breaking news
Vinay Sitapati
-
అమ్మ.. నాన్న.. ఓ ప్రేమకథ
మూడు రోజుల ‘హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్’ లో చివరి రోజు సెషన్లలో ప్రముఖంగా ఆకర్షించిన సెలబ్రిటీ షబానా ఆజ్మీ. ఆదివారం నాడు ఆమె తన తండ్రి, ప్రముఖ ఉర్దూ కవి కైఫీ ఆజ్మీ రాసిన కవితలను, పాటలను పాడి అలరించారు. అరవై ఎనిమిదేళ్ల వయసులో ఆమె గ్లామర్‌తోపాటు స్వరంలో తియ్యదనం ఆకట్టుకున్నాయి. తండ్రి కైఫీ జీవితాన్ని ‘కైఫీయత్’ పుస్తకంగా వెలువరించారు షబానా. ఆ పుస్తకం మీద చర్చతో పాటు, కైఫీ జీవితం మీద ఏర్పాటు చేసిన చర్చాగోష్టిలో పాల్గొనడానికి హైదరాబాద్‌కి వచ్చారు షబానా. ఆమె పుట్టింది కూడా హైదరాబాద్‌లోనే. షబానా తల్లి షౌకత్‌ది హైదరాబాద్. ఆమె కైఫీ రచనలకు అభిమాని. ఆయన హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఆయన దృష్టిలో పడడానికి ప్రయత్నించి మరీ తన ప్రేమను వ్యక్తం చేసినట్లు చెప్పారు షబానా. కైఫీ రక్తంతో రాసిన ప్రేమలేఖలను నమ్మవద్దని, అందులో వ్యక్తం చేసిన భావుకతలకు మురిసిపోవద్దని షౌకత్‌ను ఆమె తండ్రి (షబానా తాతగారు) హెచ్చరించినట్లు కూడా చెప్పారు షబానా. అయినప్పటికీ పట్టుపట్టి మరీ అతడినే పెళ్లి చేసుకున్న వైనాన్ని వివరించారు, పెళ్లి తర్వాత పెద్దగా సంపాదన లేని కైఫీ ఎనిమిది కుటుంబాలకు కలిపి ఒకటే టాయిలెట్ ఉండే ఇంట్లో కాపురం పెట్టారు. డబ్బు లేని బాల్యమే అయినా అందమైన జీవితాన్ని గడిపిన రోజులవి అన్నారామె. తండ్రి ఫొటో పేపర్లో ప్రచురించినప్పుడు ఫ్రెండ్స్ ప్రశంసలను ఎంజాయ్ చేయడం వంటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారామె.కైఫీ చిన్నప్పటి నుంచి పండక్కి కొత్త దుస్తులు వేసుకోవడాన్ని వ్యతిరేకించేవారని, రైతు బిడ్డ కొత్త దుస్తుల కోసం ఆరాటపడకూడదని చెప్పేవారని ఆమె తండ్రి చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. పదకొండేళ్ల వయసులో తండ్రి రాసిన కవితను, ఆయన తండ్రి విశ్వసించకపోవడాన్ని, మళ్లీ రాసి చూపించిన తర్వాత నమ్మిన విషయాలను పంచుకున్నారు. ‘‘మా అమ్మ చాలా ప్రాక్టికల్‌గా ఉండేది. వారి దాంపత్యంలో ఎంత ప్రేమ ఉండేదో అంతటి గొడవలు కూడా ఉండేవి. మా నాన్న చాలా నైస్‌గా చక్కదిద్దేవారు. వాళ్ల కాపురంలో సమానత్వం కోసం ప్రయత్నించడం జరగలేదు, వారి ఆచరణలో ఉండేది. నాన్న రాసిన ‘నా వెనుక నడిచే అనుచరురాలు కాదు... నువ్వు నా పక్కన నడిచే సహచరిగా ఉండాలి’ అనే కవిత మా అమ్మను ఆయన ప్రేమలో పడేసింది. అది చివరి వరకు వాళ్ల జీవితంలో కొనసాగింది. అది మా అమ్మానాన్నలకే కాదు, ప్రతి జంటకీ వర్తిస్తుంది. అన్వయించుకోగలిగితే ప్రేమబంధం ఎప్పటికీ సజీవంగా ఉంటుంది’ అన్నారు షబానా. సమాజంలో మత సంఘర్షణలు వాటికవిగా జరగవు. వాటి వెనుక కొన్ని ప్రయోజనాలుంటాయి. అవి ప్రేరేపించినప్పుడే మతకల్లోలాలు జరుగుతాయని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. ‘‘మీటూ ఉద్యమం చాలా గొప్ప సామాజికోద్యమం. పని ప్రదేశంలో మహిళలకు రక్షణ పూరిత వాతావరణం ఉండాలి. తమకు జరుగుతున్న అన్యాయం మీద గళమెత్తిన అమ్మాయిలకు సెల్యూట్’’ అని ప్రశంసించారు. ఇన్పుట్స్ : మంజీర, ఓ మధు -
పీవీ 'హాఫ్ లయన్'లో ఏముంది?
పీవీ నరసింహారావు జీవితంపై వినయ్ సీతాపతి వ్రాసిన హాఫ్ లయన్ పుస్తకం ఇప్పుడు వార్తల్లోకెక్కింది. పివి జీవితం గురించి సంచలనాత్మక విషయాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు రచయిత. ఇటీవలే ఈ పుస్తకావిష్కరణకోసం హైదరాబాద్ వచ్చిన వినయ్ సీతాపతితో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ .... పీవీ నరసింహారావు చనిపోయి పదేళ్లు దాటిపోయిన తరువాత ఆయనపై పుస్తకం వ్రాయాలని మీకు ఎందుకు అనిపించింది? రెండు ప్రధాన కారణాలున్నాయి. నేను సరళీకృత ఆర్ధిక విధానాల తరానికి చెందిన వాడిని. 1990 లో ముంబాయి లోని బంద్రాలో పిల్లలుగా ఉన్న మాకు పీవీ నరసింహారావు ఎవరో తెలియదు. కానీ ఆయన వల్ల కలిగిన అనేక మార్పులను మేము కళ్లారా చూశాం. మా నాన్నగారు పబ్లిక్ సెక్టర్ సంస్థ ను వదిలి ప్రైవేటు రంగానికి వెళ్లిపోయారు. మెక్‌డోనాల్డ్ ను అప్పుడే చూశాం. మౌలిక వసతులలో మార్పులు చూశాం. 1993 లో తొలి ప్రైవేటు ఎయిర్ లైనర్ ఆకాశంలోకి ఎగిరింది. ప్రతి భారతీయుడినీ ఆయన స్పృశించారు. అంతకు ముందుకన్నా జీవన స్థితిగతులు మెరుగయ్యాయి. ఈ కథను రాయాల్సిన అవసరం ఏర్పడింది. రెండేళ్ల క్రితం నేను ఒక హార్వర్డ్ ప్రొఫెసర్ వ్రాసిన డెంగ్ జియావో పింగ్ అండ్ ది ట్రాన్స్ ఫర్మేషన్ ఆఫ్ చైనా అన్న పుస్తకం చదివాను. చైనాను 80 వ దశకంలో డెంగ్ ఎలా మార్చాడో ఆ పుస్తకంలో వివరించారు. దాన్ని చదివిన తరువాత మన దేశం గురించి వ్రాయాల్సిన అవసరం ఉందని అనిపించింది. దేశాన్ని మార్చిన వ్యక్తి నరసింహారావు. అందుకే ఆయన గురించి వ్రాయాలని నిర్ణయించుకున్నాను. ఈ పుస్తకం కోసం ఎలాంటి పరిశోధనలు చేశారు? ఎవరెవరిని కలిశారు? ఆయనతో కలిసి మెలిసి సన్నిహితంగా ఉన్నవారిని కలవగలిగారా? పీవీకి చెందిన ఒరిజినల్ వ్రాతప్రతులు మీకు లభ్యం అయ్యాయా? నేను 110 కి పైగా ఇంటర్వ్యూలు చేశాను. మన్మోహన్ సింగ్, పీవీ కి అత్యంత సన్నిహితురాలైన కళ్యాణి శంకర్, ఆయన వ్యక్తిగత డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, పీవీ వంటవాడిగా దాదాపు వంద దేశాలు ఆయనతో పాటు తిరిగిన రాజయ్యలను కూడా కలిశాను. పీవీని వ్యతిరేకించిన మణిశంకర్ అయ్యర్, బ్యూరోక్రాట్ కె ఆర్ వేణుగోపాల్ లలను కూడా కలిశాను. ఈ పుస్తకంలో పీవీ గురించిన మంచి ఉంది. చెడు కూడా ఉంది. మనుషులందరిలోనూ మంచీ చెడూ ఉంటాయి. జవహర్లాల్ నెహ్రూ తరువాత సర్వోత్తమ ప్రధాని పీవీయే అని నా పుస్తకంలో వాదించాను. ఆయనకు సంబంధించిన రెండు వందలకు పైగా పుస్తకాలను చదివాను. ఆయన కుటుంబ సభ్యులు నాకు ఆయన పత్రాలన్నిటినీ నాకు ఎలాంటి షరతులు, ఆంక్షలు లేకుండా అందచేశారు. పీవీ నాగరికతల సంఘర్షణ వంటి పరిశోధనా పత్రాలపై తన నోట్స్ చాలా వివరంగా వ్రాసుకోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఆయన లేఖరు,, పత్రాలు, నోట్స్ అన్నీ నాకు లభించాయి. ఒక్క ఉదాహరణ చెప్పాలంటే ఆయన 1976 నుంచి 1996 వరకూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి పత్రమూ ఆయన చేతుల మీదుగానే వెళ్లింది. ప్రతి రోజూ సాయంత్రం ఆయన ఆ రోజు విశేషాలన్నిటినీ కంప్యూటర్ లో నమోదు చేసేవారు. ఒక రాజకీయ వ్యక్తి జీవిత చరిత్ర రాయడానికి కావలసిన సమాచారమంతా ఆయన అందించి వెళ్లారు. నేను ఇంటర్ వ్యూ చేసిన ప్రతి వ్యక్తికీ ఆయన చెప్పిన విషయాలను ఏ విధంగా పు్స్తకంలో పొందుపరచబోతున్నానో చెబుతూ ఈ మెయిల్స్ వ్రాశాను. అందుకే ఎన్నో వివాదాస్పద అంశాలున్నా ఎవరినైనా తప్పుగా ఉటంకించాననో, ఉదహరించాననో ఎవరూ చెప్పలేదు. సోనియా గాంధీకి సన్నిహితులైన వారిని ఇంటర్ వ్యూ చేయగలిగారా? జయరామ్ రమేశ్, సల్మాన్ ఖుర్షీద్, సతీశ్ శర్మలను ఇంటర్వ్యూ చేశాను. చాలా మంది ఇంటర్వ్యూలు ఇచ్చినా తమ పేర్లు బయటపెట్టవద్దని కోరారు. దానికి కారణాలు ఏమిటో చెప్పనవసరం లేదు. నేను వారి మాటను గౌరవించాను. పీవీ ఎలా ఉండేవారు. ఆయన గురించి చాలా మందే వ్రాశారు. ఆయన జీవితం, ఆయన భాషా పాండిత్యం, ఆయన ఆర్ధిక ఆలోచనలు, విదేశ వ్యవహారాల్లో ఆయన లోతు, ఆయన రాజకీయ చాణక్యం గురించి చాలానే సమాచారం ఉంది. కానీ మీ పుస్తకం చదివితే ఆయన ఒంటరిగా, నిస్సహాయుడిగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీరేమంటారు.? పీవీ నరసింహారావు వ్యక్తిత్వంలోని అతి ముఖ్యమైన అంశం ఆయనలోని ఒంటరి తనం. ఇది ఆయన బాల్యం నుంచే వచ్చిందని నాకు అనిపించింది. పదేళ్ల వయసు వచ్చేనాటికే ఆయనకు ఇష్టం లేని పెళ్లి జరిగింది. ఆయన చాలా తెలివైన విద్యార్థి కావడంతో తండ్రి వేరే చోట చదువుకునేందుకు పంపించారు. దీంతో ఆయన మిత్రులకు దూరమయ్యారు. ఆయనను పొరుగువారికి దత్తత ఇచ్చారు. ఈ మూడు పరిణామాల వల్ల ఆయనలో ఎనలేని ఒంటరి తనం చోటు చేసుకుంది. ఆయన పుస్తకాల పురుగులా మారారు. ఈ వ్యక్తిగత జీవితంలోని ఒంటరితనం ఆయనకు రాజకీయాల్లో ఆస్తిగా మారింది. ఆయన ఒంటరి వాడు కాబట్టే 1971 లో ఇందిరా గాంధీ ఆయనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా నియమించింది. ఇదే కారణం వల్ల సోనియా గాంధీ ఆయనను 1991 లో ప్రధానమంత్రి చేసింది. శరద్ పవార్, అర్జున్ సింగ్ లలాగా ఆయనకు తనదైన వర్గం లేదు. అందుకే ఆయన అందరికీ ఆమోదయోగ్యుడయ్యారు. ఒక రాజకీయ వేత్తగా ఆయన ప్రయాణం హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా ఎలా సాగింది? ఆయన తొలి దశలో సోషలిస్టు. ఆయనపై నెహ్రూ, రామానంద తీర్థల ప్రభావం ఉండేది. వారిద్దరూ కాంగ్రెస్ లో సోషలిస్టు భావాలు కలిగి ఉండేవారు. ఇందిరా గాంధీ ఆయనను ముఖ్యమంత్రిగా తొలగించిన తరువా ఆయన అమెరికాలో పర్యటిస్తారు. అప్పుడు ఆయనలో మార్పు వస్తుంది. అప్పటికీ ఆయన హృదయం సోషలిస్టు. కానీ మెదడు యథార్థవాదిగా ఉన్నాయి. మార్కెట్ శక్తుల వల్ల లాభాలున్నాయని కూడా ఆయన గ్రహించారు. సోవియత్ కి దూరంగా వెళ్లాలని ఆయన అప్పుడే నిర్ధారణకి వచ్చారు. మరో వైపు ఆయన రాజకీయ నైపుణ్యాలు కూడా వికాసం చెందుతూ వచ్చాయి. ఆయనది ఆకర్షణీయ వ్యక్తిత్వం కాదు. ప్రజలు ఆయనను పెద్దగా ప్రేమించలేదు. ఆయనకు పార్టీ పై పట్టు లేదు. పార్లమెంటులో మైనారిటీ. ఇంత బలహీన పరిస్థితుల్లో ఇన్ని సంస్కరణలు చేయగలిగిన వ్యక్తి ఇంకొకరు లేరు. డెంగ్ జియావో పింగ్ తో పోల్సి చూస్తే, ఇద్దరూ కోట్లాది మంది జీవితాలను మార్చారు. కానీ డెంగ్ కి పార్టీపై పూర్తి పట్టు ఉండేది. ఆయన నియంతృత్వ పాలన సాగించారు. పీవీకి ఇవేవీ లేవు. కానీ ఆయన స్వాతంత్ర్యానంతర కాలంలో నెహ్రూజీ తెచ్చిన మార్పును తేగలిగారు. నెహ్రూకి ప్రజాకర్షణ ఉండేది. పార్టీపై పట్టు ఉండేది. పార్లమెంటులో మెజారిటీ ఉండేది. పూర్తి బలం లేకపోయినా మార్పులు సాధించగలడడం ఆయన సామర్థ్యానికి అద్దం పడుతుంది. నా పుస్తకం కేంద్ర బిందువు ఇదే. మన్మోహన్ సింగ్ ను ఆర్ధిక సంస్కరణలకు ఆద్యుడంటారు. కానీ మీ పుస్తకం ప్రకారం పీవీ ఆర్ధిక సంస్కరణలకు చాలా ముందు నుంచే యథార్థవాదిగా మారారు. కాబట్టి పీవీని యదార్థ సంస్కరణ వాదిగా చెప్పవచ్చా? నరసింహారావు సంస్కరణలకు ఆద్యుడనటం లో ఎలాంటి సందేహమూ లేదు. ఆయన సూక్ష్మస్థాయిలో సంస్కరణలను తేగలిగారు . టెలికాం విధానం వంటి పత్రాల్లో ఆయన వ్రాసిన నోట్స్ ను నేను చూశాను. ఆయన సంస్కరణల ఫలితంగానే ఈ దేశంలో వంద కోట్ల మొబైల్ ఫోన్లు వచ్చాయి. ఆయన ప్రైవేటు రంగాన్ని టెలికామ్ లోకి రానిచ్చారు. ఆయన విదేశీ సంస్థాగత పెట్టుబడులను ఆమ్వానించారు. సంస్కరణ రాజకీయంగా ప్రజాదరణ పొందవని ఆయనకు తెలుసు. అందుకే ఆయన సంస్కరణలను తానే తెచ్చానని చెప్పుకోలేదు. అయితే మన్మోహన్ కూడా చాలా కీలక పాత్ర పోషించారు. పీవీ రాజకీయ కారణాల వల్ల పొరబాట్లు చేస్తూ ఉంటే ఆయనను సరిదిద్దారు. ఆయన పీవీకి నమ్మకమైన అనుచరుడిగా నిలిచారు. చాలా మంది కాంగ్రెస్ వారి వలె కాకుండా ఆయన పీవీ పట్ల కృతజ్ఞతతలో ఉన్నారు. పీవీ హయాంలో రెండో అతి ముఖ్యమైన అంశం బాబ్రీ ఉదంతం. బాబ్రీ కట్టడాన్ని కూల్చేస్తూంటే ఆయన నిద్ర పోయారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ మీ పుస్తకం ఆయన నిద్రపోలేదని, పరిస్థితులను సమీక్షిస్తూ వచ్చారని చెబుతోంది. ఆయన అద్వానీని నమ్మి మోసపోయారని భావిస్తున్నారా? ఆయన ఖచ్చితంగా పొరబాట్లు చేశారు. ఒక్క అద్వానీ విషయంలోనే కాదు. నవంబర్ 15, 1992 నుంచి నవంబర్ 30 వరకూ అన్ని సమావేశాల పత్రాలను నేను పరిశీలించాను. ఆయన హిందూ నేతలందరినీ కలుసుకున్నారు. ఆయన శంకరాచార్యను, అశోక్ సింఘల్ ను, విశ్వహిందూ పరిషద్, ఆరెస్సెస్, బిజెపి నేతలను పదేపదే కలుసుకున్నారు. ఆయన లక్ష్యం ఒక్కటే. బాబరీ కట్టడాన్ని కాపాడమని వేడుకున్నారు. అంటే డిసెంబర్ 6 న ఏదో జరుగుతుందని ఆయన ముందుగానే ఊహించారా? ఇది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాంటిది. ఏదో ఒకటి జరగాలి. ఎవరో ఒకరు గెలవాలి. అక్టోబర్ 31, 1992 న విహిప మసీదు పక్కనే పూజ చేస్తామని, మసీదుకు ఏమీ కాకుండా చూస్తామని హామీ ఇచ్చింది. అయితే లక్ష మంది కరసేవకులు జమకూడితే మసీదు కుప్పకూలే అవకాశం ఉందన్న అనుమానాలు అందరికీ ఉన్నాయి. నిజానికి ఆ సమయంలో రెండు కట్టడాలు కుప్పకూల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకటి బాబరీ కట్టడం. బిజెపి, సంఘపరివార్ లు దీన్ని కూల్చేందుకు ప్రయత్నించాయి. రెండవది - పార్టీలోని రాజకీయ ప్రత్యర్థులు పీవీని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. అర్జున్ సింగ్, శరద్ పవార్ వంటి వారు ఏది ఏమైనా పీవీని తొలగించాలని ప్రయత్నించారు. పీవీకి ఈ ఎత్తుగడలన్నీ తెలుసు. ఆయన సమస్య ఏమిటంటే రాజ్యాంగ పరిధికి లోబడే బాబరీ కట్టడాన్ని కాపాడాలి. కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని 356 వ అధికరణం ప్రకారం బర్తరఫ్ చేయడం ఒక్కటే మార్గం. కానీ ఆయన సొంత న్యాయశాఖ మంత్రి, క్యాబినెట్ ఆఖరికి వామపక్షాలు సైతం బర్తరఫ్ చేస్తే సమస్యలు వస్తాయని వాదించాయి. కళ్యాణ్ సింగ్ తాను కట్టడాన్ని కాపాడతానని మాట ఇచ్చారు. జాతీయ సమైక్యతా మండలి, క్యాబినెట్, న్యాయస్థానం ఇలా అన్ని చోట్లా ఆయన ఈ విషయంలో హామీ ఇచ్చారు. కానీ ఆయనను నమ్మే పరిస్థితి లేదు. నేను క్యాబినెట్ సమావేశం మినట్స్ ను చూశాను. ఒక్క క్యాబినెట్ మంత్రి కూడా కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం బర్తరఫ్ ను సమర్థించలేదు. పీవీ జీవితంలో రెండు దశలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి మే 21, 1991 కి ముందు. ఆ తరువాత. రాజీవ్ మృతికి ముందు ఆయన సన్యాసి కావాలనుకున్నారు. పుస్తకాల్లో మునిగిపోయారు. కానీ రాజీవ్ చనిపోగానే ఆయన ఒక్కసారి యాక్టివ్ అయిపోయారు. మీ పుస్తకం ప్రకారం ఆయన ప్రధాని కావడానికి చేయాల్సిందంతా చేశారు. ఇది కాస్త ఆశ్చర్యకరంగా ఉంది. దీనిని కాస్త వివరించగలరా? పీవీ నరసింహారావు లో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఆయనకు రాజకీయ పరిస్థితులు, సందర్భాల పట్ల ఉన్న లోతైన అవగాహన. గ్రహాలు తనకు అనుకూలమౌతున్నాయని అనిపించిన మరుక్షణం ఆయన తన మనసును మార్చేసుకోగలరు. పరిస్థితులు మారగానే తన మనో భూమికను కూడా మార్చుకుంటారు. ఆయన సన్యాసి అవుదామని అనుకున్నారు. కుర్తాళం పీఠాధిపతి బాధ్యతను స్వీకరించేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ చనిపోయారని ఆయనకు ఫోన్ వస్తుంది. మరుసటి ఉదయం నాలుగున్నరకే ఆయన రాష్ట్రపతి జాయింట్ సెక్రటరీ గోపాల్ కృష్ణ గాంధీకి ఫోన్ చేసి తాను రాష్ట్రపతినిని కలవాలనుకుంటున్నట్టు చెప్పారు. ఎందుకు కలవాలనుకున్నారు అని నేను గోపాల్ గాంధీని అడిగితే ఆయన నవ్వుతూ ఈ సమావేశం క్షేమ సమాచారాల కోసం జరిగిన సమావేశం మాత్రం కాదని అన్నారు. పీవీ డైరీ కూడా ఆయన తనకు ప్రధాని అయ్యే అవకాశం ఉందని పేర్కొంటుంది. ఆయితే ఆయన ఎంత తెలివైన వారంటే కోరికలు ఎన్ని ఉన్నా, పథకాలు ఎన్ని రచించినా తనకు పదవి కావాలన్న ఆకాంక్ష ఉన్నట్టు తెలిస్తే కాంగ్రెస్ పార్టీలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయని ఆయనకు తెలుసు. ఆయనకు సోనియా గాంధీకి మధ్య సంబంధాలు ఎలా దెబ్బతిన్నాయి? ప్రధానకారణం ఏమిటి? నిజానికి పీవీ ఎదుర్కొన్న అనేక సమస్యల్లో సోనియా గాంధీ ఒక సమస్య మాత్రమే. ఆయన పార్టీ ఆయనను ద్వేషించేది. ఇందులో సోనియా ప్రమేయమేమీ లేదు. నిజానికి తొలి రెండు సంవత్సరాలు రాజీవ్ మరణంతో ఆమె పెను విషాదంలో ఉన్నారు. ఆమెకు రాజకీయాల పట్ల ఎలాంటి ఆసక్తీ లేదు. ఆమెను మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. ఆమె ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకోవాలని కూడా అనుకున్నట్టు ఎక్కడా దాఖలాలు లేవు. అయితే 1993 నుంచి ఆమె పార్టీలోనే పివికి వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహించింది. అసలు విషాదమంతా ఆయన రాజీనామా చేసిన తరువాత ఆయన పట్ల వ్యవహరించిన తీరులోనే ఉంది. సోనియా, కాంగ్రెస్ పార్టీల వ్యవహారశైలి సిగ్గుపడాల్సిన రీతిలో ఉంది. ఆయన భౌతిక కాయాన్ని అవమానపరిచారు. ఆయన కేసులకు హాజరవుతుంటే ఒక్కరూ తోడు రాలేదు. పార్టీ వెబ్ సైట్ లో పార్టీ ఆర్ధికసంస్కరణల చరిత్ర గురించి వ్రాసినప్పుడు అందులో పీ వీ పేరే లేదు. ఆయన జ్ఞాపకాలను చెరిపేయాలన్న ప్రయత్నం అనవసరం. కానీ ఆయన మళ్లీ వార్తల్లోకి ఎక్కుతున్నారు. అంతే కాదు. ఆయన వారసత్వం మాది అని పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ ఆయనను తిరస్కరిస్తే, బిజెపి, టీఆర్ఎస్లు ఆయన వారసత్వాన్ని సొంతం చేసుకునే ప్రయత్నాలు చేస్తాయి. -
'నరసింహుడు' పుస్తకావిష్కరణ
హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై సమగ్రమైన పుస్తకం రావడానికి 12 ఏళ్లు పట్టిందని 'సాక్షి' ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి అన్నారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత పీవీ నరసింహారావుదేనని పేర్కొన్నారు. బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణా హోటల్ లో గురువారం సాయంత్రం జరిగిన 'నరసింహుడు' పుస్తకావిష్కరణ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రమూర్తి మాట్లాడుతూ... పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు, విదేశాంగ విధానం, పంజాబ్ లో అశాంతిని అంతం చేసేందుకు ఆయన చేసిన కృషి గురించి ఈ పుస్తకంలో సమగ్రంగా ఉందన్నారు. అణ్వస్త్రాన్ని తయారు చేయడంలో పీవీ పాత్ర గురించి కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారని వెల్లడించారు. పీవీ నరసింహారావుపై వినయ్ సీతాపతి ఇంగ్లీషులో రాసిన 'హాఫ్ ఏ లయన్' పుస్తకాన్ని 'నరసింహుడు' పేరుతో తెలుగులోకి అనువదించారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, పీవీ తనయుడు రాజేశ్వరరావు, సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు, హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య తదితరులు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు.