breaking news
virtual universe
-
Metaverse: కనీవినీ ఎరుగని రీతిలో సామూహిక అత్యాచారం
ప్రపంచంలో ఏదో ఒక మూల.. ప్రతీ నిమిషానికి మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఒంటరి మహిళలు మృగాల చేతిలో చితికిపోతున్నారు. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన.. బహుశా ఇది వరకు విని, చదివి ఉండరు. వాస్తవిక ప్రపంచంలోనే కాదు.. వర్చువల్ ప్రపంచంలోనూ ఆడవాళ్ల భద్రతపై అనుమానాల్ని పెంచే ఘటన ఇది. పైగా అవి మరింత ఘోరంగా.. ఆందోళనకరంగా ఉంటాయనే విషయాన్ని రుజువు చేసింది ఇది. బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ(43).. ఫేస్బుక్ మెటావర్స్ ‘హోరిజోన్ వెన్యూస్’పై సంచలన ఆరోపణలకు దిగింది. ఆ వేదికపై తాను గ్యాంగ్‌రేప్‌నకు గురయ్యానని ఆమె ఫిర్యాదు చేసింది. వర్చువల్ వరల్డ్‌లోకి జాయిన్ అయిన నిమిషానికే.. తనను ముగ్గురు-నలుగురు (మేల్ అవతార్స్) చుట్టుముట్టి బలాత్కారం చేశారని, ఆపై ఆ అఘాయిత్యాన్ని ఫొటోలు సైతం తీశారని ఆమె వాపోయింది. ఆర్తనాదాలు. అరణ్యరోదనే! అఘాయిత్యం జరుగుతున్న టైంలో తను గట్టిగట్టిగా అరిచినా.. స్పందన కరువైందని ఆమె వాపోయింది. ఆ సమయంలో చాలామంది లాగిన్‌లో ఉన్నారు. కానీ, నా అరుపులను ఎవరూ పట్టించుకోలేదు. పైగా నా అవతార్ మీద ఘాతుకానికి పాల్పడ్డ మగ అవతార్లు మృగాళ్లా ప్రవర్తించాయి. దుర్భాషలాడాయి.. నాపై దాడి చేశాయి. దుస్తులు చించేశాయి. ఏం జరుగుతుందో అర్థం కావడానికే నాకు కొన్ని నిమిషాలు పట్టింది. ఆ భయంకరమైన అనుభవంతో వెంటనే వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ తీసేసి, లాగౌట్ అయ్యానని ఆమె పేర్కొంది. ఇక ఘటనపై తన అనుభవాన్ని ఓ బ్లాగ్‌లో పంచుకున్న బాధితురాలు. వర్చువల్ ఘటనను అనవసరంగా సీన్ చేస్తోందని కొందరు అంటున్నారు. కానీ, వాస్తవాల నుంచి వర్చువల్ అనుభవాలు వేరు చేయలేవని ఆమె అంటోంది. అందుకే వర్చువల్ ప్రపంచంలోనూ అనుభవాలకు 'వాస్తవికత' ఉంటుందని పేర్కొంది. వర్చువల్ రియాలిటీలో ఎక్కువ మంది ఉన్నప్పుడు.. అక్కడ వాస్తవికతకు ఆస్కారం ఉంటుందని గుర్తుంచుకోవాలని, తనకు ఎదురైన అనుభవం వర్చువల్ ప్రపంచంలోనూ మరెవరికీ ఎదురు కాకూడదని ఆమె అంటోంది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై స్పందించని ఫేస్బుక్ మెటావర్స్.. భద్రత విషయంలో మార్పులు చేస్తున్నట్లు ఆ మధ్య ఒక ప్రకటనతోనే సరిపెట్టింది. సంబంధిత వార్త: పక్కన లేకున్నా.. ‘నన్ను బలవంతంగా వాటేసుకుని’!! -
వర్చువల్ వరం!
మనకు తెలియని సరికొత్త ప్రపంచంలోకి, ఎప్పుడూ చూడని ప్రదేశంలోకి తీసుకెళ్లి ప్రేక్షకులను నోరెళ్లబెట్టేలా చేయడం సినిమాకు కొత్త కాదు. ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో సినిమా తీసే విధానం మారుతూ వస్తోంది. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో ఒక్క యాక్టరే ఇద్దరుగా కనబడితే సంబరపడిపోయాం. ఆ తర్వాత గ్రాఫిక్స్ మాయాజాలం చూశాం. 3డీ సినిమాలు వచ్చాయి. లైవ్ యాక్షన్ టెక్నాలజీతో సినిమాలు వచ్చాయి. మారుతున్న సాంకేతికత, ప్రేక్షకుడి అభిరుచి – సినిమాను కొత్త విధానాలు అనుసరించేలా చేస్తూ వస్తోంది. ప్రస్తుతం ‘వర్చువల్ ప్రొడక్షన్ ఫిలిం మేకింగ్ టెక్నిక్’తో మన దేశంలో సినిమా రూపొందనుంది. కరోనా వల్ల ఏర్పడ్డ పరిస్థితుల్లో ఈ టెక్నిక్కే భవిష్యత్తు కాబోతోందా? వేచి చూడాలి. ఇండియాలో ఇదే తొలిసారి! మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా తెరకెక్కబోయే కొత్త చిత్రాన్ని పూర్తిగా ‘వర్చువల్ ప్రొడక్షన్’ పద్ధతిలో చిత్రీకరించనున్నట్టు ప్రకటించారు. ఈ పద్ధతిలో తెరకెక్కనున్న పూర్తి స్థాయి తొలి భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రానికి కాన్సెప్ట్–డైరెక్షన్ గోకుల్ రాజ్ భాస్కర్. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని పృథ్వీరాజ్ నిర్మాణ సంస్థ పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్‌తో పాటు మ్యాజిక్ ఫ్రేమ్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. టైటిల్ ఇంకా ప్రకటించని ఈ చిత్రం 5 భాషల్లో (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ) విడుదల కానుంది. ‘‘సినిమాలు తెరకెక్కించడంలో ఇదో కొత్త చాప్టర్. పరిస్థితులు మారుతున్నప్పుడు, కొత్త ఛాలెంజ్‌లు ఎదురవుతున్నప్పుడు మనం కూడా కొత్త పద్ధతులను అనుసరించాలి. ఈ కథ త్వరగా మీ అందరికీ చెప్పాలనుంది’’ అని పేర్కొన్నారు పృథ్వీరాజ్. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఏంటీ వర్చువల్ ప్రొడక్షన్? నిజమైన లొకేషన్స్‌లో సినిమాను చిత్రీకరించలేనప్పుడు గ్రీన్ మ్యాట్ (గ్రీన్ స్క్రీన్) ఉపయోగించి చిత్రీకరణ జరుపుతారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా అక్కడే (నిజమైన లొకేషన్లో) చిత్రీకరించినట్టు మారుస్తారు. ప్రస్తుతం సినిమాల్లో కొన్ని సన్నివేశాలను ఇలానే తీస్తున్నారు. దీనితో వచ్చిన చిక్కేంటి? అంటే పోస్ట్ ప్రొడక్షన్ అయ్యే వరకు ఆ సన్నివేశం ఎలా వస్తుందో ఎవ్వరికీ పక్కాగా తెలియదు. సరిగ్గా కుదరకపోతే ప్రేక్షకుడి పెదవి విరుపులు వినాల్సి వస్తుంది. వర్చువల్ ప్రొడక్షన్ విషయానికి వస్తే.. సినిమా మొత్తం స్టూడియోలోనే పూర్తి చేయొచ్చు. ఇది పెద్ద ప్లస్ పాయింట్. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది పెద్ద ప్లస్ పాయింట్. లొకేషన్స్ కోసం అటూ ఇటూ తిరిగే పని పూర్తిగా తగ్గిపోతుంది. నటీనటులందరూ గ్రీన్ మ్యాట్ ముందే నటిస్తారు. 3డీ బ్యాక్‌గ్రౌండ్ వల్ల నిజమైన లొకేషన్లో ఉన్నభావన కలుగుతుంది. ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడే సీన్ ఎలా ఉండబోతోందో దర్శకుడు మానిటర్ లో చూసుకోవచ్చు. పోస్ట్ ప్రొడక్షన్‌తో పెద్దగా పని ఉండదు. ఈ టెక్నాలజీ వల్ల వినూత్న కథలకు మరింత ఆస్కారముంటుంది. పండోరా గ్రహం టెక్నిక్ అదే ఆల్రెడీ హాలీవుడ్లో ‘వర్చువల్ ప్రొడక్షన్ ఫిలిం మేకింగ్ టెక్నిక్’తో సినిమాలు తెరకెక్కుతున్నాయి కూడా. జేమ్స్ కామెరూన్ ఈ టెక్నాలజీని ఉపయోగించే ‘అవతార్’ని (2019) సృష్టించగలిగారు. ఈ సినిమాను మొత్తం వర్చువల్ ప్రొడక్షన్ ఉపయోగించే పూర్తి చేశారు. ఈ చిత్ర కథాంశం ‘పండోరా’ అనే గ్రహంలో జరుగుతుంది. అదంతా ఊహాజనిత ప్రదేశం. దానికి ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడింది. ప్రస్తుతం ‘అవతార్’ సీక్వెల్స్ కూడా ఈ టెక్నాలజీతో పాటు మరింత సాంకేతికతతో తెరకెక్కుతున్నాయి. ఇదే టెక్నాలజీతో ‘లయన్ కింగ్, రెడ్ ప్లేయర్ వన్’ వంటి చిత్రాలు తెరకెక్కాయి. ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్స్ జరగడమే పూర్తిగా తగ్గిపోయింది. పరిస్థితులు ఎప్పుడు మామూలుగా మారుతాయో తెలియదు. మళ్లీ ఎప్పటిలా సినిమా చిత్రీకరణలు చేయగలమా? లేదా? అనే చిన్న సందేహం చాలామందిలో ఉంది. ఇలాంటి సందర్భాల్లో ఎదురయ్యే ఛాలెంజ్‌లను ఎదుర్కొని సినిమాలు తీయడానికి ఇలాంటి కొత్త పద్ధతులను అనుసరించాల్సి ఉంటుంది. ఈ కొత్త పద్ధతులు ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని ఇవ్వలేకపోతే మాత్రం ప్రయత్నం వృథా అవుతుంది. అందుకే ప్రేక్షకుడిని మెప్పించేలా సినిమా ఉండాలి.. అలాగే నిర్మాతకు నాలుగు డబ్బులు మిగలాలి. అప్పుడే ‘వర్చువల్’లాంటి టెక్నాలజీలు వరం అవుతాయి. -
వర్చువల్ విశ్వాన్ని సృష్టించిన శాస్త్రవేత్తలు
జెనివా: అంతుచిక్కని కృష్ణ పదార్థాన్ని(డార్క్ మ్యాటర్) ఛేదించెందుకు శాస్త్రవ్తేత్తలు వర్చువల్ విశ్వాన్ని సృష్టించారు. దీనిని 2020లో ప్రయోగించనున్న ఎక్యూలిడ్ ఉపగ్రహంలో అమర్చనున్నారు. పీకేడీజీఆర్ఏవి3 కోడ్‌ను ఉపయోగించి 80 గంటల్లో దీనిని సృష్టించామని పరిశోధకులు తెలిపారు. విశ్వంలో 95శాతం కృష్ణ పదార్థం ఉందని దానిని శోధించడానికి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నామని వారు తెలిపారు. కృష్ణ పదార్థం ఇప్పటికీ అంతుచిక్కకుండా ఉందని యూజీహెచ్కు చెందిన ప్రొఫెసర్ రోమెన్ టెసియర్ తెలిపారు. ఎక్యూలిడ్ 1000 కోట్ల సంవత్సరాల నాటి పరిస్థితులను అంచనా వేయనుందని జోచిమ్ స్టడిల్ అన్నారు. ఎక్యూలిడ్ ఉపగ్రహం ద్వారా కృష్ణ పదార్థం వివరాలతో పాటు కొత్త కణాలు, విశ్వాల వివరాలను తెలుసుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.