసింది. రెండోసారి 2006 నుంచి 2021 వరకూ 1,721 చ.కి.మీ విస్తీర్ణంలో మాస్టర్ ప్లాన్ చేశారు. ఇప్పుడు నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో 6,501.65 చ.కి.మీ విస్తీర్ణంలో 2041 వరకూ మాస్టర్ ప్లాన్ రూపుదిద్దుకుంటోంది. మొత్తంగా మాస్టర్ ప్లాన్‌ను 3 దశల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏఏ ప్రాంతాల్లో.. ఎలాంటి అభివృద్ధి..? మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా.. ఆ ప్రాంత భౌగోళిక స్థితిగతులను అనుసరించి విభిన్న కోణాల్లో అభివృద్ధి చెయ్యాలని మాస్టర్‌ప్లాన్‌లో వీఎంఆర్డీఏ సిద్ధమవుతోంది. వాటిని ఓసారి పరిశీలిస్తే... ఆరు దశల్లో పెర్స్పెక్టివ్ ప్లాన్ మాస్టర్ ప్లాన్‌కి అనుబంధంగా పర్స్పెక్టివ్ ప్లాన్‌ను వీఎంఆర్డీఏ రూపొందిస్తోంది. ఫీల్డ్ సర్వేలు, ట్రాఫిక్ సర్వేలు, బేజ్ మ్యాప్, అందుబాటులో ఉన్న భూ వినియోగం, వ్యూహాత్మక ప్రణాళిక, జోనల్ డెవలప్మెంట్ ప్లాన్లు.. ఇలా ఆరు దశల్లో 2051–పెర్స్పెక్టివ్ ప్లాన్‌పైనా కసరత్తులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ముసాయిదాపై ప్రాథమిక సమీక్షను స్టేక్హోల్డర్లతో వీఎంఆర్డీఏ ప్రతినెలా నిర్వహిస్తోంది. 46 మండలాలు.. 1,312 గ్రామాలు.. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తరించిన వీఎంఆర్డీఏ.. ఆ మేరకు ప్రణాళిక తయారు చేసింది. 2041 నాటికి జనాభా ఎంత పెరుగుతుంది. ఆర్థిక ప్రగతి ఎలా ఉండబోతుంది.? ఉద్యోగ కల్పన, ఏ ఏ అంశాలపై ప్రధానంగా దృష్టిసారించాలనే విషయాల్ని క్రోడీకరించారు. భోగాపురం విమానాశ్రయం నుంచి అచ్యుతాపురం పారిశ్రామిక కారిడార్ వరకూ ట్రాన్సిస్ట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్–టీఓడీ కారిడార్(రవాణా ఆధారిత అభివృద్ధి వ్యవస్థ) ఏర్పాటు చెయ్యనున్నారు. మెట్రో కారిడార్ వెంబడి ఆర్థిక అభివృద్ధి చెందేలా కారిడార్ ఏర్పాటు విజయనగరం, అనకాపల్లి, నక్కపల్లి, భీమిలి ప్రాంతాలు గణనీయంగా విస్తరించనున్న నేపథ్యంలో శాటిలైట్ టౌన్‌షిప్‌లు విస్తరణ. ఈ టౌన్‌షిప్‌లను అనుసంధానం చేస్తూ బీఆర్టీఎస్ కారిడార్లు ఏర్పాటు. ఏడు ప్రాంతాల్లో రవాణా స్టేషన్లు నిర్మాణం. అరకులోయ, బుద్ధిస్ట్ సర్క్యూట్, హిందూ దేవాలయాల సర్క్యూట్, బీచ్, కోస్టల్ టూరిజం, ఎకో టూరిజం అభివృద్ధి చేస్తూ పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు. సహజ సంపద, వ్యవసాయ భూముల పరిరక్షణ. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక. జోన్ల వారీగా వ్యూహాత్మక ప్రణాళిక ఎన్ఏడీ జంక్షన్ నుంచి పెందుర్తి వరకు.. చివరి వరకూ బీఆర్టీఎస్ కనెక్టివిటీ రహదారుల అభివృద్ధి మేఘాద్రి రిజర్వాయర్ ప్రాంతాన్ని ఆహ్లాదకరమైన పార్కు స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన ప్రాంతాభివృద్ధి, ఎంపిక చేసిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన గాజువాక–స్టీల్‌ప్లాంట్ పరిసరాలు నగర విస్తరణకు ప్రణాళికలు అంతర్గత రహదారుల విస్తరణ మెట్రో, సిటీ బస్సులతో నగర అంతర్గత రవాణా వ్యవస్థని అచ్యుతాపురం వరకూ మెరుగుపరచడం ఆటోనగర్, దువ్వాడ రైల్వే స్టేషన్ పరిసరాల్లో విభిన్న తరహా అభివృద్ధికి ప్రణాళికలు ఎన్‌హెచ్–16లో పాదచారుల రక్షణ వ్యవస్థకు ప్రణాళికలు భీమిలి పరిసరాల్లో.. జీవీఎంసీతో కలిసి బీచ్ రోడ్డు అభివృద్ధి హెరిటేజ్ ప్రాంతంతో పాటు పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ఫిషింగ్ హార్బర్ డెవలప్మెంట్ విశాఖపట్నం–విజయనగరం–భోగాపురం వరకూ రహదారుల అనుసంధానం భోగాపురం విమానాశ్రయం వరకూ టూరిజం అభివృద్ధి అనకాపల్లి పరిసరాలు నగర విస్తరణకు వ్యూహాత్మక ప్రణాళికలు విశాఖపట్నం నుంచి అనకాపల్లి, అచ్యుతాపురం ఇండ్రస్టియల్ ప్రాంతం వరకూ బస్ ఆధారిత రవాణా వ్యవస్థ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు బైపాస్ రహదారులు అనకాపల్లి టౌన్ ప్రధాన వీధిని పాదచారులకు అనుగుణంగా మార్పు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రాంతాలకు రహదారుల సౌకర్యం విస్తరించడం. మధురవాడ పరిసరాలు నగర విస్తరణకు ప్రణాళికలు మెట్రో రైలు మార్గం ఐటీ హిల్స్ పరిసరాల్ని విభిన్న అవసరాలకు అనుగుణంగా సెజ్‌గా మార్పు పరిసర ప్రాంతాల్లో సామాజికాభివృద్ధి పోర్టు ఏరియా పరిసరాలు మెట్రో, సిటీ బస్సులతో రవాణా వ్యవస్థ మెరుగు బీఆర్టీఎస్ కారిడార్ అభివృద్ధి యారాడ, సింహాచలం ప్రాంతాల్లో ఆక్రమణలకు చెక్ చెప్పడం పెదవాల్తేరు, చినవాల్తేరు పరిసరాలు ప్రాంతాభివృద్ధికి ప్రణాళికలు మెట్రో, సిటీ బస్సు సౌకర్యాలు స్మార్ట్‌సిటీ, ప్రాంత ఆధారిత అభివృద్ధి ప్రాజెక్టుల అమలు బీచ్‌ఫ్రంట్ రీ డెవలప్మెంట్ దసపల్లా హిల్స్ పరిసరాలు ఆయా ప్రాంతాల అభివృద్ధి హెరిటేజ్ ఏరియా సంరక్షణ, పరిసరాల అభివృద్ధి మెట్రో, సిటీ బస్సులతో కనెక్టివిటీ స్మార్ట్‌సిటీ, ప్రాంత ఆధారిత అభివృద్ధి ప్రాజెక్టుల అమలు మార్చి నాటికి మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ వీఎంఆర్డీఏ పరిధిలో నివసిస్తున్న ప్రజలకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరి్ధష్ట ప్రణాళిక రూపొందిస్తున్నాం. దీనికి సంబంధించిన డేటా కలెక్షన్ పూర్తయింది. వచ్చిన వివరాలను పరిశీలన చేస్తున్నాం. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్‌ని మార్చి నెలాఖరునాటికి సిద్ధం చేస్తాం. విశాఖ నగరానికి సమాన పోలికలున్న కొచ్చిన్, చెన్నై, సూరత్, ముంబై నగరాల్ని అధ్యయనం చేసేందుకు సిద్ధమవుతున్నాం. ఈనెలలో కొచ్చిన్, చెన్నై నగరాలు, వచ్చే నెలలో సూరత్, ముంబై నగరాలకు మా బృందాలు వెళ్తున్నాయి. అక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే అంశాలపై నివేదిక సిద్ధం చేసి.. ఆ తరహా పరిస్థితులు వీఎంఆర్డీఏ పరిధిలోని ప్రజలకు ఎదురవకుండా సమగ్ర మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. –పి.కోటేశ్వరరావు, వీఎంఆర్డీఏ కమిషనర్ -
‘చంద్రబాబు ఆ మాట ఉత్తరాంధ్ర ప్రజలతో చెప్పిస్తారా?’
సాక్షి, విశాఖపట్నం: అమరావతికి మద్దతుగా రాష్ట్రమంతటా తిరుగుతానన్న ప్రతిపక్షనేత చంద్రబాబు ఇప్పుడు ఎందుకు తిరగడం లేదని వుడా మాజీ ఛైర్మన్ ఎస్ఏ రెహమాన్ ప్రశ్నించారు. అంధ్రప్రదేశ్‌ను సన్‌రైజ్ స్టేట్ అన్నారని సన్ అంటే అన కొడుకు అన్నది ఆయన ఆలోచనని ఎద్దేవా చేశారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాజధాని విషయంలో చంద్రబాబు అవలంభిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చంద్రబాబుకు అన్నీ తెలుసు. కానీ దేన్నీ సవ్యంగా తీసుకెళ్లరు. ఆయన మనసులో ఉండేది ఒకటి. పైకి చెప్పేది మరొకటి. విశాఖలో రాజధాని కావాలని ఎవరడిగారని బాబు ప్రశ్నిస్తున్నారు. మరి అమరావతిని రాజధాని చేయాలని మిమ్మల్ని ఎవరడిగారు? విశాఖ రాజధాని కావాలని 1953లోనే చట్టసభ తీర్మానం చేసింది. అది ఎవరికీ తెలయదులే అని బాబు అనుకున్నారు. చంద్రబాబు ఉత్తరాంధ్రకు వచ్చి రాజధాని వద్దని ప్రజలతో అనిపించే దమ్ముందా? యూటర్న్ చంద్రబాబు ప్రధాని మోదీ మీద విషపోరాటం చేసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాకుండా చేశారు. చంద్రబాబు 23 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేరదీసి పదవులిచ్చిన మాట వాస్తవం. కానీ ఆయనే టీడీపీ ఎమ్మెల్సీలను సీఎం వైఎస్ జగన్ కొనబోయారని ఆరోపించడం హాస్యాస్పదం. మీరు ఐదేళ్లు ఓపిక పట్టండి ప్రజలే తీర్పు ఇస్తారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే, టీడీపీ సిటీ అధ్యక్షుడు వాసుపల్లి నగర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే అమరావతని రేసు కారుతో, విశాఖను ఎడ్లబండితో పోల్చారు. అలా పోల్చడం దారుణం. గాడిదలు లొట్టిపిట్టలతో పిచ్చి ఉద్యమాలు చేయడం మానాలి. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అమరావతే రాజధాని అనే నినాదంతో పోటీ చేయాలి. ఇదే రిఫరెండంగా తీసుకుందాం’అని రెహమాన్ సవాల్ విసిరారు. -
కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యానికి ఇక చెక్
పార్కుల్లో సిబ్బందికి గుర్తింపు కార్డులు పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి పెందుర్తి, సబ్బవరం ప్రాంతాల్లో ఎడ్యుకేషన్ హబ్ జూన్ నాటికి చిల్డ్రన్ పార్క్ సిద్ధం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వుడా వీసీ బాబూరావునాయుడు విశాఖపట్నం : విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వుడా) పరిధిలో నడుస్తున్న పార్కుల్లో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యానికి చెక్ పెట్టాలని వుడా భావిస్తోంది. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో విధుల్లో లేనివారికి సైతం వేతనాలు చెల్లిస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పలు సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. వుడా ఆస్తుల పరిరక్షణకు, కొత్త ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆ వివరాలను వుడా వీసీ బాబురావు నాయుడు ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. సాక్షి : వుడా ఆధ్వర్యంలో ఉన్న పార్కులు అధ్వానంగా ఉన్నాయి. వాటిని మెరుగుపరిచే ఏర్పాట్లేమైనా జరుగుతున్నాయా? వీసీ : పార్కులను సంరక్షించే బాధ్యత అందరిదీ. అక్కడి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంలో సందర్శకుల సహకారం కూడా అవసరం. మా వైపు నుంచి కూడా చర్యలు చేపడుతున్నాం. పాండురంగాపురం పార్కును పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్నాం. తర్వాత అన్ని పార్కులను అదే విధంగా చేయాలనుకుంటున్నాం. సాక్షి : పర్యవేక్షణ లేకపోవడం వల్ల పార్కుల్లో సిబ్బంది విధుల్లో లేకపోయినా వేతనాలు తీసుకుంటున్నారనే ఆరోపణలపై దృష్టి సారిస్తున్నారా? వీసీ : ఈ విషయం నా దృష్టికి కూడా వచ్చింది. విధులకు హాజరు కాకుండానే వేతనాలు తీసుకుంటున్నారనే అనుమానాలున్నాయి. అవకతవకలను అరికట్టడానికి వుడా పార్కుకు ప్రత్యేకాధికారిని నియమించాం. ఆయన పర్యవేక్షిస్తున్నారు. అయితే ప్రస్తుతం పర్యవేక్షణ లోపం కనిపిస్తోంది. సరిదిద్దేందుకు సాక్షి : సిబ్బంది అవకతవకలకు పాల్పడకుండా ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? వీసీ : ఇప్పటివరకు పార్కుల్లో సిబ్బంది హాజరుకు సంబంధించి ఎలాంటి పటిష్ట ఏర్పాటు లేదు. ఇకపై ఆ పరిస్థితి కొనసాగకుండా సిబ్బందికి గుర్తింపుకార్డులు ఇవ్వనున్నాం. అవసరమైతే బయోమెట్రిక్, లేదా కార్డుకే బార్ కోడింగ్ ఇచ్చి స్కాన్ చేసేలా ఏర్పాట్లు చేయాలనుకుంటున్నాం. సైరన్ విధానాన్ని తీసుకువస్తే ఎలా ఉంటుదని కూడా ఆలోచిస్తున్నాం. అన్నిటికంటే ముందు అసలు ఏ పార్కులో ఎంత మంది పనిచేస్తున్నారనే వివరాలు సేకరిస్తున్నాం. సాక్షి : ప్రాజెక్టులు పెండింగ్‌లో పడిపోతున్నట్లున్నాయి? వీసీ : కొన్ని ప్రాజెక్టులు సాంకేతిక కారణాల వల్ల అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. వుడా చిల్డ్రన్ పార్కు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ జపాన్ చైర్ల వంటివి వేయడం, ఇతర హై క్వాలిటీ పరికరాలు అమర్చంలో ఆలస్యం జరుగుతోంది. సెంట్రల్ పార్కు పనులు కూడా అంతే. ఫౌంటెన్ నాణ్యత విషయంలో రాజీపడలేకపోతున్నాం. మెరుగ్గా ఉండాలనే సమయం తీసుకుంటున్నాం. ఈ రెండూ జూన్ కల్లా అందుబాటులోకి తీసుకువస్తాం. సాక్షి : షాపింగ్ కాంప్లెక్స్‌ల పరిస్థితి? వీసీ : సీతమ్మధారలో రూ.8.30 కోట్లతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. దీనిలో 32 షాపులు, 8 కార్యాలయాలు, 4 షోరూమ్‌లు వస్తాయి. సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలనుకుంటున్నాం. ఆయన ఎప్పుడు అవకాశమిస్తే అప్పుడు అందుబాటులోకి వస్తుంది. ఎంవీపీలో రూ.10.30 కోట్లతో నిర్మిస్తున్న కాంప్లెక్స్ పూర్తి కావడానికి మరికొంత సమయం పడుతుంది. సాక్షి : కొత్త వెంచర్ల ప్రగతి ఎలా ఉంది? వీసీ: దాకమర్రిలో ప్రైవేటు భాగస్వామ్యంతో వెంచర్ వేశాం. దీనిలో కొన్ని వేలంలో, కొన్ని లాటరీలో కేటాయిస్తాం. దీనివల్ల మధ్యతరగతి వారికి దక్కే అవకాశం వస్తుంది. హరిత వెంచర్ సిద్ధంగా ఉంది. పెందుర్తి, సబ్బవరం పరిసర ప్రాంతాలను కలుపుతూ ఎడ్యుకేషన్ హబ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం. సాక్షి : భూ ఆక్రమణలను అడ్డుకునే చర్యలు..? వీసీ : వుడా స్థలాలపై సర్వే చేయించాం. ఇప్పటికే 250 అక్రమ లే అవుట్లను గుర్తించాం. వాటిలో కొన్ని ధ్వంసం చేశాం. అందరికీ నోటీసులు ఇచ్చాం. జియోటాగింగ్ విధానం తీసుకువస్తున్నాం. స్థలాల చుట్టూ రక్షణ కంచెలు ఏర్పాటు చేస్తాం.